🙏శివానందలహారీ🙏
అమల శంభుధ్యాన మను " వసంతము " తోడ
సంబంధ మొందిన స్వచ్చ మైన
నా డెంద మనియెడి నవ వనోద్యానాన
పలు పరిణామముల్ పరిఢవిల్లె
పాపంబు లనియెడి పండు టాకులు రాలె
పుణ్యపల్లవపాళి పులకలెత్తె
సద్గుణంబు లనెడి సరసంపు మొగ్గలు
పారవశ్యమనెడి భక్తి లతలు
జప వచస్సు లనెడి సారంగముల్ పుట్టె
సత్కర్మ వాసనల్ సంచరించె
జ్ఞాన సుధ పొంగి ప్రవహించె ధ్యానసీమ
బ్రహ్మవిజ్ఞాన మొదవెను భాసురముగ
శంకరా ! నిన్ను వినుతింప శక్యమగునె !
పార్వతీనాథ ! పరమేశ ! పాహి పాహి ! 47 #
శాశ్వతానందంబు సాత్త్వికంబనియెడి
సలిలంబునకు నిత్య స్థానమయ్యు
సర్వ సురోత్తమ , సంయమివర్యుల ,
హృదయాంబుజాళికిన్ సదనమయ్యు
సద్విజ సేవిత సద్వర్తితంబును
నిశ్చల మత్యంత నిర్మలంబు
కాలుష్యరహితంబు కడు శాంతయుక్తంబు
భాసుర సత్కర్మ ప్రకటితంబు
సతత శివశంకరధ్యాన సరసి యందు
సంచరించుము మానస రాజహంస !
పనికిరానట్టి పెక్కగు పల్వలముల
సంచరింపంగ నేలకో ? శ్రమను పొంది 48 #
✍️గోపాలుని మధుసూదన రావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి