రామాయణమ్ 136
......................
దూషణుడు ,వీడు ఖరుడి సేనాపతి ,తనఎదురుగా సేన మొత్తము నాశనము అవ్వటాన్ని చూసి వాడిలో పట్టరాని ఆవేశము పుట్టింది.వజ్రాయుధాల లాంటి బాణాలతో ఒక్కసారిగా రామున్ని కప్పివేసాడు. వాడి ఆక్రమణను చూసి రాముడికి కోపము హెచ్చి ఒక అర్ధ చంద్రాకారపు బాణముతో వాడి ధనుస్సు త్రుంచి ఇంకొక నాలుగుబాణములతో వాడిరధానికి పూన్చిన గుర్రాలను చంపి వేసాడు.ఇంకొక బాణముతో సారధిని నేలకూల్చాడు ఈ పనులన్నీ ఒకదానివెంట మరొకటి రెప్పపాటుకాలములో పూర్తిచేసాడు రాముడు.
.
దూషణుడు ఇంకా రెచ్చిపోయాడు, రధము మీదున్న బంగారపు పట్టీలు,ఇనుపమేకులతో కూడి ఉన్న పరిఘను బయటకు తీసాడు .దానికి శత్రుసైనికుల శరీరాలను మర్దించినప్పుడు కారిన వస దట్టముగా అంటిఉన్నది.
.
తనమీదకు ఆయుధాన్ని పట్టుకొని దూకుడుగా వస్తున్న వాడి బాహువులను రెండింటినీ ఖండించి వేసాడు రామచంద్రుడు.రెండుచేతులూ నేలపై రాలగా వాడు నిలువలేక నేలపై దబ్బున పడిపోయాడు.
.
ఎటు చూసినా రాక్షస కళేబరాలే వారి రక్తము ఏరులై ప్రవహిస్తూ నేలను బురదబురదగా చేసింది. సుందరమైన ఆ ప్రాంతమిప్పుడు నరకాన్ని తలపిస్తున్నది.
.
తన సేన మొత్తము ఆవిధముగా నాశనము అవ్వటము చూసిన ఖరుడు కోపము పట్టలేక రాముడి మీదికి దూసుకుంటూ వస్తున్నాడు, వాడి మార్గానికి అడ్డముగా త్రిశిరుడు అనే సేనాపతి వచ్చి నిలిచి ప్రభూ! నీకెందుకు శ్రమ నేనున్నానుగా అంటూ వాడిని త్రిప్పి పంపి,ముందుగా మృత్యువును తానె కౌగాలించుకోవాలన్నట్లుగా రాముడి తో యుద్ధానికి బయలు దేరాడు.
.
ఇద్దరి మధ్యా ఘోరమైన యుద్ధము జరిగింది. ఒక సింహానికి ఒక ఏనుగుకు మధ్య జరిగినట్లుగా ఉన్నదది.
.
త్రిశిరుడు ప్రయోగించిన మూడు బాణాలు రాముని నుదురుకు తగిలి బాధించాయి. వాడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూనే, రా ! ఇదిగో నా బాణాలు కూడా స్వీకరించు నీవు! అంటూ వాడి వక్షస్థలం మీద బలంగా పద్నాలుగు బాణాలతో కొట్టాడు.వాడు తేరుకోకముందే వాడి సారధిని,గుర్రాలను ఒక్క వేటున నేలకూల్చాడు. అదిగమనించిన త్రిశిరుడు గాలిలోకి ఎగురబోగా వాడిగల శరములతో వాడి వక్షస్థలం బద్దలుకొట్టాడు. ఇంకొక బాణముతో వాడి శిరస్సు ఖండించి వేసాడు.
.
ఖరుడికి ఒక్కసారిగా గుండె జలదరించింది, ఈ మానవుడేమిటి?
ఇలా ఒంటరిగా ఇన్నివేలమంది వీరాదివీరుల తలకాయలు ఎగురగొట్టడమేమిటి ?
అని వాడిలో ఒక రకమైన జంకు కలిగింది.అయినా మూర్ఖముగా కోపించి ధనుస్సు ఎత్తిపట్టుకొని నారి సారిస్తూ రాముడి మీదకు వెళ్లి అస్త్రాలతో రకరకాల విన్యాసాలు చేశాడు.
.
ఇద్దరి ధనుస్సులనుండి బయల్వెడలిన బాణాలు ఆకాశాన్నంతా కప్పివేసి సూర్యకిరణాలు జొరబడటానికి కూడా అవకాశము లేకుండా చేసివేసాయి.
.
దెబ్బతిన్న పులిలాగా ,తోకతొక్కిన త్రాచులాగా ,రేచుకుక్కలాగా ఖరుడు మీదమీదకు వస్తున్నాడు.
రాముడిని తీవ్రమైన బాణాలతో వేధిస్తున్నాడు వాడు..
.
రాముడు అంతమందినీ ఎదుర్కొని ఉన్నాడు కాబట్టి అలసి పోయి ఉన్నాడనుకొన్నాడు.
.
కానీ యుద్ధము జరుగుతున్నకొద్దీ అవక్రపరాక్రముడైన రాముని రణోత్సాహము ద్విగుణీకృతం అయ్యింది.
.
ఒక సింహాన్ని మరొక సింహము ఎదుర్కొన్నట్లుగా ఉన్నది.
.
కొంతసేపటికి ఖరుడు రాముని చేతిలోని ధనస్సును ఒడుపుగా విరగగొట్టాడు.వెంటనే రాముడి కవచాన్ని కొట్టాడు.ఖరుడి దెబ్బకు స్వర్ణకాంతులీనే రాముని కవచము నేలమీద పడిపోయింది.వెంటవెంటనే ఎన్నో నిశిత శరాలతో రాముడిని పీడించాడు ఆ దానవుడు..
.
రాముడు కృద్దుడైనాడు,కాలరుద్రుడైనాడు,పొగలేకుండా భగ్గున పైకిలేచిన అగ్ని జ్వాల అయినాడు.
.
అగస్త్య ముని ఇచ్చిన వైష్ణవ ధనువు చేతబూనాడు, ఒక బాణముతో రధము కాడిని,నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను,ఆరవ బాణముతో సారధిశిరస్సును, మూడు బాణాలతో రధము ముందు భాగాన్నీ,రెడుబాణాలతో రధపు ఇరుసును,,ఇంకొక బాణముతో ఖరుడి ధనుస్సును,పదమూడవ బాణముతో ఖరుడిని తీవ్రముగా కొట్టాడు.
.
ఒక శ్రేణిలో ప్రయోగించబడిన బాణాల దెబ్బకు దిమ్మరపోయిన ఖరుడు అన్నీ కోల్పోయిన వాడై చేతిలో గద ధరించి రధమునుండి నేలమీదికి దూకాడు.
.
అలా నిలుచున్నా వాడిని చూసి ,
ఎందుకురా మీరు ఆకారణముగా శాంత స్వభావులైన మునులను హింసిస్తారు! మీరు పూర్వము హింసించి చంపిన మునలందరూ ఇదిగో మీ చావును పైనుండి కళ్ళారా చూడబోతున్నారు .ఇదుగో నీ తల తాటిపండు రాలినట్లు నేలరాలుతుంది చూడు అంటూ తన మీదికి వాడు విసిరిన గదను చూర్ణము కావించాడు.
.
ఇద్దరి మధ్యా నువ్వానేనా అన్నట్లుగా సాగిన యుద్ధములో రాముడు పైచేయి సాధించి ఒక బాణముతో వాడి రొమ్ముమీద కొట్టగా అది పిడుగులాగా వాడిని తగిలి వాడి ప్రాణాలు తీసి భూమిలో కూరుకుపోయింది,.
.
జనస్థానములో రాక్షసుల ఆటలిక చెల్లవన్నట్లుగా సింహములాగా నిలుచున్నాడు రాముడు,
.
ఇంతమంది రాక్షసులను కేవలము ఒక గంటాపన్నెండు నిముషాలలో రామసింహము వేటాడింది.
.
సహజనీల వర్ణుడు రాముడు ,ఆయన శరీరము నీలాకాశములో నిప్పుల ప్రవాహము కనపడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది. నీలపుశరీరము మీద ఎర్రని రక్తపుచారికలు.అలా కనిపిస్తున్న రణకోవిదుడు రాముడిమీద ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు దేవతలు.
.
రండిరా ఎవడొస్తాడో చూస్తాను !
ఇప్పుడే వేట మొదలయ్యిది అన్నట్లుగా నిలుచున్నాడు ధనుస్సు చేతబూని శ్రీరామచంద్రుడు.
.
జానకిరామారావు వూటుకూరు.
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి