*భక్తి..సేవ..ఫలితం..*
"నా పేరు లీలావతి..ఎల్లుండి శుక్రవారం నాడు మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు రావాలని అనుకుంటున్నాను..పదకొండు రోజులు అక్కడే ఉండాలని అనుకున్నాను..వసతి చూపించగలరా?." అని ఆ యువతి నన్ను ఫోన్ ద్వారా అడిగింది.."ఈవారం ప్రత్యేకంగా మీకు కేటాయించడానికి రూములేవీ ఖాళీ లేవండి.." అన్నాను.."ప్రత్యేకంగా రూము వద్దండీ..నేను స్వామివారి మంటపం లోనే ఉంటాను..అక్కడ ఉండటానికి అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నాను.." అన్నది.."అలా అయితే సరేనమ్మా..మీరు రండి.." అని చెప్పాను.."అలాగేనండీ.." అన్నది..
ఆ ప్రక్క శుక్రవారం నాతో ఫోన్ లో మాట్లాడిన లీలావతి గారు ఉదయం 10 గంటలకు మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు బస్సులో వచ్చారు..ఆమెతో పాటు మరో యువతి కూడా వచ్చింది..శుక్రవారం నాడు శ్రీ స్వామివారి మందిరం శుభ్రం చేసే కార్యక్రమం ఉంటుందని పాఠకులకు తెలుసు..లీలావతి గారు, ఆమెతో వచ్చిన యువతి ఇద్దరూ నా వద్దకు వచ్చారు.."అయ్యా..మీతో మాట్లాడిన లీలావతి ని నేనే..ఈమె నా కూతురు..పేరు పుష్పవల్లి..అమ్మాయికి కొన్ని సమస్యలున్నాయి..ఈ స్వామివారి వద్ద కొన్నాళ్ళు ఉంటే..ఆ సమస్యలు తీరిపోతాయని ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాము..మాది పల్లెపాలెం.." అన్నది.."అమ్మా..అందరితో పాటు వుండగలము అనుకుంటే..మందిరం వెనకాల ఒక షెడ్ ఉన్నది..అందులో వుండండి..రాత్రికి ఇక్కడ మంటపం లో పడుకోవచ్చు.." అని చెప్పాను.."సరేనయ్యా.." అని మా సిబ్బంది చూపించిన షెడ్ లో వాళ్ళ సామాన్లు పెట్టుకొని వచ్చారు..స్వామివారి పూజకొఱకు వాడే వస్తువులను ఇతర ఆడవాళ్ళతో కలిసి తామూ శుభ్రంగా కడిగి పెట్టారు..ఆరోజు మధ్యాహ్నం హారతి తీసుకొని..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చారు..శుక్రవారం సాయంత్రం స్వామివారి వెండి పాదాలను శుభ్రం చేసిన నీళ్లను తీర్ధంగా తీసుకొని..ఆపై హారతి తీసుకొని మంటపం లోనే వున్నారు..శని, ఆదివారాలు మా పనిలో మేము ఉండిపోయాము..
"అయ్యా..మొన్న వచ్చిన తల్లీకూతుళ్ల కు ఆరోగ్య సమస్యలేవీ ఉన్నట్లుగాలేవు..ఇద్దరూ బాగున్నారు..మరి వాళ్ళు ఏ బాధతో ఇక్కడికి వచ్చారో తెలియడం లేదు..ఉదయం మూడు గంటలకే ఇద్దరూ బావి వద్ద స్నానం చేసి..ఆ తడిబట్టల తోనే లోపలికి వచ్చి..నూటయెనిమిది ప్రదక్షిణాలు చేస్తున్నారు..స్వామివారి హారతి కళ్లకద్దుకొని..వెళ్ళిపోయి..మళ్లీ ఎనిమిది గంటల కల్లా మందిరం లోకి వస్తున్నారు..ఊరికే ఉండటం లేదు..మంటపం లో ఏమూల శుభ్రంగా లేకపోయినా..వెంటనే శుభ్రం చేస్తున్నారు..ఏదో ఒక సేవ చేస్తూనే వున్నారు..మరి వాళ్ళు ఏ కోరికతో స్వామివారి వద్దకు వచ్చారో తెలియడం లేదు..వాళ్ళ వల్ల ఎవ్వరికీ ఇబ్బంది లేదు సరికదా..స్వామివారి పూజా వస్తువులన్నీ శుభ్రం చేయడానికి సహాయం కూడా చేస్తున్నారు..." అని మా సిబ్బంది చెప్పారు..
పదకొండు రోజుల పాటు ఉంటానని చెప్పిన లీలావతి, ఆమె కూతురు నెల రోజులు గడిచినా స్వామివారి సన్నిధి లోనే వున్నారు..ఒకరోజు ఉదయం నా వద్దకు వచ్చి.."అయ్యా..మేము పదకొండు రోజులు వుందామని అనుకున్నాము..కానీ మేము నలభై రోజులు ఉండాలని అనుకుంటున్నాము..మా సమస్య తీరుతుందని ఆశగా ఉంది..మీరు పెద్ద మనసుతో అంగీకరించండి.." అన్నది.."అమ్మా..అడుగుతున్నానని అనుకోవద్దు..అసలు మీ సమస్య ఏమిటి..?" అన్నాను..
లీలావతి ఆమె కూతురు ముఖాముఖాలు చూసుకున్నారు..ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అనుకొని.."అయ్యా..మా అమ్మాయికి వివాహం జరిగి ఐదేళ్లు అయింది..సంతానం లేదు..ఈ అమ్మాయి అత్తగారు "పిల్లలు పుట్టని కోడలు మాకెందుకు..? మా అబ్బాయికి మేము ఇంకో పెళ్లి చేసుకుంటాము..నువ్వు వెళ్లిపో.." అన్నారట..ఇది ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది..మేము మా అల్లుడితో మాట్లాడాము..అతను అటు తల్లిని ఒప్పించలేక..మాతో మీ అమ్మాయిని కొన్నాళ్ళు మీ దగ్గర వుండనియ్యండి..మా అమ్మ ను ఒప్పించి నా భార్యను తీసుకెళతాను..అని చెప్పాడు..అమ్మాయి కాపురం చక్కబడాలని స్వామివారి కి మొక్కుకున్నాను..నేనూ మా అమ్మాయి స్వామివారి సేవ చేసుకుంటూ కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే..దీని కాపురం నిలుస్తుందని..స్వామి దయ చూస్తాడని నాకు నమ్మకం..ఆ నమ్మకం తోనే దీన్ని తీసుకొని ఇక్కడకు వచ్చాను.." అన్నది..నాకు చిత్రంగా అనిపించింది..ఈరోజుల్లో కూడా ఇటువంటి అత్తగార్లు ఉన్నారా?..అని.."మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది..మీ ఇష్టప్రకారమే నలభై రోజులూ వుండండి.." అన్నాను..ఇద్దరూ నమస్కారం పెట్టి వెళ్లిపోయారు..
మరో ఆరు రోజులు గడిచాయి..ఒకరోజు ఉదయాన్నే మొదటి బస్సు లో ముగ్గురు వ్యక్తులు వచ్చారు..ఇద్దరు దంపతులు..వాళ్ళ కుమారుడు..నేరుగా మందిరం లోపలికి వచ్చి.."ఇక్కడ లీలావతి అనే వారు ఉన్నారా?.." అని అడిగారు..మంటపం లో కూర్చున్న లీలావతి ని మా వాళ్ళు చూపించారు..ఈ ముగ్గురూ అక్కడికి వెళ్లారు..వాళ్లలో వాళ్ళు సుమారు గంటసేపు మాట్లాడుకుంటున్నారు..ఆ దంపతులు లీలావతి చేతులు పట్టుకొని..ఏదో చెపుతున్నారు..మరి కొద్దిసేపటికి లీలావతి కూతురు పుష్పవల్లి, ఆ దంపతులతో పాటు వచ్చిన యువకుడూ ఇద్దరూ కలిసి..స్వామివారి వద్ద అర్చన చేయించుకున్నారు..ఇద్దరూ స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..ఆ తరువాత లీలావతి నా వద్దకు వచ్చి.."అయ్యా..స్వామివారు మా మీద దయ చూపారు..మా వియ్యంకులు వచ్చింది..అమ్మాయిని కాపురానికి తీసుకెళతానని చెప్పారు..అల్లుడూ వచ్చాడు..అన్ని విషయాలూ మాట్లాడుకున్నాము..కాకుంటే..మేము స్వామివద్ద నలభై రోజులు ఉంటామని అనుకున్నాము..ఈనాటికి ఇంకా ఐదు రోజులు గడవాలి..అందుకని ఈ నలభై రోజులూ పూర్తయిన తరువాత..మంచిరోజు చూసి అమ్మాయిని పంపుతామని చెప్పాను..ఒప్పుకున్నారు..స్వామివారు దాని కాపురం నిలబెట్టారు.." అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నది..
మరో ఐదురోజులు ఆ తల్లీకూతుళ్ళు ఎప్పటిలాగే స్వామివారి సేవ చేసుకుంటూ గడిపారు..నలభై ఒకటోరోజు..స్వామివారికి పూజ చేయించుకొని..సమాధి దర్శనం చేసుకొని..తమ గ్రామానికి వెళ్లిపోయారు..ఆ తల్లీకూతుళ్లకు స్వామివారి మీద ఉన్న అపరిమిత భక్తి విశ్వాసం మేము కళ్లారా చూసాము..అంతేకాదు ఆ భక్తి విశ్వాసాల ఫలితాన్ని కూడా ప్రత్యక్షంగా చూడగలిగాము..
ఈ సంఘటన జరిగిన రెండేళ్ల తరువాత..లీలావతి తన కూతురు అల్లుడు ..వాళ్లకు పుట్టిన పాప తో సహా స్వామివారి వద్దకు వచ్చి..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..ప్రక్కరోజు అన్నదానం చేసింది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి