రామాయణమ్ 139
..................
రావణుడు కొలువుకూటములో ఉన్నతమైన రత్నఖచిత సింహాసనము మీద ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాగా మహాతేజస్సుతో కూర్చొని ఉన్నాడు.
.
ఆ రాక్షస రాజు శరీర కాంతి నున్నని వైఢూర్యమాణిక్యపు కాంతివలె ఉన్నది .కాల్చి శుద్ది చేసిన బంగారు కుండలములు ధరించి ఉన్నాడు
,అందముగా ఉన్న భుజాలు ,
తెల్లని దంతకాంతి,
పెద్ద ముఖముతో పర్వతములాగా ఉన్నాడు
ఆయన గొప్ప తపస్సంపన్నుడు .బ్రహ్మ గురించి పదివేల సంవత్సరాలు ఘోర తపమాచరించి ఆయనకు తన శిరస్సులు అర్పించాడు.
.
ఆతని శరీరము మీద ఎక్కడ చూసినా ఆయుధాల దెబ్బలు మానిన గుర్తులే !
మరీ విశేషముగా ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బలే అవి!
.
అవి ఒక యోధుడి కి అలంకారములు.
.
వాడు మృత్యువుకే మృత్యువు!
.
వాడు మహా క్రూరుడు ,పూర్తికావచ్చిన యజ్ఞాలను ధ్వంసము చేసి వికృతానందము పొందేవాడు.
.
వాడి కంటికి అందముగా కనపడ్డ స్త్రీ వాడి స్వంతము కావలసినదే . అలాంటి స్త్రీని దక్కించుకోవడానికి వాడు ఎంతటి సాహసమైనా చేస్తాడు , వాడు ఒకసారి మహావిషసర్పము తక్షకుడి భార్యను చూశాడు ,అంతే వాడి మనసు నిలవలేదు .భోగవతిని ముట్టడించాడు రాజైన వాసుకిని ఓడించాడు తక్షకుడి ప్రియభార్యను బలాత్కారముగా తెచ్చుకున్నాడు.
.
కుబేరుడి మీదకు దండయాత్రకు పోయి అతడి పుష్పకవిమానాన్ని తెచ్చుకున్నాడు.
.
వాడికి కోపము వస్తే అలా వెళ్ళిపోయి దేవతల చైత్రరధాన్ని,నందనవనాన్ని,పద్మసరస్సును ఊరకే పాడుపాడు చేసేవాడు.
.
యజ్ఞధ్వంసము నందు ఆసక్తి,
బ్రహ్మహత్యలు వాడికి అలవాటు,
.
కఠినుడు,
దుష్టప్రవర్తనగలవాడు,
జాలిలేదు ,
ప్రజలకు అహితము చేయటములో వాడికి ఆసక్తి మెండు.
.
కొలువుదీరి ఉన్న మహాభయంకరుడైన రాక్షరాజు వద్దకు వచ్చి వాలింది శూర్ఫణఖ.
.
అది భయము, కోపము, అవమానము ,కలగలసిన తత్తరపాటుతో ఉన్నది. అది ఇంతవరకు జీవితములో రాముడిలాంటి యోధుడిని చూడలేదు,వినలేదు
అంతటి దెబ్బ ఎప్పుడూ తినలేదు .
.
వూటుకూరు జానకిరామారావు
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి