27, జులై 2023, గురువారం

కాశీ యాత్ర చేయదలచినవారు

 దక్షిణభారతదేశం నుంచి కాశీ యాత్ర చేయదలచినవారు ఎవరైనా ముందుగా రామేశ్వరం చేరుకోవాలి. రామేశ్వరానికి ఇరవై ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న ధనుష్కొడి కి వెళ్ళాలి. అక్కడ సముద్రస్నానం చేసి కాశీ యాత్రకు సంకల్పం చెప్పుకోవాలి. ఆ సమయంలో ఆసముద్రపు ఇసుకతో నాలుగు శివలింగాలను చేయాలి. సేతు మాధవ, వేణీమాధవ, బిందుమాధవ, రామనాథస్వాములని ఆ లింగములకు పేర్లు పెట్టాలి. వాటికి పూజ చెయ్యాలి. తరువాత వేణీమాధవ సైకతలింగాన్ని ప్రయాగలోని త్రివేణీసంగమం లో నిమజ్జనం చేయటానికి ఒక పెట్టెలో భద్రంగా ఉంచాలి. మిగిలిన మూడు లింగాలను సముద్రంలో కలిపివేయాలి. అక్కడినుంచి రామేశ్వరం చేరుకోవాలి. అక్కడ రామేశ్వరస్వామివారి గుడి ప్రాంగణంలో ఉన్న నూతుల నీళ్ళతో స్నానం చేసి అక్కడ ఉన్న నూతలలోని జలాలను ఒక పాత్రలో భద్రం చేసుకోవాలి.

అక్కడి నుంచి కాశీ యాత్రకు ప్రయాణం ప్రారంభించాలి. కాశీ యాత్ర అంటే ... ముందు ప్రయాగ ...అక్కడి నుంచి కాశీ ...అక్కడి నుంచి గయ వెళ్ళటమన్నమాట.ప్రయాగలో ... సంకల్పం, వేణీదానం, త్రివేణీ సంగమంలో తమతో ధనుష్కోడి నుంచి తెచ్చిన సైకతలింగాన్ని నిమజ్జనం చెయ్యటం, వేణీమాధవస్వామి దర్శనం చేసుకోవటం, అక్కడి గంగనీటిని సేకరించటం, హిరణ్యశ్రాద్ధం, పిండప్రదానం, తిలతర్పణం చెయ్యటం అనేవి ముఖ్య విధులు. అక్కడి నుంచి కాశీ చేరుకోవాలి.

కాశీలో మొదటి రోజు గణపతి పూజ, మహాసంకల్పం, తర్పణం, మణికర్ణిక ఘాట్ లో స్నానం, ఫలదానం, అన్నరూపహోమశ్రాద్ధం, పిండప్రదానం, తిలతర్పణం చెయ్యాలి. ఆ రోజు సాయంకాలం శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి, అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవార్ల దర్శనం చేసుకోవాలి. అక్కడ శ్రీకాశీవిశ్వనాథస్వామివారికి శ్రీరామేశ్వరం నుంచి తెచ్చిన సముద్రజలాలతో అభిషేకం చెయ్యాలి.

కాశీలో రెండవరోజు అసి ఘాట్, వరుణఘాట్, దశాశ్వమేధఘాట్, పంచగంగా ఘాట్, మణికర్ణికఘాట్ లలో పిండప్రదానం, తిలతర్పణం చెయ్యాలి. అక్కడి నుంచి బిందుమాధవదర్శనం చేసుకుని గంగా పూజ చెయ్యాలి. మూడవరోజు గయకు చేరుకోవాలి. గయలో మహాసంకల్పం, పల్గుణీ తీర్థస్నానం, హిరణ్యశ్రాద్ధం, పిండప్రదానం, విష్ణుపాద హిరణ్య శ్రాద్ధం, హోమసహిత అన్నశ్రాద్ధం, అక్షయవటం దగ్గర పిండప్రదానం, ఫలదానం చెయ్యాలి.

నాల్గవరోజున తిరిగి వారణాశికి (కాశీకి మరో పేరు వారణాశి) చేరుకుని అక్కడ గంగాతీరంలో దంపతీ ఫూజ చేసి అక్కడినుంచి కాలభైరవస్వామి ఆలయంలో భైరవదర్శనం చేసుకుని రక్షతాడు కట్టుకోవాలి. కాలభైరవ దర్శనంతో కాశీ దర్శనం పూర్తి అయ్యింది అన్న మాట. అక్కడి నుంచి తిరిగి రామేశ్వరానికి చేరుకుని శ్రీరామనాథస్వామిని ప్రయాగలో సేకరించిన గంగాజలాలతో అభిషేకించాలి. ఈ అభిషేకవిధితో కాశీయాత్ర పరిపూర్ణమౌతుంది. కాశీలో తొమ్మిది రోజులు బస చెయ్యాలి అనేది ఒక విశ్వాసం తో కూడిన ఆచారమే కాని తప్పని సరి నియమం కాదు.

కామెంట్‌లు లేవు: