*🧘10 -అద్వైత జ్ఞానమంజరి🧘♂
🕉🌞🌎🌙🌟🚩
మానవులకు రూపం, గుణాలు ఉన్నాయి కాబట్టి సామాన్య జీవుని జ్ఞానం ఈ రూపాలకు, గుణాలకు అతీతంగా ఆలోచించడం కష్టం. దేవుడిని నిరాకారముగా పూజించడములో తలెత్తే పెద్ద సమస్య ఇదే. దానివలన మనకు ఏదీ సరిగా అర్థం కాదు. ఆధ్యాత్మికముగా ఎంతో ఉన్నతస్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యము.
సాకారోపాసన అంటే పరమాత్మను గణపతిగానో, విష్ణువుగానో, శివుడిగానో పూజించడం. అయితే వారందరూ ఒకే పరమాత్మ అని గ్రహించాలి, లేకుంటే అజ్ఞానం పెరిగి పెద్దదై, నీ దేవుడి కంటే నా దేవుడే గొప్ప అనే దురభిమానం ఏర్పడుతుంది. ఆరాధించే దైవం ఏదైనా భక్తి ప్రదానం. అచంచల భక్తితో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానంతో వెలుగులోనికి మనం ప్రయాణించగలం. కాని అసలు సత్యం అనేది వెలుగుచీకట్లకు, జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనది.
సత్యమే పరమాత్మ! జీవుని అసలు స్వరూపం కూడా పరమాత్మే అన్నది అసలు సత్యం! సాధనతో ఆ సత్యమైన పదార్థం "నేనే" అన్న ఎరుక పొందడమే ఆత్మజ్ఞానం! దాని ఫలితమే ఆత్మానుభూతి! ఇదే అత్యున్నత స్థితి! బ్రహ్మైక్య స్థితి!
ఎప్పటికైనా ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది. ఈ ప్రాణం మరణంలేని ఆత్మతో కలిసిపోతుంది కాబట్టీ, ఓ మనసా! విచారణ చెయ్యు, సాధనతో లక్ష్యాన్ని సాధించు, ఆ "నేను"ని తెలుసుకో, అని ఒక "స్వయం ప్రేరణ" చేసుకోవాలి సాధకుడు.
ఓ పరమాత్మా! నేను చేసిన అన్ని పనులూ నీకు తెలుసు. ఇంతవరకు చేసిన పనుల ఫలితాలను మాత్రం అనుభవించేటట్లు చేసి, ఇకమీదట చేయబోయే పనుల ఫలితం నాకు అంటకుండా వాటిని నిష్కామంగా చేసేట్టు చేయి అని ప్రార్దించాలి సాధకుడు.
సాధనలో, ఎవరిచేత ప్రేరేపింపబడి మనస్సు వస్తుప్రపంచము వైపు ఆకర్షింపబడుతున్నది? ఎవరి ఆజ్ఞకు లోబడి ప్రాణము నిలుస్తున్నది? ఎవరి వలన వాక్కు ప్రకటితమౌతున్నది? ఏ జ్ఞానము కళ్ళను, చెవులను ప్రేరేపిస్తున్నది? అన్న ప్రశ్నలకు సమాధానం అన్వేషించాలి.
వీటికి సమాధానం కేనోపనిషత్తులో చెప్పబడింది! చెవికి చెవిగా, మనస్సుకి మనస్సుగా, వాక్కనకు వాక్కుగా, ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా అయివున్న వస్తువు ఒకటుంది!
దేనిని వాక్కు వ్యక్తపరచలేదో, దేనివలన వాక్కు వ్యక్తమగునో! దేనిని గూర్చి మనస్సు వూహించలేదో, దేనివలన మనస్సు సంచరించుచున్నదో! దేనిని కళ్ళు చూడలేవో, దేనివలన కళ్ళు చూడగలుగుచున్నవో! దేనిని చెవులు ఆలకించలేవో, దేనివలన చెవులు ఆలకించగలుగుతున్నవో! దేనిని ముక్కు శ్వాసించలేదో, దేనివలన ముక్కు శ్వాసించుచున్నదో అదే ఆత్మ! దానినే బ్రహ్మమని కూడా అంటారు.
ఆత్మ / బ్రహ్మము శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షీభూతమైనది, అన్ని జీవులలో నెలకొనివుంటుంది కాబట్టీ జ్ఞానంతో దాన్ని తెలుసుకోవచ్చు. జీవుని జ్ఞానానికి ఆధారంగా, సాక్షిగా ఈ ఆత్మచైతన్యస్ఫూర్తి ఎల్లప్పుడూ వెన్నంటివుంటుంది. అది సత్యము.
ప్రతివిషయాన్ని సూక్ష్మబుద్ధితో/జ్ఞానంతో ఎవడు దర్శిస్తాడో అతడు అమృతత్వమును పొందుతాడు. ఆత్మద్వారానే జీవుడు వీర్యవంతుడవుతాడు. జ్ఞానము ద్వారానే జీవుడు అమరుడవుతాడు.
జీవుడు దీనిని ఈ జన్మలోనే గనుక తెలుసుకుంటే, సత్యము అవగతమౌతుంది. తెలుసుకోలేకపోతే లోకంతో బంధం ఏర్పడుతుంది. మరల ఈ లోకంలో జన్మించవలసి వస్తుంది. కావునా జ్ఞానవంతులు సర్వభూతములలో ఒకే ఆత్మను దర్శించి, బంధరహితులై, లోకంనుండి పూర్తిగా విముక్తిని పొంది జీవన్ముక్తులవుతున్నారు.
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి