రామాయణమ్ 141
.................
కోదండమో అది అసురుల పాలిటి యమదండమో ,
ధనుర్ధారి రాముడిని చూడగానే శత్రువులకు దండధారి యముడు గుర్తుకు వస్తాడు
.
ఆయన చేతిలోని ఆటబొమ్మ
ఆ ధనుస్సు!
ఎప్పుడు బాణము తీస్తున్నాడో,
ఎప్పుడు సంధిస్తున్నాడో,
ఎప్పుడో వదులుతున్నాడో ,
చూసేవారి కన్నులకు అస్సలు అగుపడదు!.
.
మనసైన్యములోని వారు టపటప నేలకూలడమే నాకు కనుపించింది.
.
వడగళ్ళవానకు పంటచేలు నాశన మైనట్లుగా మనవారు చనిపోవడమే నేను చూశాను.
.
ఒంటరివాడు !
పైగా పాదచారి వీడేమిచేయగలడు? అని అనుకుంటే కేవలము ఒకటిన్నర ముహూర్త కాలములో అందరినీ మట్టుబెట్టాడు.
.
ఆడుదానిని చంపటము ఎందుకని నన్ను ఒక్కదానిని మాత్రము వదిలివేశాడు.
.
రాముడికి ఒక తమ్ముడున్నాడు !
వాడు వీడి అంతటి వాడు.
అన్న అంటే వానికి సర్వస్వము .
.
వాడు రాముడికి బయట తిరుగాడే ప్రాణము ,
.
వాని పేరు లక్ష్మణుడు.
.
రాముడి వెంట అతని భార్య కూడా ఉన్నది .
.
ఆవిడ పేరు సీత !
ఆవిడ సౌందర్యాన్ని ఏమని వర్ణించను!.
.
ఆమె శరీరము తళుకులీనే
బంగారు కొండ
.
ఆమె శరీరపు సుగంధము
సంపెంగ పూవు వాసన వస్తున్నది
.
ఆవిడ ఇందు వదన
,కుందరదన
.
ఆ అందము ముల్లోకాలలో వెతికినా నీకు కాన రాదు .
.
ఆ చక్క దనాల చుక్క నీ ప్రక్కన లేకపోవడమే నీకు తక్కువ !
.
ఆమె వలపులు నీకు మాత్రమే తగినవనే తలపు నన్ను ఉసిగొల్పగా నీకు కానుకగా ఆ జవ్వనిని ఇవ్వాలని నేను
ప్రయత్నించాను.
.
కానీ నా ప్రయత్నాన్ని క్రూరుడైన లక్ష్మణుడు వమ్ము చేసి నా అవయవములు ఖండించి నన్ను విరూపను చేశాడు..
.
నీవు ఆ సుందరిని ఒక్కసారి చూశావా ! ఇక అంతే సంగతులు,
మన్మధుడి బాణాలు నీ ప్రాణాలు తోడేస్తాయి!
.
లే ! ఇక ఆలస్యము చేయకు నీ కుడి పాదము ఇప్పుడే ఎత్తు !(బయలుదేరు). ఆవిడని ఎత్తుకొనిరా !
.
అని అంటూ రావణుడినితొందర పెట్టింది శూర్పణఖ.
...
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి