26, నవంబర్ 2020, గురువారం

శ్రీ సత్యనారాయణస్వామి వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణస్వామి వ్రత మహాత్మ్యము


వ . ఆ సమయ మందున ...


భూరి ధనమున్న భూపతి బొక్కసమున 

ద్రవ్యమును కొంద రారేయి తస్కరించి 

భటుల గాంచియు భయమున పరుగులెత్తి 

దూరి  రా సాధుగృహమున దూకుడుగను    81


దొంగ లారీతి తెచ్చిన దొంగ సొత్తు 

భటుల వల్లను యత్యంత భయము నొంది 

సాధు వున్నట్టి  స్థలమున జారవిడిచి 

మరలి చూడక వెనువెంట మాయ మైరి      82


తస్కరుల వెంట వచ్చిన దండధరులు 

సాధు వల్లుడు యున్నట్టి సదన మందు 

తస్కరించగ బడినట్టి ధనము గాంచి 

తస్కరులు వీరె యనిమది తలచి రంత.    83


అంత రాజభటులు యా వర్తకుల బట్టి 

పంతగించి కట్టి బంధనముల 

రాజు వద్ద కంత రయమున గొంపోయి 

విన్నవించి రపుడు కన్నదంత                   84

                         

అంత చంద్రకేతు యాగ్రహం బొందియు 

సత్యదేవుమహిమ సంక్రమించ 

నెరపకుండ యెట్టి నేరపారోపణ 

యిరువు రొర్తకులను చెరను నెట్టె            85


సత్యవ్రతముమాని సాధువు యిల్లుండు 

వెతల జిక్కి రరయ గతిని దప్పి 

యెంత వేడుకొనిన సుంతైన వినకను 

నేర మెఱుగకున్న నెట్టె చెరలొ               86


మఱియు చంద్ర కేతు మామ యిల్లుండ్రవి 

ధనము నంత గొనియు దండనిచ్చె 

సర్వ ధనము పోయి సంతాపమే దక్కె 

సత్యదూరుడైన  సాధువునకు             87


ఇట యిర్వురు యిటులుండను 

యట మాతా సుతలు యింట యాఱడి పడుచున్ 

పటుతర దారిద్ర్యమునను 

కటకట పడుచుండి రరయ కష్టము లందున్ 88



ఇంట చోరులు పడియును యిల్లు దోచ 

కలిమి సర్వము నశియించి కలిగె లేమి 

పూట గడవక యిర్వురు పాటు బడుచు 

తల్లడిల్లుచునుండిరి తల్లి సుతలు            89


కలిమి యందు యెపుడు తులతూగు వారికి 

కలిమి దక్క నేడు కడుపు మాడె 

చేత గవ్వ లేక చేయునదియు లేక 

తిరిప మెత్త దిగిరి తిండి కొఱకు             90


                                 సశేషము….


    ✍️గోపాలుని మధుసూదన రావు🙏

కామెంట్‌లు లేవు: