4, డిసెంబర్ 2020, శుక్రవారం

*ధార్మికగీత - 29*

 *ధార్మికగీత - 29*            

         *శ్లో:- హరే ర్నామ హరే ర్నామ ౹*

                 *హరే ర్నామైవ కేవలం ౹*

                 *కలౌ నాస్త్యేవ నాస్త్యేవ ౹*

                 *నాస్త్యేవ గతి రన్యథా ౹౹*

                                     *****

*భా:- కృత త్రేతా ద్వాపర యుగాలలో ఋషులు, మహర్షులు, రాజర్షులు మునులు, యోగులు, రాజులు శమ దమాలు, నియమనిష్ఠలు కలిగి దీక్షాదక్షతలతో యజ్ఞాలు, యాగాలు చేసి భగవానుని ప్రసన్నం, ప్రత్యక్షం చేసుకున్నారు. ఆధునికత, సాంకేతికత, యాంత్రికత, హేతుకత వెల్లివిరిస్తున్న కలియుగంలో అవి అసాధ్యము కనుక కేవలము "భగవన్నామసంకీర్తన" కన్న వేరే దారి లేదు. రామ, హరి, కృష్ణ, శివ అనే రెండక్షరాల నామామృతగానం మనసారా, నోరారాచేస్తే, మానవాళి పాపాలు, తాపాలు, పాతకాలు, మహాపాతకాలు పూర్తిగా హరించుకుపోతాయి. "రా" అనగానే నోటి నుండి పాపాలు బయటికి వెళితే, అవి తిరిగి మన చెంతకు రాకుండా "మ" కవాటంలా పెదవులు మూసివేస్తుందనే కవి చమత్కారము అక్షరసత్యము. ముమ్మాటికి దైవనామమే మనకు శ్రీరామరక్ష. మనమే కాదు మన మనసులు, పరిసరాలు, వాతావరణము, , ఊరూ వాడా అన్ని నగర సంకీర్తనలో భగవన్నామగానామృత దివ్యతరంగాలతో పునీతమవుతాయి. " నామస్మరణాత్ అన్యోపాయం నహి నహి" అని రూఢిగా చెప్పబడింది. కాన మనం ప్రతి పనిని భగవదర్పణ భావంతో చేయగలగాలి. మనోవాక్కాయాలను భగవచ్చింతనలో నిమగ్నం చేయాలి*.

                                  *****

                    *సమర్పణ : పీసపాటి*

కామెంట్‌లు లేవు: