4, డిసెంబర్ 2020, శుక్రవారం

దత్తాత్రేయ స్వామి

 *ఉన్మత్తుడు..ఉద్యోగి..*


"కొండారెడ్డీ! గురుబ్రహ్మం ఉన్నాడా?.." 

" ఉన్నాడు సార్ ..అన్నదానం వంటకు సరుకులిస్తున్నాడు.."


    " పరమేషూ..ఈరోజు లడ్లు చేయించే దగ్గర ఎవరున్నారు?.." 

" గురుబ్రహ్మమున్నాడు సార్..


  "అన్నదానం దగ్గర వడ్డనకు నేనూ, గురుబ్రహ్మం వెళుతున్నాము..మీకు చెప్పి వెళదామని వచ్చాము.." 


           "వెంకన్న గారూ..మీరు లీవు పెడితే, కౌంటర్ ఎవరు చూసుకుంటారు?..ఉన్న ఇద్దరూ సరుకులకెళుతున్నారు.." 


   మాట ముగించేలోపలే వచ్చే సమాధానం గురుబ్రహ్మం ఉన్నాడు అనే! 


       అర్చక స్వాములు, భక్తులకు ఇచ్చే కుంకుమను చక్కగా పోట్లాలుగా చుట్టి పెడుతూనో..లేదా..భక్తులకు ప్రసాదంగా తయారు చేసిన లడ్లు కవర్లలో ప్యాక్ చేస్తూనో..పల్లకీ సేవ కు మైక్ ఏర్పాటు చేస్తూనో...ఆలయం లో ఉన్నంత సేపూ ఏదో ఒక పని లో నిమగ్నుడై,.... మా దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థ లో ఇంతగా మమేకం అయిన వ్యక్తీ...గురుబ్రహ్మం అనబడే సన్నగా రివటలా ఉండే వ్యక్తీ ....ఎనిమిరెడ్డి గురుబ్రహ్మారెడ్డి..


     2004 వ సంవత్సరం లో తన అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేక, తల్లి వెంబడి మొదటిసారి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చాడు..ప్రకాశం జిల్లా, పెద చెర్లో పల్లి మండలం, పోతవరం గ్రామ నివాసి..వాళ్ళ కులదైవం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు..ఇద్దరు సోదరులు..తల్లి, తను..


       కొన్నాళ్ళు ఇక్కడ వుండి, తల్లికి స్వస్థత చేకూరగానే తిరిగి వాళ్ళ వూరు వెళ్ళిపోయాడు..I.T.I. పాస్ అయ్యాడు..B.A., డిగ్రీ పూర్తీ చేసాడు.. 2006 వ సంవత్సరంలో AP TRANSCO లో హెల్పర్ గా ఉద్యోగం లో చేరాడు..


        అంతవరకు బాగానే ఉన్న గురుబ్రహ్మారెడ్డి మానసిక స్థితి క్రమంగా మారిపోయింది..2007 నాటికి అతను ప్రపంచం దృష్టిలో ఒక మానసిక రోగి..అంతుచిక్కని ఆరోగ్య సమస్య..సోదరుల ప్రయత్నాలన్నీ నిష్పలం అయ్యాక, వారికి చివరిగా తోచిన ఉపాయం మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధి..తీసుకొని వచ్చి ఆ దత్తుడి పాదాల చెంత వదిలిపెట్టారు..తమ బిడ్డ మళ్లీ మామూలు మనిషిగా మారుతాడనే నమ్మకం ఆ కుటుంబ సభ్యుల్లో సన్నగిల్లే సమయం అది..ఆ పరిస్థితి లో గురుబ్రహ్మారెడ్డి ని శ్రీ స్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు..


        ఎప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడో తెలీని స్థితి..యెంత శాంతంగా ఉన్నట్టు కనిపిస్తాడో, మరుక్షణం విపరీత రౌద్రం..ఉన్మత్త స్థాయి కి పరాకాష్ట గా మారిపోయే స్వభావం..వంటి మీద బట్టలు సైతం తీసి గిరాటు వేసేవాడు..క్షణానికో రకంగా మారిపోయే తత్వం..తనలో తానే మాట్లాడుకోవడం..పూర్తి ఉన్మత్త లక్షణాలు..సరిగ్గా అవధూతల గురించి చెప్పిన "బాలోన్మత్త పిశాచ వేషాయా.." అన్న పరిస్థితి కి తగ్గట్టుగా ఉన్నది అతని ప్రవర్తన..


 కుటుంబ సభ్యులు సహనం తో పట్టుబట్టి, శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయించసాగారు.. క్రమంగా మార్పు రావడం మొదలు పెట్టింది..2008 డిసెంబర్ నాటికి, గురుబ్రహ్మం మామూలు స్థాయికి వచ్చాడు..దేవాలయం లో పనులు చేసుకుంటూ..సాటివారి పనుల్లో సహాయం చేస్తూ.. స్వామి సన్నిధి లోనే కాలం గడపసాగాడు..


2009 లో శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి నైట్ వాచ్ మాన్ హఠాన్మరణం తో, ఖాళీ ఏర్పడింది..అంతకుముందు నుంచీ గురుబ్రహ్మాన్ని దగ్గరగా పరిశీలిస్తూ ఉన్నాను కనుక, అతను ఆ ఉద్యోగం చేస్తాడో..లేదో..అని..అడిగి చూద్దామనుకున్నాను.. ఇతరులనూ సలహా అడిగి, చివరిగా గురుబ్రహ్మాన్ని సంప్రదించాను..."ఈ దత్తాత్రేయుడి దగ్గర ఏ పని చెప్పినా చేస్తాను" అని చెప్పాడు..అలా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర ఉద్యోగుల్లో ఒకడిగా మారిపోయాడు..దేవాదాయ శాఖ వారి అనుమతీ తీసుకున్నాము..


 ఈ నాటికి సుమారు పది పదకొండు సంవత్సరాలు దాటిపోయింది గురుబ్రహ్మం శ్రీ స్వామివారి మందిరం లో ఉద్యోగిగా చేరి..మానసిక రోగి, మామూలు వ్యక్తిగా మారి, మాలో ఒకడుగుగా ఒదిగిపోయాడు..అదే మొగలిచెర్ల లో సిద్ధిపొందిన  దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయుడి లీల!..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523114...సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: