4, డిసెంబర్ 2020, శుక్రవారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


ఉద్యోగపర్వం.148


ఉలూకుడు వెళ్లిపోయిన తరువాత, ధర్మరాజు ద్రుష్టద్యుమ్నునితో ఏకాంత సమాలోచనలు జరిపి. యెదుటివారి బలాలను బేరీజు వేసుకుంటూ యుద్ధ వ్యూహం చేయసాగాడు. 


 ఏయే వీరులు యెవరితో ప్రత్యక్షంగా తలపడాలో నిర్ణయించారు, వారిరువురూ.  సర్వసేనాని ధృష్టద్యుమ్నుడు స్వయంగా ద్రోణునితో తలపడాలని నిశ్చయించారు.  తమ ఏడు అక్షౌహిణుల సైన్యంలో యేసేన యెక్కడవుండాలో నిశితంగా అలోచించి   ఆదేశాలు యిచ్చారు, అందరికీ.    ఆదేశాలు యిచ్చే సమయంలో శత్రురాజుల గూఢచారులెవరూ ఆచుట్టుప్రక్కల లేకుండా చూసుకున్నారు.  


' సంజయా భీష్ముని పరిస్థితి యేమిటి ?  ఆయనకేమీ ముప్పులేదుకదా !  ' అని ధృతరాష్ట్రుడు  అడిగాడు.  దానికి సంజయుడు, ' మహారాజా !  శాంతనవుడు, తన శక్తి ఆయుధం ధరించి, కుమారస్వామికి ప్రణమిల్లి, ఉత్సాహపూరిత వచనాలతో దుర్యోధనునికి ధైర్యం చెప్పాడు, సర్వ సైన్యాధ్యక్షుని హోదాలో.   ఆ తరువాత పాండవుల వలే వీరుకూడా రహశ్య సమాలోచనలు చేసి, వీరుల స్థానాలు నిర్ణయించారు.  ఆసమయంలో అక్కడే వున్న కర్ణునితో భీష్మునికి వాద ప్రతివాదాలయ్యాయి. కర్ణుని శాపగ్రస్తుడిగా, కనీసం అర్ధరధునిగా కూడా భీష్ముడు గుర్తించలేదు.  కర్ణుడు అలిగి వెళ్ళిపోయాడు.  


ఆ తరువాత, భీష్ముడు, ' దుర్యోధనా ! కృష్ణార్జునులతో సహా, పాండుసేనలలో యెవరినీ నన్నుదాటి ముందుకు రానీయకుండా నిలువరించే చేవ నాకు వున్నది.  అయితే, పాంచాలరాజు కుమారుడు, శిఖండి, నాముందుకు ధనుర్ధారి అయి వస్తే, నేను అస్త్ర సన్యాసం చేస్తాను. ' అన్నాడు.  దుర్యోధనుని గుండె గుభేలుమన్నది,  ఆమాటలకు.  ' తాతా ! మీరెందుకని శిఖండిని సంహరించరు, ఏదో బలవత్తరకారణం వుండే వుంటుంది, దయచేసి చెప్పండి. ' అని ఆతృతగా అడిగాడు   భీష్ముడు శిఖండిని చంపనని చెప్పడానికి గల కారణం వివరిస్తున్నాడు :

' దుర్యోధనా !  ఇది రెండుతరాల వెనుకటి కథ.  నేను, కాశీరాజు ముగ్గురుకుమార్తెలైన అంబ, అంబికా, అంబాలిక అనే కన్యలను, మీ తాతగారైన విచిత్రవీర్యునికి యిచ్చి వివాహం చేయసంకల్పించి, వారి స్వయంవర సమయంలో బలవంతంగా, శత్రు రాజులను జయించి, వారిని, హస్తినాపురానికి తీసుకువచ్చాను. వారిని విచిత్రవీర్యునికి యిచ్చి వివాహం చేసే యేర్పాట్లలో వున్నప్పుడు, అందరిలో పెద్దదైన అంబ నాదగ్గరకు వచ్చి, తాను అప్పటికే సాళ్వరాజుకు మనసిచ్చాననీ, స్వయంవరంలో అతనిని వరిద్దామని అనుకుంటుండగా, తనను నేను తీసుకువచ్చాననీ, సాళ్వుడు కూడా తనను ప్రేమిస్తున్నాడు గనుక, తనను దయచేసి, సాళ్వుని వద్దకు పంపమని నన్నుకోరింది. ' 


' నేను ఆమెకోరిక మన్నించి సకలమర్యాదలతో, పురోహితులను వెంటనిచ్చి, ఆమెను సాళ్వరాజు వద్దకు పంపించాను.  అయితే, సాళ్వుడు అందుకు వప్పుకోలేదు.  పరాక్రమంతో నిన్ను భీష్ముడు తీసుకు వెళ్తుండగా నిన్ను నేను దక్కించుకోలేక పోయాను.  కాబట్టి, నేను నీకు తగినవాడను కాను.  నీవు భీష్ముని సొత్తువే. ' అని తిరిగి నావద్దకు పంపించాడు. నా వద్దా ఆమెకు ఆశ్రయం దొరకలేదు. '


' ఈ హఠాత్సంఘటనలకు అంబ మనసు గాయపడింది.  దీనికి కారకులెవరని ఆలోచించింది.  చివరకు నేనే కారణమని తేల్చుకుని, నాపై పగ సాధించాలని.  తపస్సు చేయడానికై తగిన గురువు కోసం వెదకసాగింది.  ఆమెకు హోత్రవాహనుడు     అనే రాజర్షి కనిపించాడు.  ఆయన ఆమెను ఊరడిస్తుండగా,  ఆమె తన మనుమరాలుగా  తెలుసుకున్నాడు.   ఆమె చనువుగా, దృఢంగా,  తాతగారితో, తనకు భీష్ముని వధించడమే ఏకైకలక్ష్యం అని  చెప్పింది.  హోత్రవాహనుడు  తన ప్రియశిష్యుడైన పరశురామునికి కబురుపంపి, అంబ అభీష్టం ఆమె నోటితోనే చెప్పించాడు. '


' అంబ కన్నీటిని చూసి పరశురాముడు యెంతో బాధపడి, నేను భీష్ముని నిన్ను పరిణయమాడేటట్లు ఒప్పిస్తాను. లేనిచో అతనిని సంహరిస్తాను. ' అని చెప్పి అంబను తీసుకుని పరశురాముడు కురుక్షేత్రం లో సరస్వతీ నదీసమీపంలో బసచేసి, నాకు  కబురుపంపాడు.  నేను గోవుని ముందుపెట్టుకుని పరశురాముని ప్రణమిల్లి వచ్చిన కారణం అడిగాను.  ' భీష్మా  !  నీవలననే ఈమె బ్రతుకు అగమ్యగోచరంగా తయారయింది.  సాళ్వుని స్వయంవరంలో గ్రహించి పరిణయమాడవలసిన ఆమె జీవితం,  చీకటి మయమైంది.  కాబట్టి నీవే, యీమెను చేపట్టాలి. ' అని నన్ను బలవంత పెట్టాడు, పరశురాముడు. 


దానికి నేను కూడా ' గురుదేవా !  ఆమె మరియొకరిని ప్రేమించిందని తెలిసి, నా తమ్మునికి కట్టబెట్టలేను. నేను నాప్రతిజ్ఞను ఉపసంహరించుకుని, యిప్పుడు వివాహ మాడలేను.  స్వయంవర సమయంలోనే ఆమె సాళ్వరాజు ప్రేమ వృత్తాంతం చెబితే, ఇంత అనర్ధం జరిగేది కాదు. ' అని మరీమరీ చెప్పాను.  చివరికి, నన్ను యుద్ధానికి రెచ్చగొట్టి, నామీదే శిష్యుడనని కూడా చూడకుండా, పోరుకు సిద్ధపడ్డాడు. 


' దుర్యోధనా !  ఆ విధంగా మా యిద్దరికీ, యిరవైరెండురోజులు భయంకరయుద్ధం జరిగింది.   మా ఇరువురి పోరు తారస్థాయి చేరి, ప్రళయ స్వరూపం పొందుతుండగా, లోక కల్యాణార్థం మా ఇరువురినీ, దేవతలు  యుద్ధం ఆపుజేయమని చెప్పి,  ప్రళయ సృష్టి వద్దని పరశురామునికి నచ్చజెప్పి, అంబను తన త్రోవను తాను చూసుకోమని పరశురాముని చేత చెప్పించారు.  ఆమె కోపంగా అక్కడనుండి వెళ్ళిపోయింది.  ఆమె చర్యలు జాగ్రత్తగా గమనించమని ఆమెపై గూఢచారులను నియమించి, ఎప్పటికప్పుడు ఆమె సమాచారం రాబట్టగలిగాను. 


'  గాంధారీ తనయా !  ఆమె కఠోరతపస్సు మొదలుపెట్టింది.  ఆమెను ఆపడం బ్రహ్మకైనా తరంకాదని, నారదులవారు నాకుచెప్పి, కాలమే యీవిషయంలో పరిష్కారం చూపిస్తుంది. అని  నచ్చజెప్పారు.  


అంబ తపస్సు ఉగ్రరూపం దాల్చింది.  ' దుర్యోధనా ఆమె ఆరునెలలు వాయుభక్షణతోనే తప్పస్సు కొనసాగించింది. శరీరం శుష్కం అయింది.  తల జడలుకట్టి, శరీరం మకిలమై పాషాణం లాగా వుండిపోయి తపస్సు కొనసాగించి,  సంవత్సరం పాటు యమునా నదీ జలాలలో మొలలోతు నీళ్లలో, మరియొక సంవత్సరం  ఒంటికాలిపై నిలబడి తపస్సు చేసి, శివుని మెప్పించి,  ఆయనను ప్రత్యక్షం చేసుకోగలిగింది.


త్రిశూలధారి ఆమెముందు చిరునవ్వుతో నిలబడ్డాడు.  ఎందుకింత కఠినమైన  తపస్సు చేస్తున్నావు ? అని అడిగాడు. ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు.   అంబ ఏమికావాలని  అడిగిందో !  సాంబశివుడు  యేమి వరమిచ్చాడో ! 


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: