11, మే 2021, మంగళవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*మంత్రోపదేశం..మొగలిచెర్ల ప్రయాణం..*


*(ఇరవై నాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు తన దండ కమండలాలు చేతబూని..శ్రీధరరావు దంపతులకంటే ముందుగానే..పార్వతీదేవి మఠం ముందున్న మెట్ల వైపు అడుగులేసి మెట్లు దిగసాగారు..చేసేదేమీ లేక, శ్రీ స్వామివారితో ఇక ఆ క్షణంలో ఏమి చెప్పినా వృధా అని ఉద్దేశ్యంతో దంపతులిద్దరూ ఆయన వెనకాలే అనుసరించారు..మెట్లు దిగుతున్న ప్రభావతి గారు ఒక్కక్షణం ఆగి, శ్రీధరరావు గారిని కూడా ఆగమని చెప్పి..కొండమీద కొలువైవున్న శ్రీ లక్ష్మీ నృసింహుడిని మనసారా ధ్యానిస్తూ.."స్వామీ!..ఏ మలుపులు త్రిప్పుతావో ఇక నీ ఇష్టం..మేము నిమిత్తమాత్రులం.." అని చెప్పుకొని క్రిందకు దిగివచ్చారు..


ఆసరికే శ్రీ స్వామివారు దగ్గరలో ఉన్న ఒక చెట్టుక్రింద, తన జింక చర్మాన్ని పరచుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..శ్రీధరరావు గారిని, ప్రభావతి గారిని తనవద్దకు రమ్మని పిలిచారు..ఇద్దరూ వచ్చి శ్రీ స్వామివారి ముందు కూర్చున్నారు..


"అమ్మా!..మీ ఇద్దరికీ చాలా సందేహాలు మనసులో ఉన్నాయి..మీ సందేహాలన్నీ ఈ వ్యావహారిక లోకానికి సంబంధించినవి..నా ఆలోచనలు మీ ఊహకు కూడా అందనివి..ఏది ఎప్పుడు ఎలా జరిగిపోవాలో..అది అప్పుడు జరిగి తీరాలి..అది సృష్టి నియమం!..ఇక జల పడదు..ఇక్కడ త్రవ్వించిన బావి దండగ అని మీరు అనుకున్న బావిలో పుష్కలంగా నీరు రాలేదా?..అలాగే మందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అని మీరు ఆలోచించనవసరం లేదు..

"బాలోన్మత్త పిశాచ వేషాయ!.." అన్నట్లు గా అవధూతల చేతలు మాటలు మీకు అర్ధం కావు..అంతుబట్టవు కూడా..దేనిగురించి మీరు విచారపడకండి..నేను ఇప్పుడు మీతో ఇలా హఠాత్తుగా వస్తున్నానంటే..దానికి గల కారణం దానికి నిర్దేశించివుంటుంది..ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన కార్యం తోడై ఉంటుంది.." అని ఒక్కనిమిషం పాటు కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలోకి వెళ్లారు..


అనంతరం..అత్యంత వాత్సల్యపూరిత చూపుతో.."అమ్మా..శ్రీ వైష్ణవం నీ పద్దతి!..ఇప్పుడు..ఈ క్షణం లో నీకు ఈ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి పాదాల చెంత.."తిరుమంత్రం" ఉపదేశిస్తాను..మీ ఇంటికి చేరిన తరువాత..సాంగోపాంగంగా మంత్రం, మంత్రార్థం, జపవిధానం బోధిస్తాను..సావధానంగా విను!.." అన్నారు..


పద్మాసనం లో ఉన్న స్వామివారు..ఒక్కసారిగా ధ్యాన సమాధి స్థితి కి వెళ్లారు..చుట్టూ వున్న ప్రకృతి కూడా చడీ చప్పుడూ లేకుండా పది నిమిషాలపాటు నిశ్శబ్దంగా మారిపోయింది..శ్రీ స్వామివారు కళ్ళుతెరచి..మంత్రాన్ని పలుకమని ప్రభావతి గారిని ఆదేశించారు..శ్రీధరరావు గారికి ఆ నిమిషంలో శ్రీ స్వామివారిలో సాక్షాత్తూ దక్షిణామూర్తి రూపం గోచరించింది..ప్రభావతి గారైతే..పూర్తిగా మంత్రం పలకడం లో లీనమై పోయారు..శ్రీ స్వామివారు ఎన్నిమార్లు మంత్రాన్ని ఆవిడ చేత పలికించారో.. ఈవిడ ఎన్ని సార్లు ఉచ్చరించారో ..సమయం ఎంతసేపు గడిచిందో..ఏమీ గుర్తురాలేదు..నిజానికి శ్రీధరరావు గారికి మంత్రోపదేశం చేయలేదు..కానీ ఆయన కూడా అదో విధమైన అనుభూతికి లోనై..పరిసరాలు మర్చిపోయారు..


శ్రీ స్వామివారి మంత్రోపదేశం పూర్తయ్యేసరికి..సాయంత్రం పొద్దు కూకుతోంది..బండితోలే మనిషి.."అయ్యా!..అడివి దారి..చీకటి పడితే కష్టం.." అంటున్నాడు..దంపతులిద్దరూ ఇంకా ఆ దివ్యానుభూతి నుంచి తేరుకోలేదు.. శ్రీ స్వామివారే ముందుగా లేచి.."ఇక పదండి!.." అన్నారు..


శ్రీ స్వామివారితో కలిసి బండిలో కూర్చున్న శ్రీధరరావు గారు ప్రభావతి గార్లు మౌనంగా వున్నారు..వారి హృదయాలలో ఇంతకుముందు శ్రీ స్వామివారు బోధించిన మంత్రమే సుడులు తిరుగుతున్నది.. శ్రీ స్వామివారు ఆ గతుకుల దారిలో..బండి కుదుపుల లోనే..ధ్యానం లోకి వెళ్లిపోయారు..మళ్లీ అత్యంత దివ్య సుగంధ పరిమళం బండిలో వ్యాపించిపోయింది..దాదాపు రెండు గంటల బండి ప్రయాణం దివ్యమైన అనుభూతితో గడచినట్లుగా ఆ దంపతులకు తోచింది..కొద్దిగా చీకటి పడే వేళకు..మొగలిచెర్ల కు చేరారు..


ఇంటికి రాగానే..శ్రీ స్వామివారు ఇంతకు ముందు బస చేసిన గది లోనే..వసతి ఏర్పాటు చేశారు..ఒక చెక్క మంచము అందులో వేశారు..దానిమీద శ్రీ స్వామివారు, తాను తెచ్చుకున్న ధావళి పరచుకొని..ఆ ధావళి మీద జింక చర్మం పరచుకొని, తన ధ్యానానికి అనువుగా చేసుకున్నారు..ఒక గ్లాసు పాలు మాత్రం ఆహారంగా తీసుకొని గది తలుపులు వేసుకున్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు..భవిష్యత్ కార్యాచరణను పూర్తిగా శ్రీ లక్ష్మీ నృసింహుడి మీదే భారం మోపారు!..


శ్రీ స్వామివారి ధ్యానం..ఊరి ప్రజల వ్యాఖ్యలు..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 &  99089 73699).

కామెంట్‌లు లేవు: