4, మార్చి 2021, గురువారం

తండ్రి లేని పిల్లలు

 *నాకు నచ్చిన శ్రీమతి శశికళ  ఓలేటి గారి కథ.*

             🌷🌷🌷

తండ్రి లేని పిల్లలు( కొత్త కథ) 


" సంధ్యా! ఆలస్యం అయిపోతోంది. లోపలికెళ్లి సాయమ్ ను, సమీర్ నూ పిలుచుకుని రా..", మెట్లమీద కూర్చుని షూలేస్ బిగించుకుంటున్న మనవరాలితో చెప్పారు రాఘవరావుగారు. 


మరో పదినిమిషాల్లో పదేళ్ల తమ్ముడు సమీర్ ను ఒకచేత్తో, వాడి షూస్, టై, బేడ్జ్ ఒకచేత్తో పట్టుకుని దాదాపు లాక్కుంటూ తెచ్చి కారులో కుదేసింది పదిహేనేళ్ల సంధ్య. ఈలోపున సైకిలు మీద చక్కర్లు కొడుతున్న పదమూడేళ్ల సాయం.. సైకిల్ ను గుమ్మం దగ్గరే పడేసి, బేగ్ తో ఫ్రంట్ సీట్ లో తాతగారి పక్కనే కూలబడ్డాడు. " బొయ్ బొయ్యంటు పక్కనే ఆగిన ఆటోలో మరో ఐదుగురు పిల్లలు ... ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు... రాఘవరావుగారి పెద్దబ్బాయి, రెండవ అబ్బాయి పిల్లలు. వాళ్లను చూసి సంబరంగా చెయ్యూపిన సమయ్ ను వాళ్లు నిరసనగా చూస్తూ.. మొహాలు తిప్పుకున్నారు. 


        నగరంలో ఉన్నవాళ్ల పిల్లలంతా చదివే ప్రముఖపాఠశాల చేరారు పిల్లలందరూ. కారు దిగగానే సంధ్యకు.. తమ మేనత్త రమ తన కూతురు సుమతో దిగడం కనిపించి స్నేహపూర్వకంగా సుమను పలకరించడానికి వెళ్లింది. సుమ సంధ్యను చూడనట్టే స్కూల్ లోపలికి పరిగెట్టింది. 


       రాఘవరావుగారు ఇదంతా క్రీగంట గమనిస్తూనే ఉన్నారు. పిల్లల మధ్య సయోధ్య తేవడం ఎలాగో తెలియడం లేదు. పిల్లలు సరే.. ముందు ఇంట్లో పెద్దవాళ్లే ఈ తండ్రిలేని పిల్లల మీద ద్వేషం సాధిస్తుంటే... ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదాయనకు. 


       రాఘవరావుగారి నలుగురు సంతానం ఏడాదిన్నర వయసు తేడాలతో పుట్టినవాళ్లే. గెజిటెడ్ రాంక్ లో ఆయన రిటయిర్ అయ్యేటప్పటికి, నలుగురూ మంచి స్థాయిలో స్థిరపడ్డారు. తండ్రి కట్టించిన విశాలమైన డాబా ఇంటిమీద రెండు డూప్లేలు, ఒక పెంట్ హవుస్ కట్టుకున్నారు. అమ్మాయికి వేరే చోట ఫ్లాట్ కొనిపెట్టారు. రాఘవరావుగారి ఆఖరికొడుకు పరశురాం. ముందునుంచీ చదువులో మహాచురుకు. జీవితంలో బాగా ఎదగాలి, తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకోవాలని ఆశయాలతో వుండేవాడు. ఎందుకో ఆ కొడుకంటే తండ్రికి మహాప్రీతి. 


       బెంగుళూరులో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ తన కొలీగ్ ప్రీతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ముచ్చటయిన ముగ్గురు పిల్లలు, పదిలక్షలకు పైబడి జీతం, మంచియిల్లు... హాయిగా సాగిపోతున్న జీవితాన్ని అతని బిజినెస్ బగ్ చెదలా కుట్టడం మొదలుపెట్టింది. 


చాలామంది చేసే పొరపాటే అది. తాము పనిచేసిన సంస్థ తమవలనే ఇంత అభివృద్ధిలోకి వచ్చిందంటే.... తామే స్వయంగా కంపెనీ తెరిస్తే మరిన్ని అద్భుతాలు చేయగలమని అనుకుంటూ ముందుకురికేయడం!


 తండ్రి ఇచ్చిన ఆస్థులు, భార్యకున్న ఆస్థులు కరిగించి, తన కొలీగ్స్ ఇద్దరితో బయటకొచ్చి మొదలుపెట్టిన బిజినెస్.... ఫార్ట్యూన్ 500లో ఉన్న  కంపెనీప్రాజెక్టులు సంపాదించి నాలుగేళ్ళు మంచిలాభాలలోనే నడిచింది.కంపెనీ  

ఎక్స్ పాన్షన్ అంటూ వివిధసిటీల్లో ఆఫీస్ లు తెరిచారు. వాటికి తగ్గ ప్రాజెక్టులు చేతిలో లేక.. అవన్నీ మూతపడే సమయానికి... ఒక పార్ట్నర్ తన వాటా లాభాలతో బయటకు వెళ్లిపోయాడు. అతనితో పాటూ వీరి క్లయంట్లు కూడా బయటకు నడిచిపోయారు. 

కల్లోలకడలిలో నావలా ఉన్న కంపెనీని మరో రెండేళ్లు నడిపించి, పరశురాం చేతులెత్తేసాడు. 


           భర్తకు అతని విజయాల్లో,అపజయాల్లో వెన్నంటి ఉండాల్సిన ప్రీతి , అతనికి పెద్ద ప్రతికూలమై కూర్చుంది. ఎలా అలవాటు చేసుకుందో తెలీదు పేకాటకు బానిసయింది. హై సొసైటీ లేడీస్ తో క్లబ్ లో హైస్టేక్స్ కు ఆడుతూ... రాత్రీపగలూ అక్కడే గడిపేంత పతనావస్థకు చేరింది. 

పిల్లలను పనివాళ్లమీద వదిలేసి వ్యసనంలో కూరుకుపోయిన భార్య, నష్టాలవూబిలో వ్యాపారం... ఎక్కడా చిరువెలుగు కూడా కనిపించని జీవితం పరుశురాంను ఆత్మహత్యవేపే. మొగ్గుచూపేలా చేసాయి. రాఘవరావు దంపతులకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. 


             ముందునుంచీ అత్తింటివేపు పెడమొహమే అయిన ప్రీతి.. పిల్లలతో పుట్టింటికి చేరి భంగపడి , తప్పనిసరై అత్తగారింటికే రావలిసి వచ్చింది. 

❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️


మార్చినెల మొదలవుతోంది. మెల్లగా సూర్యుడు నడినెత్తిమీదకు పాకుతూ చిరచిరలాడిస్తున్నాడు. పెరట్లో మామిడిచెట్టు చుట్టూ ఉన్న చప్టామీద కూర్చుంది సంధ్య. టెన్త్ బోర్డ్ పరిక్షలయిపోయాయి. తమ్ముళ్లిద్దరూ అక్కడే గట్టు మీద కూర్చుని వాళ్లు సేకరించిన కార్డులేవో చూసుకుంటూ కూర్చున్నారు. ముగ్గురినీ ముప్పిరిగొన్న వంటరితనం!

భవిష్యత్తేమిటో తెలీని అయోమయం!

ముద్దుముచ్చట్లలో ముంచితేల్చిన నాన్న ఒక్కసారి వైదొలగిపోయాడు.!

కడుపులో పెట్టుకుని దాచుకోవలసిన తల్లి నిశ్చేష్టగా, గదిని విడిచిరాదు. !

తాము బతికిన్నామో లేదో కూడా కనుక్కోదు.

అమ్మానాన్నలా బాధ్యత తీసుకున్న తాతగారూ, బామ్మా వయసు పరిమితులకు లొంగిపోతున్న పరిస్థితి. !

తండ్రితో వచ్చినప్పుడు తెగ గారం చేసిన బంధువులకు తామిప్పుడు పెనుభారం.!

వారి ఆర్ధికప్రణాళికల్లో తమకోసం పక్కన పెట్టాలిసిన భాగం , వారిలో మిగిలిస్తున్న అసహనం! 

అక్కరలేని తద్దినంలా తమ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి... తమకు మిగలని హక్కులను సాధించికోడానికి తయారయిన వీరంటే మిగిలిన పిల్లలకు అభద్రత! 


ఇన్ని అపసవ్యాల మధ్య.... ఆ ముగ్గురూ ఒకరికి ఒకరుగా బతకాల్సిన పరిస్థితి! 

" ఎందుకు నాన్నా! అంత మోసం చేసావు నన్ను. నా ఒళ్లో తలపెట్టుకుని పడుకున్నావ్. అమ్మనీ, తమ్ముళ్లనూ బాగా చూసుకోమన్నావు. నా చదువులతల్లి సంధ్య అన్నావు. ఎందుకో క్షమించమన్నావు. పొద్దున్నకే నువ్వు కాల్చుకుని చచ్చిపోయావ్!" ......... " డబ్బెందుకు నాన్నా! నువ్వుంటే చాలదా మాకు. తప్పంతా తనమీద పడేసుకుని అమ్మ క్రుంగిపోయి మాకు తను ఉన్నా లేనిదయింది. తాతగారు రక్షణకవచంలా నిలబడ్డా చుట్టూ కనబడని నిరాదరణ.... ఏం కోరి మమ్మల్ని ఇలా వదిలేసావు?..." .... సంధ్య ఆలోచనలు తెగడం లేదు. ఆడుకుంటూనే .... సజలనేత్రాలతో శూన్యంలోకి చూస్తూ ఆలోచనల్లోకి పారిపోతున్న అక్కను దిగులుగా చూస్తున్నారు సాయం, సమయ్! 


" అమ్మా! "...... పెద్దగా కేకపెట్టి... హఠాత్తుగా తలపట్టుకుని కూలబడిపోయింది సంధ్య. నుదిటిమీదనుంచి బొటబొటా కారిపోతున్న రక్తం. పక్కనే కాగితం చుట్టిన చిన్నరాయి. బహుశా కేటాపల్ట్ తో పైడాబా మీంచి విసిరినట్టున్నారు. " లీవ్ దిస్ ప్లేస్ యూ ఆర్ఫన్స్"... అని ఉంది ఆ చీటిలో. సంధ్య గబగబా దాన్ని ఉండచుట్టి పడేసింది. 

రక్తశిక్తమయిన మొహంతో అలాగే స్థాణువులా నిలబడిపోయిన సంధ్య తేరుకునే సరికి.... చుట్టూ ఇంటిల్లిపాదీ! అన్నాళ్లలో తన గది వదిలిరాని ప్రీతి... పరుగున మేడదిగొచ్చి కూతుర్ని ఒడిసిపట్టుకుంది. కొంగుతో గాయాన్ని నొక్కిపెట్టి.... భీతహరిణిలా చూస్తూ... మాటలకు తడబడుతూ నత్తుతున్న  తల్లిని చూసేసరికి..... సంధ్య ఇన్నిరోజులూ కూడగట్టుకుని నటిస్తున్న ధైర్యమూ కరిగి నీరయిపోయింది. తల్లిని పట్టుకుని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. 


తల్లీబిడ్డలను ఆ స్థితిలో చూసి.... అన్నాళ్లూ కరుకుగా ప్రవర్తిస్తున్న వారందని మనసులూ కూడా ద్రవీభవించాయి. 


             సంధ్య పెద్దనాన్న డాక్టరు. గాయం కడిగి, ఫస్టెయిడ్ చేసి, కుట్లు వేసి సంధ్యను మంచిమాటలతో సాంత్వన పరిచారు. 


ఆ ఇంటిలో మారిన పరిస్థితులను, పిల్లల అమానవీయ ప్రవర్తన గమనిస్తున్న రాఘవరావు దంపతులు ఆ సాయంత్రం కుటుంబసభ్యులనందరినీ సమావేశ పరిచారు. 


సంధ్య తనను ఎవరుకొట్టారో నోరిప్పలేదు. అస్థిమితంగా కదులుతున్న ఆ ఇంటిపెద్ద మనవడు ధీరజ్ చేసినపనే అని అందరికీ తెలుస్తోంది. 


ఇంతలో అక్కడి మౌనాన్ని ఛేదిస్తూ సంధ్య నోరిప్పింది. 

" తాతగారూ! మమ్మల్ని ఏదయినా అనాధాశ్రమానికైనా, ఎవరికయినా దత్తతగానయినా ఇచ్చేయండి. మేము ఇక్కడ ఉండకూడదు. మాకు హక్కు లేదు...." ఆమాటలకు ఉండేలు దెబ్బతిన్న పక్షిలా గిలగిల లాడిపోయారు ఆ వృద్ధదంపతులు.


" సంధ్యా! చిన్నపిల్లవు ఏంటా పెద్దమాటలు. మా మరిది పిల్లలు ...మీరుమా బాధ్యత. అలా పిచ్చిగా మాట్లాడకు..."... పెద్దకోడలు గట్టిగా అరిచింది. 


" మరేం చెయ్యాలి దొడ్డా? మా నాన్న ఈఇంట్లో ఏ హక్కులూ మిగుల్చుకోలేదు.అన్నీ తీసేసి వాడేసుకున్నాడు. మా పెంట్ హౌజ్ కూడా పెద్దనాన్నకు ఇచ్చేసి డబ్బు తీసుకున్నారు. మేము ఏ హక్కుతో ఇంకా అక్కడ ఉండాలి? మరి మీ పిల్లలకు కోపం రావడం సహజమే కదా! మా అమ్మ చదువుకుని ఒకప్పుడు పెద్ద ఉద్యోగం చేసేది. తను మా నాన్నకూ సపోర్ట్ చెయ్యలేదు. మమ్మల్నీ చూసుకోవడం లేదు. మా చదువులకీ, పోషణకీ మీరెందుకు మంత్లీ కంట్రిబ్యూట్ చెయ్యాలి? వెరీ అన్ ఫెయిర్! మేము ఆర్ఫన్స్ మి దొడ్డా! మా నాన్న పిరికివాడులా లోకంలోంచి పారిపోయాడు. మా అమ్మ మాకోసం ఏమీ చెయ్యదు. మరి మేము ఎవరికి చెందినవాళ్లం? చెప్పండి"


" సంధ్య తల్లీ! ఎందుకురా అంతలా మనసు కష్టపెట్టుకుంటున్నావ్? ఈ ఆరునెలల్లో మీకు ఏమన్నా లోటు రానిచ్చామా నేను కానీ తాతకానీ? చెట్టంత కొడుకు పోయినా, వాడిపిల్లల్లో వాడిని చూసుకుంటున్నాం.....".... రాఘవరావుగారి భార్య గద్గదస్వరంతో అంటుంటే, అడ్డుకుని సంధ్య...

.

" బామ్మా! మీరు నిజానికి మాకు అర్హతున్న దానికన్నా ఎక్కువ చూసుకుంటున్నారు. మా అమ్మ గది వదలకపోయినా... అన్నీ అక్కడికే పంపుతారు. మాకు ఏదంటే అది చేస్తున్నారు. బెస్ట్ స్కూల్ లో వేసారు తాతగారు. ఈ ప్రోసెస్ లో మిగిలిన పిల్లలు ఎంత కోల్పోతున్నారో మీరు గమనించడం లేదు. పదిమందిపిల్లలపై చూపించే ప్రేమ ఇప్పుడు మా ముగ్గురిమీదే కేంద్రీకరిస్తున్నారు. కుర్రాళ్లు ఆటల్లోనో, స్కూల్లోనో గొడవపడితే ... సాయం, సమయ్ లను మినహాయించి.... మిగిలిన వారిని దెబ్బలాడతారు. ఇది వరకూ తాతగారి కారులో స్కూల్ కెళ్లే వాళ్ళు ఇప్పుడు ఆటోలో వెళ్లాలి. ఇదివరకటి ఆదివారం కుటుంబసమావేశాలు, తాతగారితో సినిమాలూ, హోటల్ కూ వెళ్లడాలు ఆగిపోయాయి.తాతగారి కాలమంతా మాకోసమే వెచ్చిస్తున్నారు. ఎందుకంటే మాకు నాన్న లేడు. వాళ్లకున్నారు. పెద్దమ్మలు కానీ, అత్తకానీ పొద్దున్నే టిఫిన్ చెయ్యకపోతే పిల్లలు కిందకొచ్చి, బ్రేక్ ఫాస్ట్ తినేవారు. కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర మేము ముగ్గురం ఆవాటా తినేస్తూ. ధీరజ్ అన్న ఆటల్లో ఫస్ట్. నేను చదువులో బ్రైట్. ఇద్దరినీ పోలుస్తూ..... తండ్రిలేకపోయినా నేను బాగా చదువుతున్నానని నాకే కితాబులిస్తుంటే.... వాళ్లకు ఎందుకు నచ్చాలి? మా అమ్మానాన్నలకే అక్కరలేని మాకు జాలితో వచ్చే ఈ ప్రివిలేజెస్ వద్దండి తాతగారూ. మేము అనాధలుగా బయట బతకడం సమంజసం. మాకు మమ్మల్ని గారంగా చూసే పెద్దనాన్నలు , పెద్దమ్మలూ కావాలి. సుమతో సమంగా ముద్దలు పెట్టే అత్తకావాలి. వాళ్ల బడ్జెట్ నుంచి మాకోసం కేటాయించే పైసలు వద్దు. మేము తండ్రిలేని పిల్లలుగా ఈ ఛారిటీ తీసుకోలేము. ...".... తెలుగూ, ఇంగ్లీషు కలగలుపుతూ ఆ పదిహేనేళ్ల పిల్ల ఆవేశంతో , ఆవేదనతో తన మనసు పరుస్తుంటే.... అక్కడ అందరి తలలూ సిగ్గుతో అవనతమయ్యాయి. 


అందరికన్నా ముందు ప్రీతే నోరిప్పింది. " ఐ యాం వెరీ సారీ సంధ్యా...."...... తల్లిమాటలను షార్ప్ గా ఖండిస్తూ... సంధ్య...


" షేమ్ ఆన్ యూ అమ్మా! యు ఆర్ ఎ డిస్ గ్రేస్ టు మదర్ హుడ్ అండ్ ఉమన్ హుడ్ అమ్మా. ఏ త్యాగాలు చేసావు నువ్వు? నాన్నకు నువ్వు సపోర్ట్ గా నిలబడివుంటే , తను మనకు మిగిలి ఉండేవాడు. మా బాధ్యత ఎంత తీసుకున్నావు? నీ చదువు, నీ తెలివితేటలు మరిచిపోయి డిప్రెషన్ అనే కకూన్ లోకి దూరిపోయి మమ్మల్ని కూడా పారసైట్స్ చేసావు. షేమ్ ఆన్ యూ! వీళ్లు మమ్మల్ని ఎందుకు పోషించాలి? చెప్పు! అందరి రైట్స్ మాకోసం ఎందుకు త్యాగం చెయ్యాలి? ఈ ఓల్డేజ్ లో గ్రాండ్ పా కు మా రెస్పాన్సిబిలిటీ ఎంత భారమో ఆలోచించావా? గదిలో శూన్యంలోకి చూస్తూ గడిపేయడం ఎస్కేపిజమ్ అమ్మా. నువ్వు పిరికిదానివి. మమ్మల్ని పెంచలేవు. అందుకే వి ఆర్ ఆబ్ సల్యూట్ ఆర్ఫన్స్ టు ద కోర్......."...। పిల్ల ఏడుస్తోంది.

" అలా అనకు సంధ్యా! నేను మారతాను. నేను మిమ్మల్ని చూసుకుంటా. మనం వెళ్లిపోదాం. నేను మళ్లీ ఉద్యోగంలోకి వెళ్తా! మీ నాన్నలాగే చూసుకుంటా. ఐ ప్రామిస్. నమ్ము సంధ్యా! ..... పిలలను పొదువుకుని దెబ్బతిన్న తల్లిపక్షిలా కదిలిపోతోంది ప్రీతి ! 


🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


మరో నెల్లాళ్లలో పిల్లలంతా కైలాసగిరి ట్రెక్కింగ్ కు వెళ్లినప్పుడు సంధ్యతో అన్నాడు ధీరజ్... " సంధ్యా! నువ్వు ఆ రోజు నాపేరు ఎందుకు బయటపెట్టలేదు? నువ్వు నన్ను చూసావు కూడా డాబామీద. మోరోవర్ ఆరోజు ఎందుకంత ఆవేశంగా మాట్లాడావు? ....

" అన్నా! ఆరోజు నేను అలా నా మనసులో బాధ బయటకు చెప్పడం వలనే కదా... ఈరోజు మనమంతా స్నేహంగా ఉన్నాము. మా అమ్మ ఉద్యోగానికి వెళ్తోంది. మా నాన్నలేకపోయినా మేమూ గౌరవంగా బతుకుతాము ఇకముందు. మేము ఎప్పటికీ పోగొట్టుకున్నామనుకున్న కుటుంబం ప్రేమ మళ్లీ మాకు దొరికింది. ఇది చాలు అన్నా మాకు. తండ్రిలేని పిల్లలన్న సానుభూతి వద్దు. ...మా నాన్న అది ఎప్పటికీ హర్షించడు.ీ " 


తనకన్నా రెండింతలు మెచ్యూరిటీతో అందరి మన్ననలూ పొందిన సంధ్యను చూసి..." నువ్వు లైఫ్ లో చాలా పైకి వస్తావు సంధ్యా. ఐయాం సో ప్రౌడ్ ఆఫ్ యూ" అన్నాడు ధీరజ్


ధీరజ్ మాటలు నిజం చేస్తూ సంధ్య.. చాలా గొప్పచదువులు చదివి... తండ్రి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే... తన తమ్ముళ్లతో కలిసి, తల్లి గైడన్స్ లో "పీ ఆర్ సాఫ్ట్ సొల్యూషన్స్" అనే సాఫ్ట్ వేర్  కంపెనీ పెట్టి, పదేళ్లలో పదిదేశాలలో ....వేల ఉద్యోగులతో విజయవంతంగా విస్తరించి...సాయంసంధ్యా సమయ్ లు ... తండ్రిలేని పిల్లలయినా ఎంత పైకి వచ్చారని నలుగురిలో గొప్పమెప్పుపొందడం కొసమెరుపు! 


శశికళ ఓలేటి

21-2-2020

కామెంట్‌లు లేవు: