24, జూన్ 2023, శనివారం

⚜ శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయం

 🕉 మన గుడి : 





⚜ కడప జిల్లా : కన్యతీర్థం


⚜ శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయం


💠 స్వర్గలోకంలో ఉన్న పెళ్లి కాని కన్యలని దేవకన్యలు అని అంటారు.. 

అయితే దేవకన్యలు భూలోకానికి వచ్చి దర్శించుకునేంత ప్రత్యేకమైన దేవాలయం ఎక్కడ ఉంది..? 


💠 పచ్చటి చెట్ల మధ్య.. ప్రశాంతమైన వాతావరణంలో.. మనసుకు హాయి కలిగించేలా ఉన్న పరిసరాలలో.. అమ్మ త్రిపురసుందరీదేవిని ప్రతిరోజు స్వర్గం నుంచి దిగి వచ్చి దేవకన్యలు దర్శించుకుంటారని అంటారు.. 

5,000 సంవత్సరాల కిందట ఈ ఆలయంలో త్రిపురసుందరీ దేవి స్వయంభువుగా వెలసింది. 

ముఖ్యంగా కన్యలకు ఈ దేవాలయం అత్యంత పవిత్రతను సంతరించుకుంది. 


💠 కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర దండ్లూరి పొలిమేరలో పినాకిని నది ఒడ్డున , భాను కొండల మధ్య అత్యంత సుందరంగా అమ్మవారి క్షేత్రం మనకు కనిపిస్తుంది.

అన్ని దేవాలయాల్లో అమ్మవారికి పీఠం ఉండగా,ఈ అమ్మవారికి ఎక్కడ కూడా పీఠం కనిపించదు. అంతే కాదు అమ్మవారి విగ్రహం భూమి లోపల ఎంతవరకు ఉందో కూడా తెలియదు.. ఇక దేవకన్యలు ఇక్కడికి వచ్చి పుష్కరిణిలో స్నానమాచరించి, త్రిపురసుందరీదేవిని దర్శించుకుంటారు. అందుకే ఈ గుడికి కన్యతీర్థం అని పేరు కూడా వచ్చింది అని స్థలపురాణం చెబుతోంది.


💠 ఇచ్చట ప్రధాన దైవం "శ్రీ త్రిపుర సుందరీదేవి". కొంత మంది శ్రీ విజయ దుర్గా మాతగా కొలుస్తారు

మాత వెలసి ఇప్పటికి సుమారు 5 వేలు సంవత్సరాలకు పైగా అయినట్లు గుడిలోని శాసనాల ద్వారా తెలుస్తున్నది.


⚜ స్థల పురాణం ⚜


💠 ఈ గుడి సమీపంలోనే అగస్త్యాశ్రమం ఉన్నది. వింద్య పర్వతాల మదమణచడానికి వచ్చిన అగస్త్య మహాముని చాలా కాలం జమ్మలమడుగు మండలంలోని చారిత్రక ప్రాంతం అయిన గండికోటకు ప్రక్కనున్న కోనలో నివాసం ఉన్నట్లు పురాణాలు తెలుపుతున్నాయి. 

అందువల్ల ఆ కోనకు అగస్త్యేశ్వర కోన అనే పేరు వచ్చింది. అగస్త్యుడు ప్రతి రోజూ గండికోట నుండి కన్నెతీర్థం వచ్చి దుర్గామాతను కొలిచివేళ్లే వాడని ప్రతీతి.


💠 క్షేత్రంలో నేటికి శ్రీ అగస్త్య ఆశ్రమం వుంది. దేవతలు, మహాపురుషులు, సిద్ద పురుషులు, మునులు అమ్మవారిని సేవించుకున్నారు. అలాగే క్రీ.పూ ఆచార్య సిద్ధ నాగార్జునుడు, మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్తుడు, 

అశోక చక్రవర్తి అమ్మవారిని దర్శించుకొని సేవించుకున్నట్లు తెలుస్తోంది. 

అలాగే 2 నుండి 7వ శతాబ్దం కాలంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు, శాతవాహనులు, చోళులు, హర్షవర్ధనుడు శ్రీ త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి.

తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన ఆంధ్రభోజుడుగా పేరొందిన శ్రీ కృష్ణదేవరాయులు క్షేత్రంను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. 

ఆ తరువాతి కాలంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, కాలజ్ఞాన బ్రహ్మ పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అమ్మవారిని సేవించినట్లు తెలుస్తోంది.


💠 క్షేత్రం మహిమలు గురించి పరాశర మహాముని రాసిన స్కంద పురాణంలోనూ, జైమిని భారతంలోనూ, శ్రీశైల పురాణంలోనూ గొప్పగా వివరించారు. కన్యతీర్థంలోని శ్రీ త్రిపుర సుందరీ దేవి రూపంలో వున్న విజయదుర్గ అమ్మవారి మహిమలు విని జైనులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించుకున్నారు. 

దీనికి తార్కాణంగా జమ్మలమడుగు- ప్రొద్దుటూరు రూటులో నాటి దేవనహళ్లి అయిన నేడు దేవగుడి వద్ద బాహుబలి విగ్రహం వుంది. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ అమ్మవారి గుడి పైభాగాన సిద్ద, బౌద్ధ అస్తికల గూళ్లు చూపరులకు దర్శనమిస్తాయి.


💠 శ్రీ కన్యతీర్థంనకు మరొక ప్రత్యేకత ఉంది. 

ఈ తీర్థం తిరుపతి, శ్రీశైల క్షేత్రాలకు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో అమరి ఉండడం ఒక విశేషం.


💠 ఆలయ ప్రాంగణములో అమ్మవారు ఆలయంతో పాటు శివాలయం, సత్యనారాయణ సన్నిధి, సంజీవ ఆంజనేయ సన్నిధి, నాగ ప్రతిమలు, నవగ్రహ మండపం మొదలగునవి కలవు.  

అన్నదానం జరుగు స్ధలం,యాత్రికుల విశ్రాంతి హాలు, కళ్యాణ మండపం మొదలగు వసతులున్నాయి. 

శివాలయం నందు శ్రీ సుందరేశ్వర స్వామి, 

శ్రీ వర సిద్ధ వినాయక స్వామి, శ్రీ కార్తికేయ స్వామి సన్నిధి కలవు.  


💠 శివాలయం నకు ఎడమ భాగం నందు శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంటుంది. గర్భాలయం నందు సుమారు మూడు అడుగుల ఎత్తు గల ఒక పరాశక్తి ప్రతిమ దర్శనమిస్తుంది. ప్రతి రోజు అర్చనలు జరుగుతాయి.  


💠 ప్రతి పౌర్ణమి నాడు విశేష అర్చనలు ఉంటాయి. అమ్మవారు రాత్రి పూట సంచారము చేస్తారు. 

ఆలయ ప్రాంగణములో భక్తులు అమ్మ కృప కోసం నిద్ర చేస్తారు. భక్తులుకు రెండు పూటల ఉచిత భోజనం దొరుకుతుంది.


💠 ఇక్కడ వారాహి, వైష్ణవి, బ్రాహ్మణి , మహేశ్వరి , కౌమారి, చాముండి, ఇంద్రాణి వంటి 7 మంది దేవతలు ఒకేచోట కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తమాతృక క్షేత్రమని, దేవేంద్రుడు రావడం వల్ల దేవ క్షేత్రమని, అగస్త్యమహర్షి తపస్సు చేయడంవల్ల ఈ క్షేత్రాన్ని అగస్త్య క్షేత్రమని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు.


💠 జమ్మలమడుగు పట్టణం నుంచి కన్యతీర్థం నకు బస్సులు ఉదయం 05:45 & సాయంత్రం 05:30 మాత్రమే ఉంటాయి. జమ్మలమడుగు నుంచి ఆటోలు/టాక్సీలు దొరుకుతాయి.

కామెంట్‌లు లేవు: