🌹🌹🌹🌷🌷🌹🌹🌹 *🌷శ్రీ దత్త వాక్సుధారసం🌷*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
విశ్వానికంతటికి మూల కారణమైన అనాది పరబ్రహ్మము ఒక్కటే. నిజానికి పరబ్రహ్మమునకు ఏ పేరు కాని, జాతి కాని లేవు. కాని మాయ వలన కలిగిన మోహమనెడి చీకటిలో పరబ్రహ్మమును గురించిన భావన కొరకు మాత్రమే ఈ పేరు పెట్టబడినది.
పిల్లలు పుట్టినప్పడు ఏ పేరూ పెట్టుకుని రారు. కాని, అటు తరువాత మనం ఆబిడ్డను పేరు పెట్టి పిలుస్తూ ఉంటే క్రమంగా ఆ పేరు వినగానే బిడ్డ పలుకుతూ ఉంటుంది. ఆవిధంగానే సంసారములోని బాధలను దుఃఖములను భరించలేక జీవులు ఆర్తితో భగవంతునికి తమ కష్టములను గురించి చెప్పుకునేటప్పుడు ఏ పేరుతో పిలిచినప్పుడు ఆ బ్రహ్మత్వము మారుపలికి అతనికి జవాబిస్తుందో, అదే ఈ "సాంకేతికము" (ఓం తత్ సత్) అనగా గుర్తించటం కోసం ఏర్పడిన పేరు, కొందరు 'రామా' అని అనవచ్చును. మరికొందరు "కృష్ణా" అనవచ్చును. కొందరు శివుడనీ ఇంకొందరు 'అమ్మ' అని పిలువ వచ్చును మొదలైన ఏ పేరుతో ఎవరు ఎలాగయినా పిలువవచ్చును.
ఏ పేరుతో పిలిచినా, ఏరూపాన్ని తలచినా పలికే "దైవం" మాత్రం ఒక్కటే.
ఓమ్, తత్, సత్, అనునది 'బ్రహ్మము' యొక్క త్రివిధ నామము. ఈనామముతో ఏకరూపముచెంది సాత్త్విక కర్మాచరణము చేసినప్పుడు మాత్రమే మానవుడు కైవల్యమును పొందగలుగును.
నోటితో బ్రహ్మము యొక్క నామమును పలుకుతూ, చేతులతో సాత్త్వికకర్మలు చేస్తున్నప్పటికీ కూడా, దాని వినియోగాన్ని గురించిన జ్ఞానం లేకపోతే ఆపనులన్నీ కూడా వ్యర్థమే.
ఈనామంలోని మూడు అక్షరములను కర్మ యొక్క ఆరంభము, మధ్య మరియు అంత్యమనెడి మూడు స్థానములో ఉపయోగించాలి. ఈ వ్యవస్థవలననే బ్రహ్మవేత్తలు, బ్రహ్మస్వరూపాన్ని పొందగలిగారు. ఈ నామ సహాయంవలన లోకులు బంధకరములైనట్టి కర్మలనుండి విముక్తిని పొందుతారు. ఈవిధంగా యజ్ఞదానాది కర్మలు ఓంకార సహాయముచే హితకరములగుచున్నవి. ముముక్షువులు వివిధములైన యజ్ఞములను, తపస్సు, దానములను చేయునప్పుడు ఫలమును కోరకుండా 'తత్' అని ఉచ్ఛరించుచూ చేయుదురు. "తత్ రూపియగు బ్రహ్మకు ఈ కర్మలన్నియు ఫల సహితముగా అర్పితము అగుగాక!" అని విజ్ఞ పురుషులు తమ కర్మ ఫలమును భగవంతునికి అర్పించి కర్మచేయటంవలన ఆకర్మయొక్క ఫలము వారికి బంధం కాకుండా ఉంటుంది. 'తత్' రూపియగు బ్రహ్మకు తమసమస్త కర్మఫలములను అర్పించి 'నమమ' అంటూ సమస్త కర్మఫలముల నుండి తమను తాము వేరు చేసుకుంటారు. "నమమ" అనగా ఈఫలము నాది కాదు."
హోమము చేయునప్పడు దేవతల నుద్దేశించి "ఇంద్రాయ స్వాహా| ఇంద్రాయ ఇదం నమమ.." మొదలైన మంత్రాలు చెపుతారు. అదేవిధంగా ఏదైనా దానము ఇచ్చినప్పడు. "తుభ్యం బ్రాహ్మణాయ దదామి. బ్రాహ్మణాయ ఇదం నమమ” అని చెపుతారు. అనగా దానమిచ్చిన వస్తువు దానము పుచ్చుకొన్న బ్రాహ్మణునకు చెందుగాక! ఇక ఆవస్తువు నాకు చెందదు. అని మామూలుగా అర్థం చెపుతారు. కర్మయోగి దానమిచ్చిన వస్తువునే కాక ఆదానఫలమును కూడా వదులుకుంటున్నాడు. అని ఈ “నమమ" అను మాటకు అర్ధము. నమమ అనగా నాది కాదు. అలాగే కర్మయోగి హోమం చేయునప్పడు హోమ ద్రవ్యము మాత్రమే కాక తత్ఫలము కూడా తనకు అక్కరలేదని అంటారు.
ఈవిధముగా ఓంకారముచే ఆరంభించబడి బ్రహ్మార్పణ భావముతో చేయునటివంటి కర్మ, బ్రహ్మరూపమును పొందుతుంది. ఇవి బయటకు కర్మలుగా కనిపించినా కూడా ఆకర్మఫలం కర్తకు అంటదు. అలాకాకుండా ఫలము నాకు కావాలి నేనే చేస్తున్నాను" అనేటువంటి కర్తృత్వభావన కలిగియుండి పైకి మాత్రం "బ్రహ్మార్పణం" అంటూ కర్మచేస్తే అది బ్రహ్మమును పొందదు, ఆకర్మఫలం కర్తకు చెంది తీరుతుంది.
పరమేశ్వరుడు సర్వ స్వతంత్రుడు, ప్రభువు. నియామకుడు. నేను నిమిత్తమాత్రుడను అనే భావముతో కర్మలు చేసి కర్మఫలమును భగవదర్పణ చేస్తే భగవంతుడు ఆఫలమును స్వీకరించి కర్మబంధము నుండి జీవునికి విముక్తి కలిగిస్తాడు - అని భక్తులు చెపుతారు.
ఉప్పునీటిలో కరగి పోయినప్పటికీ కూడా దానికి గల ఉప్పదనము మాత్రము మిగిలి ఉండే విధంగా "మనము మన కర్మలను బ్రహ్మార్పణ మొనర్చాము" అనేటువంటిద్వైతభావం కర్తలోనిలిచే ఉంటుంది. అయినప్పటికీ చిత్తశుద్ధి కల్గుతుంది. రాగద్వేషాదులు లేని చిత్తము ఏర్పడుటను చిత్తశుద్ధి అంటారు. దీని వలన జ్ఞానమార్గమున ఉత్తమాధికారి అవుతాడు, బ్రహ్మవిచారమువలన జ్ఞానము కలుగుతుంది. ఈ విధంగా నేను అనేటువంటి అహంకారము, కర్తృత్వాభిమానము ఉన్నంతవరకూ సంసారభయము పోదు - అని జ్ఞానులు అంటారు.
స్వయముగా పరమేశ్వరుని ముఖమునుండి చెప్పబడిన వేదములు ఈ విషయమును గట్టిగా నొక్కి చెప్పుచున్నవి. ఈనామరూపాత్మకమైన జగత్తంతయు అనిత్యము. ఇది శాశ్వతము కాదు. అందువలన ఇది "సత్" కాదు. కేవలము ఆత్మస్వరూప ప్రాప్తి వలననే ఆ "సత్" అనెడి తత్వ జ్ఞానము కలుగును. ఈసత్ తత్వము వలననే ఇంతకు పూర్వము ప్రశస్తముగానైన కర్మలన్నీ కూడా ఐక్య జ్ఞానమువలన సమరూపమును పొందును. అంతట ఆత్మస్వరూపుడగు "బ్రహ్మము" తెలియబడును. ఇందువలన ఓంకారము మరియు ఓంకారముచేత బ్రహ్మాకారమును పొందిన కర్మలన్నియు పరిపక్వమై ఒక్కమారుగా సంపూర్ణముగా సద్రూపమును పొందును. ఏఏ కర్మలు చేసినప్పటికిన్నీ సమస్తకర్మలూ బ్రహ్మార్పణమనుటచేత బ్రహ్మారూపముగానే అయిపోవును. సముద్రములో కలసిన తరువాత నదులను వేరుపరచలేని విధముగా బ్రహ్మార్పణమొనర్చబడిన కర్మలలో ఎక్కువ తక్కువ భేధములు ఉండవు.
ఓం, తత్, సత్ అనే మూడు శబ్దములు ఈవిధముగా పర బ్రహ్మమును గూర్చి తెలియచేస్తున్నాయి. బ్రాహ్మణులు, వేదములు యజ్ఞములు, తమ పవిత్రతను కాపాడుకోవటానికి ఈశబ్దములనే ఉపయోగిస్తూ ఉంటారు (యి), బ్రాహ్మణులు చేసే కర్మలలో కాని, వేదములు పలికే సమయంలో కాని, యజ్ఞములు చేసేటప్పుడు కాని తెలిసో, తెలియకో ఏవైనా లోపాలు సంభవిస్తే ఆలోపాలను ఈ మూడు శబ్దములు పోగొట్టి పవిత్రతను కలిగిస్తాయి.
మోక్షము కోరువారు ఫలాపేక్ష లేకుండా ఈ "తత్" శబ్దమును ఉచ్ఛరించి యజ్ఞాలు, తపస్సులు, దానాలు చేస్తూ ఉంటారు. మంచి విషయాలలోను, ఉత్తమ కర్మలు చేసేటపుడు "సత్" అనే శబ్దాన్ని వాడతారు. యజ్ఞాలలో, తపస్సులలో, దానములలో స్థిరమైన నిష్ఠనే శ్రద్ధ అంటారు. ఈశ్వరానుగ్రహం కొరకు శ్రద్ధతో చేయబడే కర్మలన్నీ కూడా సత్కర్మలు, కర్మ + భగవంతుడు= కర్మయోగము. శ్రద్ధ లేకుండా చేసే కర్మలు అసత్కర్మలు. చేసేది, ఏ కొంచెమైనా సరే శ్రద్ధగా చెయ్యాలి. అశ్రద్ధతో ఎంతపనిచేసినా అది వ్యర్ధమే.
ఏది చేసినా సర్వం గురు జ్ఞాన మయం. కనుక సర్వం దత్తార్పణం అని కార్యాంతములో చెప్పుకొని కార్య ఫలాన్ని దత్తునికీ దత్తం చేయాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*జై గురు దత్త* 🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి