4, డిసెంబర్ 2020, శుక్రవారం

రామాయణమ్.71

  రామాయణమ్.71

...

కౌసల్యా ! నా కంటిచూపు తిరిగి రావడంలేదు నా రాముడి వెనుకనే అదీ వెళ్ళిపోయింది ! రాముడి రధం వెనుక పిచ్చివాడిలా పరుగెత్తి పరుగెత్తి అలసి సొలసిన దశరథుడి ఆక్రందన అది .

.

అంతకు మునుపు సుమంత్రుడు తెచ్చిన రధమెక్కి మువ్వురూ పయనమయ్యారు .ఆబాలగోపాలమూ రధమువెంట పరుగులుతీసింది. 

.

కాసేపు ఆపు సుమంత్రా ! ఆ సుందర,సుమనోహర రూపాన్ని మరల ఎన్నాళ్ళకు చూస్తామో ,అప్పటికి మేము బ్రతికి ఉంటామో లేదో కాస్త ఆపవయ్యా నీవు !

.

మరొక్కమారు కనులారా కాంచుతాము ఆ కమనీయ విగ్రహాన్ని రమణీయరూపాన్ని . 

.

ఆ కైక కు అదేం పోయే కాలమొచ్చిందిరా తండ్రీ ! 

మా బంగారుకొండను అడవులపాలు చేస్తున్నది .

రాముడులేని అయోధ్యానగరం, అరణ్యం ఒకటే ! 

మాకీ నగరమొద్దు ,ఈ రాజూ వద్దు ,

నీవెక్కడుంటే అదే మా నివాసము ,మా రాజ్యము .

.

రామయ్యా ! ఒక్కసారి మాకేసి చూడవయ్యా ! 

సీతమ్మతల్లీ నీవయినా చెప్పవమ్మా తన కరుణార్ద్రదృక్కులు మాపై ప్రసరించనీయమని ! .

.

పురజనుల కన్నీళ్ళు కాలువలై ప్రవహిస్తుండగా రధం రేపుతున్న దుమ్ము చిత్రంగా అణిగిపోతున్నది 

.

ఇంతలో ఎక్కడినుండో వచ్చినట్లుగా ఉన్నది ,ఆజ్ఞ ఇచ్చేస్వరము దీనరవము కలగలసినది, ఒక ఆర్తుడు పెట్టిన కేక అది !

.

 సుమంత్రా రధమాపు ! రధమాపు ! గుర్తుపట్టాడు రాముడు అది తనతండ్రిది!సుమంత్రా ఇంకా వేగంగా తోలు ,నీవు తిరిగి వచ్చినప్పుడు నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదని మహారాజడిగినప్పుడు జనఘోషలో వినపడలేదని చెప్పు.

.

రధంవెనుక పరుగెత్తి,పరుగెత్తి కూలపడిపోయాడా కన్నతండ్రి! 

.

పడిపోయిన రాజు కుడిరెక్క పట్టుకొని కౌసల్య లేపుతుండగా ఇంతలో కైక ఎడమ భుజము పట్టుకోపోగా ! పాము వంటిమీద ప్రాకినంత జలదరింపుతో ఛీ ! దుర్మార్గురాలా ! నేటినుండీ నీవు నా భార్యవూకావు ,నేను నీ భర్తనూ కాను .పెళ్ళినాటి ప్రమాణాలకు నేటితో చెల్లు. నీ విచ్చే రాజ్యం తీసుకుంటే భరతుడు వదిలే తర్పణాలు కూడా నాకు చెందవు .అని కోపావేశంతో కళ్ళెర్ర చేసి కౌసల్యాదేవి మందిరానికి చేరుకున్నాడు మహారాజు.

.

రాముడే లక్ష్యంగా ,రాముని మీదే చూపుగా రొప్పుతూ పరిగెడుతున్నారు రధం వెంట జానపదులు .దయాసాగరుడు వారిని చూశాడు, సుమంత్రుని రధం ఆపమన్నాడు .రధం దిగారు మువ్వురూ! జానపదుల పదంలో పదం కలిపి సాగుతున్నాడు రాఘవుడు.

‌.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: