4, డిసెంబర్ 2020, శుక్రవారం

**భాగవతం 6వ స్కందము ఖండము-4**

 **దశిక రాము**


**భాగవతం 6వ స్కందము ఖండము-4**


అమిళోపాఖ్యానముా--2 


జఅప్పటినుండి అజామిళుడు ఆమె చిక్కని చెక్కిళ్ళను, చక్కని చిరునవ్వును, కదులుతున్న ముంగురులను, నున్నని నుదురును, చెవులదాకా వ్యాపించిన వాల్గన్నులను, బిగువైన కుచాలను, విశాలమైన కటి ప్రదేశాన్ని మాటిమాటికి స్మరింపసాగాడు. అతని మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో క్రుంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు. అజామిళుడు కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రి సంపాదించిన ఆస్తి నంతటినీ దాని పాలు చేసాడు. సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. యౌవనవతి, కామక్రీడాసక్తి కలది, సుగుణవతి, సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక, నీచుడై తెలివితక్కువతనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు. బంధువులను తిట్టి, సజ్జనులను బాధించి, దిక్కులేని దీనులను చిక్కులపాలు చేసి, దారులు కొట్టి దోచుకొనడంలో దిట్టయై, నిందలను లెక్క చేయకుండా సంపాదించిన ధనాన్ని ఆ సుందరి కిచ్చి ఆమె చనువును, అందాన్ని మెచ్చిన మనస్సుతో జీవింపసాగాడు. ఉచితమైన వేదాలను గురించి చర్చించడం ఇష్టపడక ప్రియురాలి పాలిండ్లమీద చందనం పూతల మీద చర్చ సాగిస్తాడు. కఠినమైన తర్కశాస్త్ర పాఠాల ఆలోచనను కాదని ఆ స్త్రీతో ప్రణయతర్కాలు చేస్తాడు. ధర్మశాస్త్రాలలోని పదాలను వాక్యాల సంగతి విడిచి ఆమె పదాలను, వాక్యాలను మెచ్చుకొని ముచ్చటిస్తాడు. నాటకాలలోని అలంకారాలలోని నైపుణ్యాన్ని వదలి ఆమె నాట్యాన్ని, సింగారింపును వర్ణిస్తూ తిరుగసాగాడు. ఈ విధంగా చాలాకాలం అజామిళుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ పాపచిత్తుడై మలినదేహుడై చెడుమార్గంలో ప్రవర్తింపసాగాడు. అందువల్ల ఈ పాపాత్ముడు, కుటిల చిత్తుడు, సజ్జన కంటకుడు, ధూర్తుడు అయిన ఈ క్రూరుణ్ణి బలవంతంగా తీసుకొని పోతున్నాము. తరువాత ఇతడు తగిన దండనం పొంది 

ధన్యుడౌతాడు”.ఈ విధంగా మాట్లాడుతున్న యమదూతలను నివారించి, నీతిశాస్త్ర పండితులైన విష్ణుదూతలు ఇలా అన్నారు. ఔరా! మీ ధర్మాధర్మ విచక్షణా సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను, దండింపరాని వారిని దండిస్తారన్న విషయం వెల్లడి అయింది. సమబుద్ధి కలవారు, సాధువర్తనులు, నియమ బద్ధులు, మంచి దయాపరులు, గొప్ప సుగుణాలు కలిగిన తల్లిదండ్రులే తమ బిడ్డలకు కీడు చేయ తలపెట్టితే ఇక ఆ బిడ్డలు ఎవరితో మొరపెట్టుకుంటారు? మీ మనస్సులలో మీరే ఆలోచించి చూడండి. లోకంలో జ్ఞానవంతుడు ఏది చేస్తే ఇతరులు కూదా దానినే చేస్తారు. అతడు దేనిని సత్యం అని నిర్ణయిస్తాడో లోకం దానినే నమ్మి అదే విధంగా ప్రవర్తిస్తుంది. యమదూతలారా! నమ్మి తన తొడలపై నిద్రించే మిత్రుణ్ణి నీతి విడిచి ద్రోహబుద్ధితో ప్రీతి లేకుండా ఎక్కడైనా ఎవ్వడైనా చంపడానికి పూనుకుంటాడా? మనస్సు నిచ్చి స్నేహభావంతో వచ్చి, తనకు నచ్చి, తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి బుద్ధిమంతుడు ఆలోచించకుండా ఎలా కీడు చేస్తాడు? అంతేకాక...ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అద్భుతమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించడం వలన కోటి కంటే ఎక్కువ జన్మాలలో చేసిన పాపాల నన్నింటినీ పోగొట్టుకున్నాడు. హరి నామ సంకీర్తనలు బ్రహ్మహత్య మొదలైన పాపాలనే అడవులకు అగ్నిజ్వాలలు. గురుద్రోహమనే క్రూర సర్పాలకు నెమళ్ళు. బంగారాన్ని దొంగిలించడం అనే చిక్కని చీకట్లకు సూర్యకిరణాలు. మధుపానమనే పాపపు టేనుగులకు సింహాలు. ఆ హరినామ కీర్తనలు బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా అందరాని మోక్ష సామ్రాజ్య వైభవ విలాసాలు. హరినామ కీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు, మోక్ష సామ్యాజ్య పట్టాభిషేక స్వరూపాలు, ఎంతోకాలం చేసిన తపస్సుకు ఫలాల సారాంశాలు, పుణ్యాలకు కారణాలు, ప్రమాదాలనుండి రక్షించి పోషించేవి, కోరిన ప్రయోజనాల నిచ్చేవి, అజ్ఞానాన్ని హరించేవి, అమృతం వంటి వేదాంతసారాన్ని అందించేవి, ఆర్తులకు శుభాల నిచ్చేవి. కోరదగినది, పుణ్యమార్గాలకు నిలయమైనది, మునీంద్రుల మనస్సులనే సరోవరాలే నివాసంగా ఉన్నది అయిన విష్ణు పవిత్ర నామాన్ని స్మరించేవాడు ప్రభువే కదా! ఇతడు “నారాయణా!” అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడై అందులోనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచినా, విశ్రాంతి వేళలోనైనా, ఆటలోనైనా, పరిహాసంగానైనా, పద్య వచన గీత భావార్థాలతోనైనా కమలాక్షుణ్ణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి. తూలి పడినప్పుడు, దెబ్బలు తిని దుఃఖపడినప్పుడు, భయంకర జ్వరాలతో పిచ్చిగా ప్రేలినప్పుడు, పాము మొదలైన విషజంతువుల బాధ కలిగినప్పుడు, బాధలతో అలమటించి నప్పుడు భవబంధాలను నాశనం చేసే విష్ణు నామాన్ని ఉచ్చరిస్తే చాలు యమబాధలు కాని, దుఃఖాలు కాని పొందరు. పెద్ద పాపాలకు పెద్ద ప్రాయశ్చిత్తాలను, చిన్న పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తాలను మహానుభావులైన మునులు నిర్ణయించి ఉంచారు. కాని ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు. సమస్త పాపాలను సంపూర్ణంగా సంహరించి మనస్సును పరిశుద్ధం చేయాలంటే భగవంతుని సేవ ఒక్కటే సరియైన త్రోవ. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యోగిమానస వాసుణ్ణి, ఆ బంగారు వస్త్రాలు ధరించు వాణ్ణి, ఆ వేదవేద్యుణ్ణి, ఆ వేదాంత ప్రభువును, ఆ పురుషోత్తముణ్ణి స్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం లభిస్తుంది.


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: