24, జూన్ 2023, శనివారం

సన్యాసి సంకల్పం

 సన్యాసి సంకల్పం


ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్ర దేశంలోని కర్నూలులో చాతుర్మాస్యం చేస్తున్నారు. పరమాచార్య స్వామివారిని సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా భావించే శ్రీ జనార్ధనానంద సరస్వతి అనబడే సన్యాసి ఒకరు ఈ పుణ్యదినాలలో మహాస్వామివారితో గడపాలని నిశ్చయించుకున్నారు. వారు పాదయాత్రగా విజయావాడ నుండి బయలుదేరి వస్తున్నారని మహాస్వామి వారికి కబురందింది.


ఆ విజయవాడ స్వామి పాదయాత్ర మొదలుపెట్టిన రెండు మూడు రోజులకి, పరమాచార్య స్వామివారు మఠంలో పనిచేస్తున్న శ్రీ ఏకాంబరం మరియు శ్రీ మెట్టూర్ రాజులను ఒక కారులో విజయవాడ వెళ్లవలసినదిగా ఆదేశించారు. అలాగే పూజ్యశ్రీ విజయవాడ స్వామివారిని కలిసి వారిని కారులో ఇక్కడికి తీసుకురావలసిందిగా చెప్పారు.


అక్కడున్న భక్తులు ఈ మాటలను విని అయోమయంలో పడ్డారు. సన్యాసులు కారులో తిరగడం మహాస్వామివారు ఎన్నటికి ఒప్పుకోరు. అలా చెయ్యమని ఆదేశించరు కూడా. ఎందుకంటే అది సన్యాస ధర్మానికి విరుద్ధం కనుక.


ఆ విజయవాడ స్వామివారిని ఎలా కలుసుకోవాలో వీరికి తెలియదు. జనార్ధనానంద సరస్వతి స్వామివారు తమ పర్యటనకు ముందుగానే ప్రణాళిక వేసుకోలేదు కనుక వార్తాపత్రికలలో కూడా ఎక్కడా సమాచారము లేదు. వారిద్దరూ గుంటూరు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో వెదకసాగారు. చివరికి వారికి ఆ స్వామివారు శివాపురం అనే ఒక చిన్న గ్రామంలో తారసపడ్డారు.


వచ్చినవారి నోటివెంట పరమాచార్య స్వామివారి ఆదేశాన్ని వినగానే విజయవాడ స్వామివారు అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఆనందంతో, సంభ్రమాశ్చర్యాలతో పరమాచార్య స్వామివారిని సాక్షాత్తు ఆ కైలాస వాసి పరమేశ్వరుడే అని వేనోళ్ళ కొనియాడారు.


మహాస్వామివారిని దర్శించాలనే కోరికతో ఆ ముందురోజు వరకూ కర్నూలు వైపు పాదయాత్ర చేశారు. హటాత్తుగా కాలినరం ముడిపడి ఇబ్బంది పెట్టడంతో శివపురంలో ఆగవవలసి వచ్చింది. చాలా ఆందోళన చెందిన స్వామివారు మహాస్వామి వారిని ఇలా కొనియాడారు. “ఈశ్వరా! కైలాసనాథుడవైన నీకు కనీసం ఒక ముసలి ఎద్దు అయినా వాహనంగా ఉంది. కానీ ఇప్పుడు కంచినాథుడుగా, పరమాచార్యులుగా వచ్చిన నీవు, ఉన్న ఆ ఎద్దును కూడా వదిలిపెట్టి మొత్తం దేశం అంతా పాదచారియై తిరగడానికి నిర్ణయించుకున్నావు”


వారు చికిత్స తీసుకుని పాదయాత్రగానే కర్నూలుకు వెళ్లాలని నిర్ణయించుకుని ఉంటే వారు తడుపారు చాతుర్మాస్యానికే చేరేవారు. విజయవాడ స్వామీ బాధను చూసి మహాస్వామివారే వారికి చేయూతనివ్వదలచి వారిని పిలుచుకుని రావడానికి కారుని పంపారు. వారు సాక్షాత్ శంకరావతారులు కాబట్టే ఇది స్వామివారికి సాధ్యమైందని గ్రహించారు జనార్ధనానంద సరస్వతి స్వామి.


కాలినెప్పితో బాధపడుతున్న స్వామివారు అతికష్టంపై కారు ఎక్కి కూర్చున్నారు. కర్నూలుకు ప్రయాణించి పరమాచార్య స్వామివారి దివ్యసన్నిధికి చేరుకున్నారు. చాతుర్మాస్య సంకల్పంతో పాటు వారి కాలి నరం బాధను కూడా మహాస్వామివారు కరుణతో తొలగించారు.


--- ‘ప్రదోషం మామ గృహం న్యూస్ లెటర్’ నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: