11, మే 2021, మంగళవారం

పంకజం పదనిసలు - 10*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

ఇది ఇప్పుడు వ్రాసింది కాదండోయ్. అల్లప్పుడు లాక్డౌన్లో ప్రైవేటు డాక్టర్లందరూ ఖాళీగాఉండి తీరిగ్గా డాన్సులూ పాటలూ యూట్యూబ్లో పెడుతూ ఎంజాయ్ చేసినరోజులు. పాపం మళ్ళీ ఇప్పుడు బిజీ అయిపోయార్లెండి. 


 *పంకజం పదనిసలు - 10* 


 ఓ చేత్తో కాఫీకప్పూ, ఇంకో చేత్తో పకోడీ ప్లేటూ బాలెన్స్ చేస్తూ కుంటుతూ నడుస్తున్న నన్ను పంకజం నవ్వుతూ చూస్తోంది. 


"ఏంటీ మొన్న డాన్స్ తాలూకు నెప్పి తగ్గక నేను చస్తుంటే, అంత కన్నార్పకుండా చూస్తున్నావ్" విసుక్కున్నాను పంకజాన్ని. 


"అసలు నీకు డాన్స్ రాదన్న అపోహ నాకు ఎందుకొచ్చిందా?  అని ఆలోచిస్తున్నా.  ఇప్పుడు రెండుచేతుల్లో కప్పూ, ప్లేటూ పట్టుకు నడుస్తుంటే, నీ నడకే నాట్యంలా ఉంది తెలుసా" అంది. 

వెక్కిరిస్తోందని అర్ధమవుతూనేఉంది.  కసిగా పెదవికొరుక్కొని మావారి దగ్గరికి వెళ్ళాను. "డాక్టర్ దగ్గరికి వెళదాం పదండి అర్జంటుగా" అని ఆర్డర్ వేశాను. 


హాయిగా పకోడీలు నముల్తూ మధ్య మధ్యలో కాఫీ తాగుతూ" మొన్నేగా వెళ్ళొచ్చాం మన ఫామిలీ డాక్టర్ గుర్నాధం గారి దగ్గరికీ, నెమ్మదిగా ఓ వారం పది రోజుల్లో తగ్గుతుందని చెప్పాడుకదా" అన్నారు. 


నాకోపం నషాలానికి అంటింది.  అందుకే ...సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కి వెళదామనేది.  అక్కడైతే ఎంచక్కా వెంఠనే తగ్గుతుంది. దగ్గరలోనే ఉన్న "వైద్య" సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కి వెళదాం, అన్నాను. 


"అమ్మో! ఆ సముద్రం  లో పడితే సాయంత్రానికి కానీ పైకి తేలం.  అసలే కరోనా  రోజులు నేను రాను గాక రాను" అని తేల్చేసారు.  నేను మాత్రం ఎందుకూరుకుంటానూ,  అంతకంటే మొండిగా"సరే మీ ఇష్టం నేనుమాత్రం రేపొద్దునే వెళ్ళి కాలునెప్పి వెంఠనే తగ్గించుకుంటా" అని మంగమ్మ శపధం చేసాను. 


తెల్లారి చకచకా టిఫినూ, వంటా కానిచ్చి, ఆయన్ను కూడా బైల్దేరదీశాను.  నాలుగు వీధుల అవతల ఉన్న హాస్పటల్ కి. 


హాస్పిటల్  గేటుదగ్గర దించి, ఓ పదివేలు నాచేతిలో పెట్టి "నేను మాత్రం రాను నువ్వే వెళ్ళిరా" అనిచెప్పి చక్కా వెళ్ళిపోయారు తను. 


ఎప్పుడూ వచ్చేపోయే జనాలతో పెళ్ళిపందిరిలా హడావుడిగా ఉండే ఆ ఐదంతస్తుల భవనం చాలా నిశ్సబ్దంగా నిద్రపోతోంది. ఔరా! కరోనా! ఎంతపని చేసావ్ అనుకున్నా. 


గేటుదగ్గరే సానెటైజరు తో చేతులు రుద్దించి, గ్లౌసూ, సాక్సూ, తలతో సహా కవర్చేసే డిస్పోజబుల్ ప్లాస్టిక్ బుర్ఖా ఇచ్చి రెండొందలు వసూలు చేసాడు అక్కడి అసిస్టెంటు. 


"రెండొందలు పోతే పోయినై గానీ ఆస్ట్రోనాట్ లాగా భలే ఉన్నావ్" అంది పకపకా నవ్వుతూ పంకజం. 


నెమ్మదిగా మొదటి అంతస్తు కి చేరగానే," ఇదిగో నాలుగు ఉజ్జీలు, నాది గుర్రం. అంటోందొక నర్సు.  ఇదిగో నాలుగు గుర్రాలు ...నాది ఏనుగు నేనే గెలిచానొచ్" అంటోంది ఇంకో నర్సు.


ఇద్దరూ పేషంట్లకి వేసే చైర్ల వరసలు పక్కకి జరుపుకొని కిందకూచొని ఆడుతున్నారు" ఈ పదాలువిని చాలా రోజులైందే, ఏమాటబ్బా!" అని తొంగి చూసి ఆశ్చర్యపోయాను ఎంచక్కా  ఇద్దరూ చింతపిక్కలాట (గిల్లాలాట) ఆడుకుంటున్నారు!


రిసెప్షన్ లో కూచుని ఉండే అందమైన కుర్రపిల్ల ..హాయిగా కాళ్ళు బారచాపి రిసెప్షన్ బల్లమీదపెట్టి నౌకాసనం భంగిమలో సెల్ ఫోన్ లో ఆడుకుంటోంది. 


అరడజను కంప్యూటర్లతో కళ కళ లాడే రిసెప్షన్ ఒక్క అమ్మాయితో బోసిపోతోంది. నెమ్మదిగా" సిస్టర్" అని పిలిచాను.  ఉలిక్కిపడి లేచింది.  "ఏమిటి సమస్య, జలుబూ దగ్గూ ఉన్నాయా? ఇక్కడ ట్రీట్మెంట్ లేదు" అంది భయంగా.

"లేదు లేదు, అలాంటివేం లేవు కాలునెప్పి మాత్రమే" అని భరోసా ఇచ్చాను. "హమ్మయ్య" అని తేలిక పడి ఫైల్లో పేరు అవీ రాసి ఇంకో అసిస్టెంట్ ని కేకేసింది. దూరంగా ఇంకో బల్లమీద బారాకట్ట ఆడుతున్నారు అతనూ ఇంకొకరూ" నాది దోయం, చచ్చావురే.  మళ్ళీ నా ఆటే!  గడులు కదిలించమాక" అని పరుగెత్తుకుంటూ వచ్చి "ఎంటక్కా! ఆట మంచి పట్టులో ఉంటే పిలుస్తావేందీ.  అంటూ నావైపు అనుమానంగా చూసాడు. 


"అలాంటిదేమీ లేదులే" ఆర్థో గారి దగ్గరకు తీసుకువెళ్ళు చెప్పింది నర్సు. 


పేరు  రాయిచ్చుకున్నాక కనీసం రెండుగంటలైన పట్టేది ఒకప్పుడు, ఇప్పుడు వీ ఐ పీ లాగా వెంటబెట్టుకుని తీసుకుని తీసుకుని వెళుతుంటే నవ్వుతూ చూస్తోంది పంకజం. 


ఒకప్పుడు ఆ డాక్టర్ల రూముల ముందు పడిగాపులు కాచేవాళ్ళు పేషెంట్లు. ఇప్పుడు దర్జాగా లోపలికి నడిచాను.  బల్లమీద కూచుని డాక్టర్ గారి వళ్ళో కాళ్ళుపెట్టి పుస్తకం లో హోం వర్క్ చేస్తున్నాడో చిన్న పిల్లాడు. బహుశా ఆయన కొడుకేమో!


నన్ను చూడగానే చెప్పండి ఏమిటీ ప్రాబ్లెం  అన్నాడు. కాలు చూపించి విషయం చెప్పాను." ముందు ఎక్సరే తీయించుకు రండి తరువాత చూద్దాం" అన్నాడు. 


మళ్ళా మూడో అంతస్తులో ఎక్సరే రూముకి వెళ్ళాను. అక్కడ ఎక్సరే తీసేవాళ్ళు ఇద్దరూ ఎంచక్కా "వైకుంఠ పాళి" ఆడుకుంటున్నారు. పంకజం నవ్వుతూ," కరోనా పుణ్యమాని తిండితినటానికి కూడా తీరిక లేని మనుషులు. ఇప్పుడు చూడు ఎంత తీరిగ్గా ఉన్నారో," అని కిసుక్కుమని నవ్వింది. 


రెండు కాళ్ళకీ ఎక్సరేలు తీస్తుంటే" అదేంటీ ఒకకాలేగా నొప్పీ" అన్నాను. "డాక్టర్ గారు రెండు కాళ్ళకీ రాసారండీ" అన్నారు.  ఎనిమిదొందలు బిల్లుకట్టి ఎక్సరేతో మళ్ళా డాక్టర్ దగ్గరికి వచ్చాను. 


"పడినందువల్ల ప్రాబ్లమేమీ లేదండీ ..కాకపోతే మీకు మడమ దగ్గర ఎముక పెరుగుతోంది ఆపరేషన్ చెయ్యాలి" అన్నాడు. "ఇంతకీ ..ఇప్పటి కాలునొప్పీ," అడిగాను. "ఏమీలేదు కొంచెం లిగమెంటు టేరయ్యింది అంతే నొప్పికి టాబ్లెట్ రాస్తాను."


"అంతేనా ఇంకేమీ సమస్య లేదా ఆపరేషను పదిహేను రోజుల తర్వాత నాకు డేట్లు ఖాళినే"అన్నాడు. "పడ్డప్పుడు కొంచెం పొట్ట నొప్పి చేసింది మర్నాడు తగ్గింది లెండి" అన్నాను. 


"అలాగా! మరి చెప్పరే, ఇప్పుడు నొప్పి లేదుకదా అని నిర్లక్ష్యం చెయ్యకూడదు. వెంటనే గైనకాలజిష్టుకు చూపించండి "అని సిస్టర్ ను కేకేసి గైనిక్ కు తీసుకువెళ్ళమని చెప్పాడు. 


పంకజం నవ్వుతూ" మళ్ళీ ఓపీ ఇంకో ఐదొందలు సమర్పయామి కానీయ్" అంది. 


మేం రూం లోకి వెళ్ళే సరికి ...ఈల పాటేదో వినిపిస్తోంది.  సామజ వరగమనా... నినుచూసి  ఆగగలనా ...వయసుమీద మనసుకున్న అదుపు చెప్పతగునా ...ఈ పాటని ఈలతో పాడుతూ వీడియో చేస్తోందావిడ." ఇదేదో నీకేసు లానేవుంది.  ఆ డాన్సుజోలికి పోకుండా హాయిగా ఇలానే విజిల్ ప్రాక్టీసు చెయ్యరాదూ రిస్కుండదూ ..."కొంగు అడ్డం పెట్టుకుని కిసుక్కుమని నవ్వింది పంకజం. 


"కరోనాలో ...కులాసా ...ఎలాఉందో చెప్పండేం" అని కళ్ళు రెపరెప లాడిస్తూ వీడియో పూర్తి చేసిందావిడ. 


కూర్చోమని సమస్యేంటో అడిగి ...వెంటనే అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించుకు  రమ్మంది. అక్కడ పులీ మేకా ఆడుకుంటున్న సిస్టర్ లు డిస్ట్రబ్ చెసినందుకు విసుగ్గా మొహాలుపెట్టి స్కానింగ్ తీసి పంపారు.  వెయ్యిరూపాయలు కట్టి "ద్యావుడా!" అనుకుంటూ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళా. 


"అదృష్టవంతులు!  మీకు సమస్యేమీ లేదు.  లేక పోతే చాలా ఇబ్బంది పడేవారు. ఈమందులు వాడండి అని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చింది." అయినా నొప్పేమీ లేదుకద మందులేంటబ్బా అని చూస్తున్నాను కళ్ళజోడు మర్చిపోయినందుకు నన్ను నేను తిట్టుకుంటూ.


వెంఠనే ఆవిడ" ఏంటలా కళ్ళు చికిలించి చూస్తున్నారూ" అంది. "అదికాదూ, కళ్ళజోడు మర్చిపోయానని చెబుతున్న నా మాట వినిపించుకోకుండా,  "మీరు షుగర్ పేషెంట్ కూడా కదా వెంటనే ఆప్తాల్మజిష్ట్ దగ్గరకు వెళ్ళండి." అని సిస్టర్ అని కేకేసి వీరిని ఆప్తాల్మజిస్ట్ దగ్గరికి తీసుకు వెళ్ళమని చెప్పింది.


"కానీ, చేసిందేముంది, ఇంకో ఐదొందలు అంతేగా" అంది వెటకారంగా పంకజం. చాంబర్ లోకి అడుగు పెడుతూనే, "జెండాపై కపిరాజు .....ముందు శ్రితవాజిశ్రేణియున్ గూర్చి ....నే దండంబున్ గోనితోలు ...శ్చందనము మీద ...నా ....ఆ .....ఆ ....ఆ... ఆ ..రి . సా ...ఆ రించి ఫల్గుణుడు మూకన్ చెండుచున్నప్పుడు, ఒక్కండును ....ఒక్ఖండును నీమొరాలకింపడు కురుక్ష్మానాధ ...సంధింపగన్ ....ఆ...ఆ...ఆ...ఆ... "


కాసేపు హాస్పటల్ లోనే ఉన్నామా ...నాటకం స్టేజి వెనగ్గా ఉన్నామా?  అన్న అనుమానం వచ్చింది.  డాక్టర్ మమ్మల్ని చూసి కాస్త సిగ్గుపడి "ఎప్పటించో పద్యాలు నేర్చుకోవాలన్న కోరికండీ, కరోనా మూలంగా ఆ కోరిక తీరుతోంది" అన్నాడు. 


ఆ తర్వాత అలాగే ఖుషీగా పద్యాలు హం చేస్తూ కళ్ళు పరీక్షించి భేషుగ్గా ఉన్నాయని సర్టిఫై చేసాడు.  ఏవో ఐ డ్రాప్స్ రాసిచ్చాడు.  చివరగా నీరసంగా కనబడుతున్నారు జనరల్ ఫిజీషియన్ ని కలవమని అక్కడికి పంపించాడు.  ఇది ఆకలేసిన నీరసమని చెబుదామన్నా ఎలాగూ వినిపించుకోరు గనుక, నీరసంగా జనరల్ ఫిజీషియన్ ని కలిసాను. 


పాపం, డెబ్భై యేళ్ళ పెద్దాయన ఒక్కడే కూచుని చైనీస్ చెక్కర్ ఆడుకుంటున్నాడు.  ఆయనే నీరసంగా ఉన్నాడనిపించింది నాకు.  "ఆయన మాత్రం ఏం లేదమ్మా అంతా బాగానేఉంది రోజూ పండ్లూ కూరలూ బాగా తినమని రెండు టానిక్కులూ, రెండురకాల టాబ్లెట్లూ రాసాడు. 


కిందికి దిగి వస్తుంటే పంకజం కోపంగా" వీళ్ళంతా ఒకచోట చేరి పరస్పర ఆధారితం గానూ, పరస్పర పోషకులు గానూ ఉన్నారని నా అనుమానం అంది.  "తప్పు అలా అనకూడదు మనగురించేగా, అన్నాను. 


"మరింకేం!  మందులు కూడా కొందాం పద వాళ్ళు మాత్రం బతకొద్దూ" అంది పంకజం. కింద మందుల షాప్ ముందు ఎప్పుడూ చాంతాడంత  క్యూ ఉండేది.  చక చకా టిల్లర్ మెషిన్లో డబ్బులు లెక్కేసుకునే వాళ్ళు ఇప్పుడు ఉబుసుపోక జాగ్రత్తగా అంతవరకూ వచ్చిన డబ్బులన్నింటినీ ముందేసుకుని  "పదిహేను వందల నలభై ఐదు" అని లెక్కపెడుతున్నాడతను. వాళ్ళావిడ అక్కడే దేవుళ్ళ ఫొటోల దగ్గర అగరొత్తులు వెలిగించి కరోనా మహా మృత్యుంజయ మంత్రం నూటెనిమిది సార్లనుకుంటా, చదువుతోంది. 


అందరి డాక్టర్ల ప్రిస్కిప్షన్లూ ఇచ్చాను.  అదిచూస్తూ మందులు వెదుకుతున్నాడు అతను.  ముక్కు నలుపుకుంటూ,నాకీ సాంబ్రాణి కడ్డీల వాసన పడదు అంటున్నాను పంకజం తో,  ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు.  భీకర మేఘ గర్జనలాంటి తుమ్మొకటి వందమైళ్ళ స్పీడుతో వచ్చింది.  అసలే జనం లేకుండా ఉన్న బిల్డింగేమో, అంతకంటే భయంకరంగా ప్రతిధ్వనించింది!


భూకంపమేదో వచ్చినట్లు అదిరిపడి అందరూ బల్లలకిందా కుర్చీలకిందా దాక్కున్నారు!  రిసెప్షన్లో పిల్ల తేరుకొని కరోనా, కరోనా కాల్ వన్నాట్ ఎయిట్ అని అరుస్తొంది. 


"హమ్మో! ఇంకేముందీ ఐసొలేషన్ పదిహేనురోజులు క్వారంటైన్" అని భయంతో నేనూ సంధించి విడిచిన బాణంలా ఒకటే పరుగందుకున్నా వెనకనించీ పంకజం అరుస్తున్నా వినిపించుకోకుండా.


మూడువీధులు దాటి నాలుగో వీధిలోకి వచ్చిపడ్డా, హమ్మయ్యా ఇల్లు దగ్గరి కొచ్చింది.  ఆయాస పడుతూ కాస్త నిలబడ్డాను.  పంకజం వెనకేవొచ్చి అలా ఎలా పరుగెత్తావ్?  మరీ ఒలింపిక్ పోటీలకేమన్న వెళుతున్నావా ...అసలే కాలునొప్పి కదా !అంది. 


కాలు నెప్పి! అవును నాకు కాలునెప్పికదా, అయినా భయంతో ఇంతదూరం ఎలాపరుగెత్తానూ?


It’s gone!  గాయబ్!

పోయిపోచ్చీ ....

పోయిందే .....


*పద్మజ కుందుర్తి.*

కామెంట్‌లు లేవు: