4, డిసెంబర్ 2020, శుక్రవారం

ధార్మికగీత -99*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                           *ధార్మికగీత -99*

                                     *****

          *శ్లో:- శనై:  పంథా:  శనై:  కంథా: ౹*

                 *శనై: పర్వత లంఘనమ్ ౹*

                 *శనై ర్విద్యా  శనై ర్విత్తమ్ ౹*

                 *పంచైతాని    శనై:   శనై: ౹౹*

                                         *****

*భా:- లోకంలో చూడగానే, లేదా తలచుకోగానే, లేదా హాం ఫట్ అని  మంత్రించగానే  పనులు పూర్తిచేయగల శక్తి దేవతల్లోనో, రాక్షసుల్లోనో  ఉంటుంది. మానవ మాత్రులకు ఆ శక్తి యుక్తులు లేవు. క్రమపద్ధతిలో, నెమ్మది నెమ్మదిగా చేయవలసిందే. ఎలా?  1. "పంథా:" :- (ప్రయాణము). ఒక వ్యక్తి  దారివెంట ప్రయాణం చేయాలంటే అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడవవలసిందే. వాహనమేదైనా, వేగ మేపాటి దైనా, ప్రతి కిలోమీటరు లెక్కలోకి రాలసినదే గదా! కళ్ళు మూసుకోగానే ఇక్కడివారము అక్కడ తేలము గదా! 2."కంథా:" :-( బొంత). పాత చీరలను, ధోవతులను బొంతగా  రూపుదిద్దాలంటే  సూదితో ఒక క్రమపద్ధతిలో వరుసలుగా నెమ్మదిగా, నేర్పుతో  కళాత్మకంగా కుట్టవలసిందే. వేరే మార్గం లేదు గదా! 3."పర్వతారోహణము":- ఆరోహకులు కొండల్ని ఎక్కాలంటే నెమ్మదిగా , జాగ్రత్తగా , కాలు జారకుండా ఒక్కో మెట్టుగా ఆసరా చేసుకుంటూ శిఖరాగ్రానికి ఎగప్రాకాలి.గమ్యం చేరుకోవాలి. ప్రవరునిలా పసరు పూసుకొని కొండపైకి తేలిపోలేము గదా! 4. "విద్య" :- శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక, కళాత్మక విద్య యేదైనా ప్రణాళికాబద్ధంగా, క్రమంగా, సావధానంగా క్షణం క్షణంగా, అక్షర మక్షరంగా అభ్యసించవలసిందే కాని, తెల్లవారేలోపు PHD పట్టా పూర్తిచేయలేముగదా! 5."విత్తము":- చేసే పని యేదైనా అహర్నిశలు కష్టపడి, సర్వశక్తులు ఒడ్డి, అడుగడుగునా అప్రమత్తంగా పురోగమించేవాడికే  ధనార్జన సాధ్యపడుతుంది. ఒక్క సారిగా ఎవ్వడు కుబేరుడు కాలేడు  గదా! కాన పైన చెప్పబడిన 5 విషయాలలో నెమ్మది నెమ్మదిగా, క్రమశిక్షణతో, క్రమపధ్ధతితో  కార్యసాధన సాధించాలే కాని, మంత్ర తంత్రాలతో మానవునికి  త్రుటిలో   సాధ్యపడేవి కావని సారాంశము*.

                                   ***** 

                    *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: