24, జూన్ 2023, శనివారం

ఆర్య చాణక్య*♦️ *అధ్యాయము - 16 : పార్ట్ - 100*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*అధ్యాయము - 16 : పార్ట్ - 100*


నేపాళ దేశపు రాజధాని మంజుపట్టణమునకు చేరుకున్నాడు రాక్షసామాత్యుడు. 


దేశపు ప్రభువు పర్వతకుని దుర్మరణంతో శోకగ్రస్తుడైన అతని కుమారుడు మలయకేతుని ఓదార్చి, ధైర్యము చెప్పాడు రాక్షసుడు. 


మలయకేతు కొంత తేరుకొని "ఈ సానుభూతి మాటలతో నా గుండె మంట చల్లారదు. విషకన్య ప్రయోగంతో నా తండ్రిని, ఊరేగింపు మిషతో నా పినతండ్రిని హత్య చేయించిన ఆ చాణక్య చంద్రగుప్తుల మీద పగ తీర్చుకునేంతవరకూ నా తండ్రి, పినతండ్రులకు ఉత్తరక్రియలు కూడా జరపనని శపధం చేశాను. మీరు నా తండ్రికి ఆప్తమిత్రులు చెప్పండి. నా పగతీరుస్తారా ?" అని అడిగాడు ఆవేశంగా. 


"శభాష్ కుమారా ...! నీ పౌరుషానికి తగినట్లు ప్రతిజ్ఞ చేశావు. ఆ చాణక్యుని కుట్ర కారణంగానే మిత్రులైన నందులు పర్వతకుల మధ్య విరోధం వచ్చింది. ఆ కల్పిత వైరానికి వారూ వీరూ బలైపోయారు. మగధ సింహాసనంపై కూర్చోబెట్టడానికి ఒక్కనంద వంశాంకురం కూడా లేకుండా నందవంశీయులందర్నీ నల్లుల్లా నలిపిపారేశాడు ఆ చాణక్యుడు. నేను ఆశ్రయం పొందిన ప్రభువంశ వారసులు లేనప్పుడు ఆ మగధ సింహాసనము ఎవరు అధిష్టిస్తే నాకేం... ? నువ్వే అధిష్టించు.... మీతండ్రికి అర్థరాజ్యం వాగ్దానం చేశాడు ఆ చాణక్యుడు. ఇప్పుడు అర్ధరాజ్యమేం ఖర్మ... పూర్తి రాజ్యాన్నే నీకు కట్టబెడతాను... ఆ చాణక్య చంద్రగుప్తులను తుదముట్టించి..." అని భరోసా ఇచ్చాడు రాక్షసుడు. 


మలయకేతు సంతోషించి, రాక్షసుని శక్తి సామర్థ్యాలు తెలిసిన వాడవడం చేత అతనికి తన మంత్రి మండలిలో అత్యున్నత స్థానమిచ్చి గౌరవించాడు. అయితే మరల ఎప్పటికైనా తాను మగధకే మహామంత్రి కావాలన్న ఆశను బయటపడనీయకుండా మందహాసం చేసి "నాకు పదవులు కాదు ముఖ్యం... శత్రువుల పరాభవం...." అంటూ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించాడు. అయినప్పటికీ మలయకేతు మంత్రిమండలిలో రాక్షసుని మాటే చెల్లుబాటుకాసాగింది. 


క్రమక్రమంగా రాక్షసుడు బలం పుంజుకొని నేపాళ దేశానికి సామంతరాజ్యాలైన, కులూత, మలయా, కాశ్మీర, సింధు, పారశీక, కామరూప తదితర రాజ్యాధిపతులను మంజుపట్టణాడానికి పిలిపించి వారితో సమావేశమై 'మగధ మీద దండెత్తడానికి సంసిద్ధులు కావాలని' హెచ్చరించాడు. ఇంతకు మునుపు జరిగిన యుద్ధంలో పర్వతక-చంద్రగుప్తులకి సహాయంగా వెళ్లి సైనికంగా ఆర్థికంగా నష్టపోయిన సామంత రాజులు తమ సైనికబలాలు పెంచుకోవడానికి కొంత వ్యవధి కావాలని కోరారు. రాక్షసుడు వారికి ఆరుమాసాల కాలవ్యవధి ఇచ్చి పంపించేశాడు. అనంతరం కొద్దిరోజులకే రాక్షసునికి సంతోషాన్ని చేకూర్చే సంఘటన ఒకటి జరిగింది. 


మగధసేనానులలో ప్రముఖుడైన బాగురాయణుడు దేశబహిష్కారమునకు గురై వచ్చి రాక్షసుని ఆశ్రయించాడు. "మేము మీ అభిమానులమని ఆ చాణక్యుడు గ్రహించాడు. అందుకే కల్పిత కారణాల సాకు చూపించి నాకు దేశబహిష్కరణ విధించాడు. మాలాంటి వాళ్ళం పదవుల్లో ఉంటే తన ఆటలు సాగవని ఆ చాణక్యుని భయం. అందుకే నన్ను ఈ వంకన వెళ్లగొట్టించాడు. అప్పుడూ-ఇప్పుడూ, అక్కడా-ఇక్కడా మీరే కదా నాకు దిక్కు..." అంటూ బాగురాయణుడు రాక్షసుని ఆశ్రయించాడు. 


బాగురాయణుడి రాక రాక్షసుడుకి చాలా సంతోషాన్ని కలిగించింది. అక్కడ చాణక్యుడు ఒక్కొక్కర్నీ వెళ్ళగొట్టించి బలహీనుడైతే ఇక్కడ ఒక్కొక్కరి చేరికతో తాను బలవంతుడవడం తథ్యం. ఆ ఆనందంతోటే బాగురాయణుడి తీసుకువెళ్లి మలయకేతుకి పరిచయం చేసి, తన వ్యూహాన్ని అతడికి వివరించి చెప్పి బాగురాయణుడిని సేనానాయకుడిని చేయించాడు రాక్షసామాత్యుడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: