11, మే 2021, మంగళవారం

_వైశాఖ మాసం విశిష్టత_*

 *_వైశాఖ మాసం విశిష్టత_*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో  వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో  *ఏక భుక్తం , నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది.*  వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు , తపస్సులకు పూజాదికాలకు , దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.


ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో , వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.

మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే ! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు , నక్షత్రాలు , వారాలు , మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని , ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. 

చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత , విశిష్టత ఉన్నాయి.

కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి *వైశాఖమాసం* అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత , పవిత్రత , దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.


ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా

పేరుపొందిన *వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు  స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.* అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే.

అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన , పూజ , దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం , పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.


వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ , గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ , చెరువులోగాని , బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.


వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం , నీరు , గొడుగు , విసనకర్ర , పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం , చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.

సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది. సదా మీ సేవలో శ్రీ గాయత్రీ క్యాటరర్ గంప మాధవరావు

కామెంట్‌లు లేవు: