శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము
భక్త వరదుడైన పరమాత్మ యారీతి
యంబరంబునుండి యనగ వినియు
సాధు దుహిత యంత సంభ్రమ మొందియు
కదిలె పరుగు తోడ సదన మునకు 156
అంత నా కళావతియును యచట నున్న
దివ్య మైన ప్రసాదంబు తినిన పిదప
సత్యదేవుని మనమందు తలుచు కొనుచు
కదలి వచ్చెను వెనుకకు కడలి కడకు 157
అప్పుడే సత్య దేవుని యాజ్ఞ వలన
పడవ సంద్రంబు నుండియు పైకి లేచె
చూచి యల్లుని నౌకలో సుఖముగుంట
పొంగె సాధువు యాతనిపుత్రి యపుడు 158
కాంతుండు యారీతి కడలి నుండియు రాగ
సతి కళావతి యంత సంత సిల్లె
తండ్రితో పలికెను తరలంగ గృహముకు
సత్యదేవుని జూడ సత్వరంబు
అంతట సాధువు యానందమొందియు
శ్రీసత్యవ్రతమట చేయ దలచె
యదివిని యందఱు యానంద డెందాన
పలికిరి సరియంచు భక్తి తోడ
సాధు వంతట యత్యంత సంబరమున
బంధు మిత్రుల తోడను పరిజనులతొ
సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
భక్తితో జేసె నచ్చటే పరవశమున 159
దివ్యమైన ప్రసాదంబు తీర్థజలము
యందఱికి భక్తి తోడను యంద జేసి
సతియు కూతురు యల్లుడు సంపదలతొ
సంతసంబున వెడలెను సదనమునకు 160
నాటి నుండియు వణిజుండు నయముగాను
సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
దివ్య పౌర్ణమి సంక్రాంతి దినములందు
సకల విధ్యుక్త రీతిన సల్పుచుండె 161
బ్రతికి నన్నాళ్లు యారీతి వ్రతము జేసి
పొందె సుఖశాంతి సంపదల్ పుడమి పైన
అవ్య యానంద సౌఖ్యంబు లనుభవించి
సాధు వంత్యంబునం జేరె సత్యపురము " 162
సూతు డారీతి సాధువు పూతచరిత
శౌనకాదిగ గల్గిన సంయములకు
తీరుగా భక్తి తోడను తెలియ పరచ
తన్మయత్వంబునను వారు సంతసిలిరి 163
నాల్గవ అధ్యాయము
సమాప్తము
సశేషము…..
✍️ గోపాలుని మధుసూదన రావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి