27, జులై 2023, గురువారం

ఇడ్లీలు - బ్రహ్మానుభూతి

 ఇడ్లీలు - బ్రహ్మానుభూతి


తిరుచిరాపల్లి భిక్షందర్ దేవాలయలో ఉండే మా మావయ్య కీర్తిశేషులు శ్రీ సుందరేశ్వర అయ్యర్ ఒకసారి తిరువణ్ణామలై వెళ్లారు. దేవాలయంలో దర్శనం చేసుకుని రమణ మహర్షుల దర్శనం కోసం రమణాశ్రమానికి వెళ్లారు. బహుశా 1940 లేదా 1945 సమయం అప్పుడు అనుకుంటా. భగవాన్ రమణుల గురించి ఎంతో విన్నారు కానీ వారిని మొదటిసారిగా దర్శించుకోబోతున్నారు. భగవానులు అందరితో కలసి ఫలహారము, భోజనం చెయ్యడం చూసి ఆశ్చర్యపోయారు. రమణులు ఇడ్లీలు తినడం చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు.


భగవాన్ రమణులు భక్తులకు దర్శనం ఇవ్వడానికి హాలులోకి రాగానే, మా మావయ్య కూడా అందరితోపాటు కూర్చున్నారు. అప్పుడు మా మావయ్యకి ఒక ఒళ్ళు జలదరించే అద్భుతం జరిగింది. రమణుల కళ్ళు మా మావయ్య కళ్ళతో కలిశాయి. వెంటనే మా మావయ్య శరీరం తేలిక అయ్యింది. చాలా ఆనందం కలిగింది. వెంటనే బాహ్యస్మృతిని కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత భగవాన్ రమణులు చూపు తిప్పుకోవడంతో మరలా స్మృతి కలిగింది. చుట్టూ ఏం జరుగుతోందో తెలియక, బాహ్యస్మృతి కోల్పోయి అలా ఎంతసేపు ఉన్నారో కూడా వారికి అర్థం కాలేదు. ఇదంతా వారికి చాలా గందరగోళంగా ఉంది. ఎవర్నైనా అడిగి తెలుసుకోవాలనుంది - కానీ ఎవరిని అడగాలి? చివరకు పరమాచార్య స్వామివారిని అడిగి నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.


వెంటనే వెళ్ళి మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారు విశ్రాంతిగా ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి, స్వామివారి పాదాలపై పడి తమ తాతగారి పేరు (శ్రీ నారాయణ అయ్యర్), తండ్రిగారి పేరు (శ్రీ గణపతి అయ్యర్), అమ్మగారి పేరు (శ్రీమతి ఈశ్వరి) చెప్పి, వారి మేనమామ గారైన శ్రీ పైంగానాడు పంచపకేశ అయ్యర్ (పరమాచార్య స్వామివారు మహేంద్రమంగళంలో చదువుకుంటున్నప్పుడు, స్వామివారికి ఋగ్వేదం బోధించినవారు) గారి పేరు చెప్పి, చివరగా తమ పేరు చెప్పి నమస్కరించారు. తరువాత వారికి కలిగిన అనుభవాన్ని చెప్పారు.


“ఇటీవలే తిరువణ్ణామలై వెళ్ళాను”


స్వామివారు చురునవ్వుతో, “స్వామీ దర్శనం చేసుకున్నావా?” అని అడిగారు.


మేమందరమూ “స్వామీ” అని కొలుచుకునే దేవుడు, భగవాన్ రమణులను “స్వామీ” అని సంబోధిస్తూ “స్వామీ” దర్శనం చేసుకున్నవా అని మా మావయ్యని అడిగారు!!!


“హా చేసుకున్నాను”


“ఏమి? ‘హా చేసుకున్నాను’ అని అంటున్నావు? ఏం జరిగింది?”

మా మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారని, కానీ చెప్పడం సరియా? కాదా? అని శంసయిస్తున్నారని స్వామివారికి తెలుసు. అందుకనే చెప్పమని స్వామివారు ప్రోత్సహిస్తున్నారు.

మావయ్య : “లేదు... భగవానుల దర్శనం చేసుకున్నాను. దర్శనం బాగా జరిగింది. వారు అందరితో కూర్చుని భోజనం కూడా చేశారు. . .”


స్వామివారు : “అందరితోపాటు తిన్నారు . . .” ఎందుకు దీర్ఘం తీస్తున్నావు? ఎందుకంటే రమణులు ఇడ్లీలు కూడా తిన్నారని కదూ? అందుకేనా?


స్వామివారికి తెలియని విషయం ఏదైనా ఉందా? వారి సందేహాన్ని స్వామివారు గ్రహించారు.


మావయ్య : “అవును. అవును... తిన్నారు... ఇడ్లీలు తిన్నారు...!”


స్వామివారు : “కనుక నీకు అనిపించింది. ‘ఏమిటిది? కంచి మఠంలో స్వామివారు ఇడ్లీలు తినరు, కానీ ఇక్కడ రమణులు ఇడ్లీలను తింటున్నారు’ అవునా?”


మావయ్య : “అవును... స్వామీ”


స్వామివారు చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టారు.


“రమణులు అన్నీ ఆశ్రమ పరిధులను దాటిపోయారు. వారికి మఠము, నియమము, పరిధి లేవు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ మఠానికి సాంప్రదాయాలున్నాయి. నియమాలున్నాయి, హద్దులున్నాయి. మరియు నాకు వాటినాన్నిటిని పాటించి పాలించాలసిన బాధ్యత ఉంది. అందుకే ఇక్కడ ఇడ్లీలు తినరు (తమని చూపుతూ చిరునవ్వుతూ). అర్థమైందా?”


మావయ్య : “హా...” తలూపారు మా మావయ్య.


స్వామివారు : “సరే. అక్కడ ఇంకేం జరిగింది?”


మావయ్య : “మేము సాయంత్రం మహర్షుల దర్శనానికి వెళ్లాము. అప్పుడు నేను రమణుల వైపే తీక్షణంగా చూస్తున్నాను. హఠాత్తుగా వారు నావైపు చూశారు. వారి చూపు నా కళ్ళల్లోకి పడగానే, నాకు ఏదో జరిగింది. నా స్మృతిని కోల్పోయాను. నా శరీరం తేలికైపోయింది. చాలా అద్భుతమైన అనుభవం. అలా ఎంతసేపు ఉండిపోయానో నాకు తెలియలేదు. హఠాత్తుగా నాకు బాహ్యస్మృతి పొందగానే రమణులు వేరేవైపు చూస్తున్నారు...”


స్వామివారు : “అంటే, ఏం జరిగిందో నీకు తెలియదు అంటావు?”


మావయ్య : “అవును”


స్వామివారు : “అంతేకాక, ఎవరికైనా ఆ స్థితి శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటున్నావు, కదూ?”


మావయ్య : “అవును”


స్వామివారు చిన్నగా నవ్వారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత నిదానంగా చెప్పనారంభించారు.


“రమణులు కొద్దిసేపు నీ మనస్సును లేకుండా చేశారు. మనస్సు లేకపోతే, మనస్సు లుప్తమయిపోతే, ఇక ఉండేది ఆనందం మాత్రమే. అటువంటి శాశ్వత ఆనందాన్ని నీకు కాస్త రుచి చూపించారు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి వారి దర్శనం చేసుకో”


మా మావయ్య స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ఊరికి వెళ్ళిపోయారు. తరువాత, ఎన్నోసార్లు భగవాన్ రమణుల దర్శనం చేసుకున్నారు.


ఈ సంఘటనను మా మావయ్య ఎన్నోమార్లు చెబుతూ, ప్రతిసారీ ఆ బ్రహ్మానంద అనుభవాన్ని పొందేవారు.


--- విశి నాథన్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

కామెంట్‌లు లేవు: