16, డిసెంబర్ 2022, శుక్రవారం

పాపయ్యశాస్త్రిగారు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

వెనకటికి బులుసు పాపయ్యశాస్త్రిగారని గొప్ప వేద విద్వాంసులు ఉండేవారు. ఆయన విద్వత్తును మెచ్చి పిఠాపురం రాజావారు గంగాధర రామరాయణింగారో సందర్భంలో ‘‘అయ్యా! మన ఇలాకాలో మీకు ఎక్కడ ఎంత భూమి కావాలో కోరుకోండి... దానపట్టా రాసిస్తాం’’ అన్నారు.


 వెంటనే పాపయ్యశాస్త్రి గారొక ఆశీర్వచనం చేసి, నెలకో పుట్టి భూమి చొప్పున ఇప్పించమని కోరారట.  పుట్టి అంటే సుమారు ఎనిమిదెకరాల లెక్క. నెలకు ఎనిమిది ఎకరాల వంతున పన్నెండు నెలలకు పన్నెండెనిమిదులు తొంభైయ్యారు ఎకరాల భూమిని రాజావారు రాసిచ్చేశారు.  పాపయ్య శాస్త్రిగారే చక్రం తిప్పారో, లేక వేదపండితుడికిచ్చే దానం కదా అనుకుని ఠాణేదారే కావాలని కొలిపించాడోగాని, గోదావరి లంక భూమి పన్నెండుకు బదులు పద్దెనిమిది పుట్లు శాస్త్రిగారికి దఖలు పడింది.  ఈ సంగతి కొన్నాళ్లకి రాజుగారి చెవిని పడింది. ఠాణేదారుని పిలిపించి, కూకలేసి, ఉద్యోగంలోంచి పీకేశారు.


      పాపాయ్యశాస్త్రిగారికి ఈ విషయం చేరింది. ఆయన నేరుగా రాజుగారి దగ్గరకొచ్చి తనకు దానం చేసిన భూమిని తిరిగి తీసేసుకోమని కోరారు.  అది రాజుగారికి పెద్ద తలవంపుల వ్యవహారం కనుక శాస్త్రి గారికి నచ్చచెప్పబోయారు.  తనెంత చెబితే అంత చెయ్యాలి.  ఏం చెబితే అదే చెయ్యాలి!  తప్ప ఇలాంటి సొంత పెత్తనాలు గుమాస్తాలకు తగునా?  అన్నది రాజావారి వాదన!  ఠాణేదారు ఉద్యోగ ధర్మాన్ని అతిక్రమించేడంటాడు రాజు. లేదంటారు శాస్త్రిగారు!


      ‘‘తమరు ఈ భూమిని ఎందుకు ఇప్పించారు?’’

      ‘‘మీరు మహాపండితులు, మీకిస్తే మేం తరిస్తాం కనుక!’’

      ‘‘మేం ఎందులో పండితులం?

      ‘‘వేదశాస్త్రాలన్నింటా మీరు మహాపండితులే’’

      ‘‘వేదశాస్త్రాలనగా ఏ భాష?

      ‘‘గీర్వాణ భాష’’

      ‘‘గీర్వాణులంటే దేవతలు! దేవతలు దేవమానంలో కాక, మనుషుల కొలతల్లో ఎలా కొలిపించుకుంటారు? కాబట్టి ఠాణేదారు లెక్క సరైనదే! గజానికి గజంన్నర చొప్పున సరిపెట్టాడు!’’ అని తేల్చారు శాస్త్రిగారు.


      ఇంకేం అంటాడు రాజుగారు? శాస్త్రిగారు ఇటు భూమీ దక్కించుకున్నారు, అటు ఠాణేదారు ఉద్యోగమూ నిలబెట్టారు. అదీ లౌకిక ప్రజ్ఞ అంటే! లౌక్యుడు కాబట్టే ఠాణేదారును రక్షించగలిగాడాయన. 


శ్రీ ఎల్లాప్రగడ రామకృష్ణ     

రచనలో భాగం.

కామెంట్‌లు లేవు: