4, డిసెంబర్ 2020, శుక్రవారం

కపోతేశ్వరాలయం* - చేజెర్ల

 కపోతేశ్వరాలయం* - చేజెర్ల

**మన సంస్కృతి సాంప్రదాయాలు*


మహారాష్ట్రలోని "తేర్" మరియు ఆంధ్ర ప్రదేశ్‌లోని చేజెర్ల - రెండు స్థలాలలోను ఒకప్పటి బౌద్ధ చైత్య గృహాలు తరువాత హైందవ శైవాలయాలుగా మార్చబడ్డవి. చేజెర్లలోని శైవాలయాన్ని "కపోతేశ్వరాలయం" అంటారు. ఇక్కడి గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరంనుండి ఉద్భవించిందని స్థల పురాణ గాధ. శిబికి, కపోతానికి (పావురానికి) ఉన్న సంబంధం గురించి ఒక హిందూ గాధ, ఒక బౌద్ధ గాధ ఉన్నాయి.


*స్థల పురాణం*


మహాభారతంలోని కధ - మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. మేఘదాంబరుడు అన్న అనుమతితో 1500 మంది పరివారం వెంటబెట్టుకొని కాష్మీర దేశం విడచి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలసి తపో దీక్షనాచరించి కాలం చేశాడు. కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది. అన్న తిరిగి రానందున అతనిని వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వచ్చాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి తానూ మరణించాడు. తమ్ముళ్ళను వెతుక్కుంటూ శిబి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు. అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షింపదలచారు. శివుడు ఒక వేటగాని వలెను, బ్రహ్మ అతని బాణం లాగాను, విష్ణువు ఒక కపోతం లాగాను అక్కడికి వచ్చారు. వేటగానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తి శరణు జొచ్చింది. శిబి ఆ పక్షికి అభయమిచ్చాడు.అక్కడికి వేటగాడు వచ్చి ఆపావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని చెప్పాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, త్రాసులో పావురాన్ని ఒక వైపు ఉంచి, తన శరీరంలో కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. అయినా అవి సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.


*బౌద్ధ జాతక కధ* -


శిబిజాతకం కధ ప్రకారం శిబి చక్రవర్తి తన కన్నులను మారువేషంలో వచ్చిన ఇంద్రునికి దానం చేశాడు. అవసన సతకం కధ ఈ శిబిజాతక కధనూ, మహాభారత కధనూ అనుసంధానిస్తుంది. బౌద్ధ జాతక శిల్పాలలో శిబి కధ తరచు కనిపిస్తుంటుంది. అమరావతిలోను, నాగార్జున కొండ ఈ జాతక కధకు సంబంధించిన శిల్పాలున్నాయి.

ఆలయం నిర్మాణం గ్రామానికి వాయువ్య దిశగా ఉన్న ఈ కపోతీశ్వరాలయం తూర్పు ముఖంగా ఉంటుంది. తూర్పున ఉన్న ఒకే ఒకద్వారం పైన ఒక చిన్న గోపురం ఉంది. ఈ గోపురం అలంకరణలు లేకుండా సాదాగా ఉంది. స్తంభాలు, ద్వార బంధాలు కంచిలోని పల్లవ దేవాలయాలను పోలి చదరపు శీర్షభాగాలు కలిగి ఉన్నాయి. ఆలయం వెలుపల దక్షిణం వైపు ఒక పెద్ద boab చెట్టు ఉండేది. దాని కాండం వ్యాసం 56 అడుగులు ఉండేది. లోపల తొర్రగా ఉండేది. ఈ చెట్టు 1917లో కూలిపోయింది. దేవాలయంలో "నగర, వెసర, ద్రవిడ" నిర్మాణ రీతులు మిళితమై ఉన్నాయి. చైత్యగృహం ప్రధాన చైత్యంపై కట్టినందున ఈ ఆలయ నిర్మాణాన్ని వాస్తుశాస్త్రంలో "హస్తిప్రస్త" (ఏనుగు వీపు) విధానం అంటారు. ముందుగా బౌద్ధ చైత్యం అయిన దానిని హిందువుల పూజా విధానానికి అనువుగా మలచారు.


ప్రాకారం లోపల అనేక చిన్న చిన్న గుడులు ఉన్నాయి. ప్రవేశ గోపురానికి ఎదురుగా ఒక చిన్న మంటపము, ధ్వజ స్తంభము ఉన్నాయి. ఆవరణ దక్షిణాన ఆరు, పశ్చిమాన రెండు, ఉత్తరాన నాలుగు చిన్న మందిరాలున్నాయి. ఇవి కాకుండా రాళ్ళలో తొలిచిన అనేక చిన్న గుడులున్నాయి. రెండు రాతి పలకాలమీద ఒక్కొక్క దానిమీద వెయ్యి చొప్పున శివలింగాలున్నాయి. ఒక పాలరాతి ఫలకంపై పద్మహస్తుడైన సూర్యుని శిల్పం ఉంది. ప్రధాన ఆలయానికి వాయువ్యాన సప్తమాతృకల శిల్పం, ప్రస్తుతం బాగా శిధిలమైనది, ఉంది. కపోతేశ్వరస్వామి గర్భగుడి ముందు ఒక చిన్న నంది మంటపం ఉంది. దాని వెనుక ఒక సన్నని దీర్ఘ చతురస్రాకారపు మంటపానికి ముందు వైపు రెండు, వెనుకవైపు నాలుగు స్తంభాలున్నాయి. ఆ నాలుగు స్తంభాల మధ్య ద్వారం ఉంది. ఈ నాలుగు స్తంభాలపై పద్మాలు చెక్కబడి ఉన్నాయి. వాటి వెనుక చదరంగా ఉన్న ముఖమంటపం ఇరువైపులా తూర్పు-పశ్చిమ దిశలలో వరుసలో స్తంభాలు, వాటిమధ్య ద్వారపాలకుల ప్రతిమలు ఉన్నాయి. ఈ మంటపం ఉత్తర-పశ్చిమ దిశలోని గోడలు గర్భగుడిని కలుస్తాయి. గర్భగుడి అసలు చైత్యగృహం అయి ఉండవచ్చును. గర్భగృహం ఇరువైపులా ఉన్న మూడేసి స్తంభాలపైన రాతి దూలాల కప్పు ఉంది. చదరపు వేదికపైన ఉన్న కపోతేశ్వరలింగం తలలేని శరీరాకృతిలో అనిపిస్తుంది. లింగం పై ప్రక్కల రెండు రంధ్రాలున్నాయి. కుడిప్రక్కనున్న రంధ్రంలో ఒక పాత్రకు సరిపడా జలం మాత్రం పడుతుంది. మరొక రంధ్రంలో ఎంత నీరు పోసినా గాని తిరిగిరాదు. (లోపల ఏదో సొరంగంలోకి వెళుతూ ఉండవచ్చును). అన్ని శివాలయాలలోను సాధారణంగా అభిషేక జలం బయటకు పోవడానికి గర్భగుడి ఉత్తర దిశలో ఒక మార్గం ఉంటుంది. కాని ఈ ఆలయంలో అలా లేదు. గర్భగుడి గోడల బయటి ప్రక్క అలంకరణలు లేకుండా సాదాగా ఉంటాయి. గోడపైన ఒక పావురాయి బొమ్మ మాత్రం ఉంటుంది. ఆ పై నిర్మాణంలో "పట్ట, త్రిపట్ట, గళ, పట్ట, త్రిపట్ట, గళ" భాగాలున్నాయి. వాటి పైన గుర్రపుడెక్క ఆకారంలో శిఖరం ఉంది. శిఖరం పైన కలశం లేదు. శిఖరం ముందుభాగంలో సింహలత అందులో ఒక మాలాకోష్టంలో క్రింది భాగాన ఆసీన దేవతా మూర్తి, ఆ పైన నందిని ఆరోహించిన ఫార్వతీ పరమేశ్వరులు ఉన్నారు.


*శాసనాలు*


కామెంట్‌లు లేవు: