11, మే 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం*

 *08.05.2021  సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  అరువది రెండవ అధ్యాయము*


*ఉషా - అనిరుద్ధుల సమాగమము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*చిత్రలేఖోవాచ*


 *62.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*వ్యసనం తేఽపకర్షామి త్రిలోక్యాం యది భావ్యతే|*


*తమానేష్యే నరం యస్తే మనోహర్తా తమాదిశ॥10863॥*


*అంతట చిత్రలేఖ ఇట్లనెను* "సుందరీ! నేను సకల రాకుమారుల చిత్తరువులను రూపొందించి నీ ముందుంచగలను. వారిలో నీ మనస్సును దోచిన సుందరుని నీవు గుర్తింపగల్గినచో, అతడు ముల్లోకములలో ఎక్కడ ఉన్నను తీసికొనివచ్చి నీ ముందుంచగలను. ఆ విధముగా నీ విరహవేదనను శాంతింపజేయగలను. అందులకై నన్ను ఆదేశింపుము"


 *62.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*ఇత్యుక్త్వా దేవగంధర్వసిద్ధచారణపన్నగాన్|*


*దైత్యవిద్యాధరాన్ యక్షాన్ మనుజాంశ్చ యథాలిఖత్॥10864॥*


చిత్రలేఖ ఇట్లు పలికిన పిమ్మట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, నాగులు, దైత్యులు, విద్యాధరులు, యక్షులు, మానవులు మున్నగువారి చిత్రములను యథాతథముగా లిఖించెను.


 *62.20 (ఇరువదియవ శ్లోకము)*


*మనుజేషు చ సా వృష్ణీన్ శూరమానకదుందుభిమ్|*


*వ్యలిఖద్రామకృష్ణౌ చ ప్రద్యుమ్నం వీక్ష్య లజ్జితా॥10865॥*


 *62.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*అనిరుద్ధం విలిఖితం వీక్ష్యోషావాఙ్ముఖీ హ్రియా|*


*సోఽసావసావితి ప్రాహ స్మయమానా మహీపతే॥10866॥*


చిత్రలేఖ మానవులలో శూరుడు (వసుదేవుని తండ్రి), వసుదేవుడు, బలరామకృష్ణులు, ప్రద్యుమ్నుడు మొదలగువారి చిత్రములను లిఖించెను. ఆ చిత్రపటములను వరుసగా చూచుచు వచ్చిన ఉషాసుందరి ప్రద్యుమ్నుని చిత్తరువును చూచినంతనే ఇంచుక సిగ్గుపడెను. పరీక్షిన్మహారాజా! పిమ్మట అనిరుద్ధుని చిత్రమును కాంచినంతనే ఉషాసుందరి సిగ్గుతో తలవంచుకొని, చిఱునగవుతో 'ఇతడే! ఇతడే! నా మనోహరుడు' అని పలికెను.


*62.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*చిత్రలేఖా తమాజ్ఞాయ పౌత్రం కృష్ణస్య యోగినీ|*


*యయౌ విహాయసా రాజన్ ద్వారకాం కృష్ణపాలితామ్॥10867॥*


అంతట యోగినియైన చిత్రలేఖ అతనిని కృష్ణుని మనుమడైన అనిరుద్ధునిగా గుర్తించెను. వెంటనే ఆమె అప్పటికప్పుడే (ఆ రాత్రియే) బయలుదేఱి, ఆకాశమార్గమున పయనించి, కృష్ణుని పాలనలో నున్న ద్వారకానగరమునకు చేరెను..


*62.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తత్ర సుప్తం సుపర్యంకే ప్రాద్యుమ్నిం యోగమాస్థితా|*


*గృహీత్వా శోణితపురం సఖ్యై ప్రియమదర్శయత్॥10868॥*


ఆ సమయమున అనిరుద్ధుడు హంసతూలికా తల్పముపై నిదురించుచుండెను. అంతట చిత్రలేఖ తన యోగమాయా ప్రభావమున అతనిని తీసికొని శోణితపురమునకు చేరి, తన నెచ్చెలియగు ఉషాసుందరికి ఆమె యొక్క ప్రియుని చూపించెను.


*62.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*సా చ తం సుందరవరం విలోక్య ముదితాననా|*


*దుష్ప్రేక్ష్యే స్వగృహే పుంభీ రేమే ప్రాద్యుమ్నినా సమమ్॥10869॥*


ఆ ఉషాదేవి ఆ పరమసుందరుని (అనిరుద్ధుని) గాంచినంతనే సంతోషముతో ఆమె ముఖమున కోటికాంతులు వెల్లివిరిసెను. ఆ సుందరియొక్క ఏకాంతమందిరము పరపురుషులెవ్వరును తొంగియైనను చూడజాలనంతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సురక్షితముగానున్నది. ఆమె అట్టి తన అంతఃపురమున తన ప్రాణప్రియుడైన అనిరుద్ధునితో క్రీడించెను.


*62.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*పరార్ధ్యవాసః స్రగ్గంధధూపదీపాసనాదిభిః|*


*పానభోజనభక్ష్యైశ్చ వాక్యైః శుశ్రూషయార్చితః॥10870॥*


*62.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*గూఢః కన్యాపురే శశ్వత్ప్రవృద్ధస్నేహయా తయా|*


*నాహర్గణాన్ స బుబుధే ఊషయాపహృతేంద్రియః10871॥*


అతనియెడ ఆమె ప్రేమానురాగములు దినదినప్రవర్ధ మానమగుచుండెను. ఆ సుందరి మిగుల శ్రేష్ఠమైన వస్త్రాభరణములు, పూలమాలలు, సుగంధ లేపనములు, ధూపదీపములు, సుఖాసనములు మొదలగు ద్రవ్యములతోను, మధుర పానీయములతోను, భక్ష్యభోజ్యములతోను, నర్మభాషణములతోను, ఇతర సేవలతోను తన ప్రియుని ఆరాధించుచుండెను. ఆ విధముగా ఆ లలనామణి అతని హృదయమును ఆకట్టుకొనెను. ఆ అంతఃపురములో రహస్యముగా సుఖడోలికలలో తేలియాడుచున్న ఉషా-అనిరుద్ధులకు ఎన్ని దినములు గడచిపోవుచున్నదియు తెలియకుండెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి     అరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: