15, డిసెంబర్ 2021, బుధవారం

సేవా భాగ్యం

 ఇది రామానుజులవారి వృద్ధాప్యంలో జరిగినదంటారు.ఒకరోజు ఒక వృద్ధుడు వచ్చి వారిని ."స్వామీ! మీ సేవా భాగ్యం కలుగ జేయండి" అంటూ ప్రార్థిస్తాడు.


రామానుజులు విని నవ్వుతూ అంటారు...

అయ్యా! నేనే నేడో రేపో అని పరమాత్మ పిలుపుకు ఎదురు చూస్తున్న వాణ్ణి. నాకు ఎలాంటి సేవ అవసరం లేదు. శిష్యులు అంతకన్నా అవసరం లేదు. దయచేసి ఇంకెవరినన్నా ఆశ్రయించండి.


వృద్ధుడు ఒప్పుకోడు. జగద్గురువులైన దేవరవారు కాదంటే నాకింకో దిక్కులేదని ప్రార్థిస్తాడు. చివరికి రామానుజుల వారికి ఒప్పుకోక తప్ప లేదు.


వృద్ధుడికి ఇలా చెబుతారు...

అయ్యా! తమరు అంతగా అంటున్నారు కదా! ఐతే నాకు ఒక ఉపకారం చేయండి. నేను రోజూ ఉదయం కావేరిలో స్నానం చేసి, సంధ్యాదులు పూర్తి చేసుకున్న తరువాత, ఒక భాగవతోత్తమునికి పాదప్రక్షాళనం చేసి ఆనీటిని తలపై చల్లుకొని పునీతుణ్ణి కావాలని చాలాకాలంగా కోరికగా ఉంది. శ్రీరంగంలో ఎవరు కూడా నా ఈ కోరిక తీర్చడానికి సిద్ధంగా లేరు. దయచేసి దేవరవారు ప్రతిదినం ఉదయం కావేరి తీరానికి వేంచేసి నాకీ సేవ అందించండి.


వృద్ధుడు సంతోషంగా అంగీకరిస్తాడు.అప్పటినుండి ప్రతిరోజూ ఉదయాన్నే ఆ వృద్ధుడు కావేరీతీరం చేరడం, స్వామి వచ్చి ఉదయం స్నానాదులు ముగించుకునే వరకు వేచి ఉండడం, తరువాత స్వామి ఆ వృద్ధునికి పాద ప్రక్షాళన చేసి పాదోదకం తలజల్లుకోవడం వారికి నిత్యకృత్యమయింది.


దీన్ని చూసి ఆ వృద్ధుణ్ణి దూషించని వాడు శ్రీరంగంలో లేడు. సహజంగానే లోకులందరికీ ఆచార్యలపట్ల అసహ్య అపరాధంగా తోచింది.ఆ వృద్ధుణ్ణి వెలివేసారు.


అయినా ఆ వృద్ధుడు పట్డించుకోలేదు. రామానుజులూ పట్టించుకోలేదు. నిత్యకృత్యం నిరాటంకంగా సాగిపోతుంది.


ఒకరోజు రామానుజుల వారికి అనారోగ్యం చేసింది. దానికి తోడు కుండపోతగా వర్షం. స్వామి నిత్యవిధులన్నీ మఠంలోనే చేయక తప్పలేదు. రెండు రోజులలా గడిచాయి. రామానుజుల ఆరోగ్యం కుదుట పడలేదు. వర్షం ఆగలేదు.


మూడోరోజు ఉదయం, వృద్ధ బ్రాహ్మణుడి భార్య రోదిస్తూ ఆ కుంభవృష్డిలో రామానుజుల వద్దకు వచ్చి చెబుతుంది...


స్వామీ! మూడు రోజుల క్రింద ఉదయం యథా ప్రకారం దేవరవారి వద్దకు నా భర్త బయలుదేరాడు. ఇప్పటిదాక ఇంటికి చేరలేదు. దేవరవారికి   వారి ఆచూకి తెలుస్తుందని వచ్చాను.స్వామికి నోట మాట రాలేదు.


అనారోగ్యం మరిచి పోయాడు. దండమెక్కడో. పవిత్ర మెక్కెడో. ఒక్క ఉదుటున కావేరివైపు పరుగు! స్వామి వెనుక శిష్యులు! ఆ వెనుక శ్రీరంగ వాసులందరూ! వారిని చూసి రంగడూ బయలుదేరి ఉండొచ్చు! 


పరుగెత్తి వచ్చిన స్వామికి కావేరి ఒడ్డున, వర్షంలో తడిసి, ఆకలి దప్పులు లెక్కజేయక, జ్వరంతో వణుకుతూ  యథాస్థానంలో నిలబడి ఉన్న వృద్ధుడు కనిపించాడు. 


స్వామీ! వేంచేయండి. దేవరవారిసేవా భాగ్యం కృపచేయండి.* అంటూ తీవ్రంగా వణుకుతున్న తన కాళ్ళు ముందుకు చాచాడు.


అహోభాగ్యమ్! భాగ్యమంటే ఆ శిష్యనిదే!!

అహోభాగ్యమ్! భాగ్యమంటే ఆ ఆచార్యులదే!!

అహోభాగ్యమ్! భాగ్యమంటే ఆ సంఘటన కనులారా సేవించిన రంగపుర వాసులదే!!


పరమ విరాగి యైన రామానుజుల కన్నులు గంగోత్రులైనాయి. దూషించిన జనుల హృదయాలు కరిగి సెలయేర్లయినాయి.

శ్రీ రంగనాథుడు స్థాణువైనాడు.


ఇదండీ చరమపర్వ నిష్ఠ!

శేషత్వమంటే ఇది. అది భగవత్ శేషత్వం కానీ, ఆచార్య శేషత్వంకానీ, భాగవత శేషత్వం కానీ. శేషత్వమంటే ఇది!


ఆచార్యులు తనను యథేచ్చగా వినియోగించుకొనే విధంగా స్వరూపముండడము. పాపపుణ్యములతో సంబంధము లేదు.


అపరాధ నిరపరాధములు లేవు. అసలు మనకంటూ అభిప్రాయమే అవసరం లేదు. ఆచార్యులకు చేతిలో ఒక ఉపకరణం కావడం అదే భాగ్యం కదా.....

కామెంట్‌లు లేవు: