*మనమంతా ధృతరాష్ట్రులమేనా.....❓*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💫 *వ్యాస మహర్షి ఏ ఉద్దేశ్యంతో భగవద్గీత ప్రారంభంలోనే ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చి ఉండాలి? మనకు ఇస్తున్న సూచన ఏమిటి?*
💫 *వ్యాఖ్యానం :*
సూక్ష్మంగా ధృతరాష్ట్రుని ప్రశ్నతో భగవద్గీత ప్రారంభమవుతున్నది.
*ధృతరాష్ట్ర ఉవాచ*:
*శ్లో* ॥
*ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |*
*మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ! || (1)*
*వ్యాఖ్య* :
*'ధృతరాష్ట్ర ఉవాచ'* :
💫 *శుభమా అని గీతాధ్యయనం ప్రారంభిస్తూ, దుష్టుడైన గ్రుడ్డిరాజు ధృతరాష్ట్రుని తలచుకోవటమా? ఇదేమిటి? ఎందుకిలా జరిగింది? మహామేధావి, మహాజ్ఞాని ఐన వ్యాసుడు ఎందుకిలా ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చాడు ప్రారంభంలోనే? ఏమిటి ఇందులోని ఆంతర్యం?*
💫 *వ్యాసమహర్షి ఎంతో నేర్పుతో, కావాలనే ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చి ఉండాలి. దీనిలో ఎంతో లోతైన భావం ఉంది.*
💫 *అసలు ధృతరాష్ట్రునికి ఆ పేరు పెట్టినవాడు వ్యాసమహర్షే.*
💫 *ఒక్క ధృతరాష్ట్రునికే గాదు, మహాభారతంలో చాలామందికి నామకరణం చేసింది ఆయనే. నామకరణం చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. పేరు వినగానే వాడి గుణగణాలు, బుద్ధులు అన్నీ తెలిసిపోతాయి.*
💫 *మనమూ పెడుతుంటాం పేర్లు బాలసారె రోజున. 'సత్యనారాయణ' అని పెడతాం. వాడు చచ్చినా నిజం చెప్పడు. 'ఆనందరావు' అంటాం. ఎప్పుడూ ఆముదం త్రాగిన ముఖం పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. 'సుందరమ్మ' అని పెడతాం పేరు. పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. 'అన్నపూర్ణ' అంటాం. ఎంగిలిచేత్తో కాకిని తోలదు, పిల్లికి బిచ్చం పెట్టదు. 'శాంతాదేవి' అని పెడతాం. ఎప్పుడూ అశాంతే. సన్యాసం పుచ్చుకున్న తర్వాత 'స్వామి ఆత్మానంద' అని పేరు పెట్టుకుంటారు. ఆత్మానందం మాట దేవుడెరుగు, ఎప్పుడూ చిటపటలే, నిప్పుమీది మిరపకాయలే.*
💫 *కాని, వ్యాసుడు చేసే నామకరణం అలా ఉండదు. చక్కగా అతికినట్టు సరిపోతుంది.*
💫 *'ధృతరాష్ట్రుడు' అంటే తనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నవాడు అని. నిజంగా ధృతరాష్ట్రుడు చేసింది అదే. చేతికి చిక్కింది గదా అని పాండవుల రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నాడు. ఆఖరుకు శ్రీకృష్ణుడే వచ్చి చెప్పినా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నాడు.*
💫 *ఈ ధృతరాష్ట్రునికి గీతను బోధించినవాడు సంజయుడు. 'సంజయుడు' అంటే, 'సమ్యక్ జయం' పొందినవాడు. అంటే ఇంద్రియాలను చక్కగా జయించినవాడు అని. అట్టివాడు గనుకనే వ్యాసులవారి అనుగ్రహంతో దివ్యనేత్రాన్ని పొంది శ్రీకృష్ణుని గీతాబోధను సాక్షాత్తుగా విన్నాడు. ఆయన విశ్వరూపాన్ని దివ్యనేత్రంతో తిలకించి పులకించిపోయాడు.*
💫 *అట్టి సంజయుని ద్వారా గీతా బోధను విన్నా, ధృతరాష్ట్రునికి ఏమీ ప్రయోజనం కలగలేదు. కాని అర్జునునికి మాత్రం గీతా బోధతో మోహం తొలగింది, స్మృతి కలిగింది. ఇద్దరూ విన్నది ఒకే విషయం.*
💫 అయినా ఎందుకీ తేడా? *అర్హతలోనే తేడా. కనుక ధృతరాష్ట్రుని లాగా వినవద్దు - విన్నా ప్రయోజనం ఉండదు అని చెప్పటమే ధృతరాష్ట్ర ప్రసక్తిలోని ఆంతర్యం.*
💫 అంతేకాదు, *మనందరం ధృతరాష్ట్రులమే. కనుకనే ఈ హెచ్చరిక. ఎలా? తనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నవాడు గదా ధృతరాష్ట్రుడు అంటే - మరి మనం చేస్తున్నదేమిటి? ఎన్నో హీన జన్మలెత్తిన తర్వాత, ఆ జన్మలన్నీ వ్యర్థం గనుక, మోక్షాన్ని పొందటానికి తగిన మానవజన్మను ఇవ్వమని భగవంతుని ప్రార్థించి, ఈ జన్మను తెచ్చుకున్నాం. ఈ శరీరమనే రాజ్యానికి ప్రభువయ్యాం. అంతే. ఇక భగవంతుని మరచిపోయి, మనం ఎందుకు ఈ దేహాన్ని తెచ్చుకున్నామో మరచిపోయి, ఇది ఒక అద్దె కొంప లాంటిదని, జాగ్రత్తగా వాడుకుంటూ, సమయం రాగానే ఆయన ఇచ్చినదాన్ని ఆయనకు అప్పగించి వెళ్ళాలనే జ్ఞానం లేకుండా, ఇది నాదేనని, అసలు నేనేనని గట్టిగా పట్టుకు కూర్చున్నాం. శాస్త్రాలు, పెద్దలు "ఈ దేహాత్మ బుద్ధి' ని వదలరా బాబూ, నీవు దేహానివి కాదు, నీవు ఆత్మవు; ఈ దేహాన్ని నీవు వాడుకోవటానికి భగవంతుడిచ్చిన పరికరం మాత్రమే" అని ఎంత చెప్పినా వినిపించుకోం.*
💫 *సంపాదించుకోవటం, తినటం, తిరగటం, దాచుకోవటం, దోచుకోవటం - ఇదే మన పవిత్ర కర్తవ్యం అనుకుంటూ, వ్యర్థమైన పనులకు మాత్రమే దీనిని వినియోగించుకుంటున్నాం. ఒకవేళ భగవంతుడు 'నేనిచ్చిన దేహాన్ని నాకివ్వమని' బలవంతంగా లాగివేస్తే తిరిగి మళ్ళీ మళ్ళీ ఈ దేహాలను తెచ్చుకొనేందుకు వీలుగా కర్మలు చేస్తూ, జన్మ కర్మ వలయంలో పడిపోయి, తిరిగి తిరిగి ఈ దేహాలను తెచ్చుకుంటున్నాం. మరి ఇలా గట్టిగా ఈ దేహమనే రాజ్యాన్ని పట్టుక కూర్చున్న మనం ధృతరాష్ట్రులం కాదా?*
💫 *అందుకే ఓ ధృతరాష్ట్రులారా! మీరు కూడా ఆ ధృతరాష్ట్రుని లాగానే ఈ అద్భుత జ్ఞానాన్ని వింటే, ఆయనకెలాగైతే విన్న జ్ఞానం వంటబట్టక వృథా అయిందో, మీకూ అంతే. కనుక అర్జునునిలాగా మారి వినండి. భగవంతుని చేరుకోవాలనే తపనతో; నావాళ్ళు, నా రాజ్యం అంటూ మమకారం పెట్టుకోకుండా; మనస్సును నిర్మలం చేసుకొని, బుద్ధిని సూక్ష్మం చేసుకొని వినండి అని చెప్పటానికే 'ధృతరాష్ట్ర ఉవాచ' అని గ్రుడ్డిరాజును గుర్తు చేయటం.*
*సేకరణ:* ఆధ్యాత్మిక భక్తిప్రపంచం
🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి