*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 113 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము -43 🌻*
అందువలననే సాధన చతుష్టయ సంపత్తి, యమనియమాదులు తప్పక అధికారికములై వుంది. శిష్యుడు అనిపించుకోవాలి అంటే, తప్పక సాధన చతుష్టయ సంపత్తిని, అష్టాంగ యోగాన్ని, అభ్యసించినటువంటి సాధకుడై ఉండాలి.
మామూలుగా సంసారికులై, విషయవ్యావృత్తితో విషయానురక్తులై శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయములందు మనస్సును పోనిస్తూ సదా విషయసుఖాన్ని ఆసక్తితో అనుభవించేటటువంటి సామాన్యమైనటువంటి మానవులకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం అందని మామిడి పండు లాంటిది. అది ఎప్పటికి సుదూరంగానే ఉంటుంది. ఎంతకాలమైనా మాకు సాధ్యపడటం లేదండీ, ఎంత ప్రయత్నించినా, సాధ్యపడడం లేదండీ అనేటటువంటి వారంతా తప్పక ఈ స్వాధ్యాయశీలిగా అవ్వవలసినటువంటి అవసరం ఉన్నది.
ఎక్కడెక్కడైతే మనస్సు ఆ రకమైనటువంటి పద్ధతిగా ప్రవృత్తి మార్గంలోకి దిగివచ్చేస్తోందో, మనం గుర్తించాలి. ఎక్కడెక్కడ స్పందిస్తోందో గుర్తించాలి. ఎక్కడెక్కడ ప్రతిస్పందిస్తోందో కూడా గుర్తించాలి.
ఎక్కడ విశేష స్థాయిలో స్పందిస్తోంది? ఎక్కడ సామాన్యస్థాయిలో స్పందిస్తోందనేది కూడా గ్రహించాలి. ఈ గ్రాహ్యక శక్తి చాలా అవసరం. సూక్ష్మమైనటువంటి మనసును కానీ, సూక్ష్మమైనటువంటి బుద్ధిని కానీ, ఆ పైన ఉన్నటువంటి మహతత్త్వాన్ని కానీ, దానిపైనున్న అవ్యక్తాన్ని కానీ, నువ్వు గుర్తించాలి.
అంటే, ఆ రకమైనటువంటి గ్రాహ్యక శక్తి పరిజ్ఞానం పెంపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. స్వభావయుతమైనటువంటి ప్రేరణలు, ప్రేరణగా నీలో ఉత్పన్నమైనప్పుడే ఆ మార్పును గుర్తించి, సవరించుకోగలిగేటటువంటి సమర్థతని సంపాదించాలి. దీనినే “యోగః ప్రవృత్తి నిరోధకః” అని అంటారు.
సాధకులు వాక్‌సంయమనము ఎందుకు కలిగి ఉండాలి అంటే, నాలుగు మహాపాపాలు నిరంతరాయంగా చేస్తుంది. వాగీంద్రియము అన్నమాట. వాగుడుకాయలు చాలా మంది ఉంటారు, మాట్లాడడం మొదలుపెడితే దానికి వివేకం లేకుండా, విచక్షణ లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు.
ఆ మాటకి శక్తి ఉన్నదనిగాని, ఆ మాట ద్వారా సాధించ బడవలసిన లక్ష్యమున్నదని కానీ, ఆ లక్ష్యానికి లోబడే మాట్లాడాలి అనేటటువంటి నియమము లేకపోవుట చేత, అయితే ‘ఆత్మస్తుతికాని లేక పరనింద కానీ లేదా పరస్తుతి కానీ లేదా ఆత్మనింద కానీ’ ఇలా ఒకదానికొకటి వ్యతిరేక లక్షణాలతో వారిట్లా మాట్లాడుతు ఉంటారన్నమాట. ఏది మాట్లాడినా అందులో అది ఉంటుంది! తటస్థ భావన ఉండదన్నమాట! సాక్షీ భావన ఉండదన్నమాట! ఆత్మ భావన ఉండదన్నమాట! ప్రత్యగాత్మ స్థితి అసలే ఉండదన్నమాట!
మరి మన ఇంద్రియాలని వాడేటప్పుడు నీవు ఆత్మభావనలో ఉండి, పనిముట్లుగా కదా, ఉపయోగించుకోవలసింది? అంతేకానీ, ఆ పనిముట్టుయందు నీవు రమించరాదు కదా!
సుఖ, దుఃఖ అను భోక్తవ్యాన్ని స్వీకరించ రాదు కదా! అదేంటోనండీ, మాట్లాడడానికి ఎవరూ దొరకడం లేదండీ! అని బాధపడిపోయేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అనేక రకాలైనటువంటి లౌల్యత. దీనిని ఏమంటారంటే, ఇంద్రియ లౌల్యత.
లోలత్వము అంటారు. అంటే, ముట్టుకోకుండా ఉండలేడు, మాట్లాడకుండా ఉండలేడు, చూడకుండా ఉండలేడు, చెయ్యకుండా ఉండలేడు. వినకుండా ఉండలేడు, తినకుండా ఉండలేడు. అన్నిటికీ ఈ ఉండలేడు అనేటటువంటి ‘ఆ ఉండలేని తనం’ బలహీనతగా మనలో ప్రాప్తించింది అన్నమాట. అదేమిటోనండీ, ఒక్కసారైనా మా మనుమడితో మాట్లాడకుండా ఉండలేను, ఒక్కరోజు మొత్తం మీద. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి