NAGARAJA RAO JSWALKAR:
*🔱🐂బసవ పురాణం🐂/8వ భాగము🔱*
భూగర్భ నిధి బిజ్జలుని భాండాగారమునకు చేరింది.
దానితో బిజ్జలునికి బసవన్నపై అపారమైన గౌరవం కలిగింది. బసవన్నను ఘనంగా సత్కరించాడు.
*‘‘వ్యవసాయము చేతునయ్యా శివసేవకు! వ్యవహారము చేతునయ్యా! నీవిచ్చిన ధనమల్లెను నీదే నీ భక్తుల సేవకే వినియోగిస్తాను నీ పాదాంబుజ సాక్షి- నిక్కమిదె స్వామి కూడల సంగమదేవా’’* అన్నాడు బసవన్న.
ఈ విధంగా బసవన్న తనకు లభించిన ధనాన్ని శివభక్తి ప్రచారానికి వినియోగించుకున్నాడు. *‘‘కుల వ్యవస్థ మానవ నిర్మాతమే కాని ఈశ్వర నిర్మితము కాదు. కాచగ కుమ్మరి- ఉతికిన చాకలి- నేతతో సాలె- వేద మంత్రములతో బ్రాహ్మణుడు- ఇలా వారు వారు చేసే వృత్తులను బట్టి కులములేర్పడ్డాయి కాని శివుని దృష్టిలో అంతా ఈశ్వర సంతానమే’’* అన్నాడు బసవన్న. అంతేకాదు సమాజంలోని దంభాచారములను తిరస్కరించాడు. *‘‘ఏమి చిత్రమీలోకము కథ. సత్యేతరమగు జీవితగాములు రాతి పామునర్చించెడి పెద్దలు జాతి నాగులను చంపివేసెదరు. తినెడి జంగమునాచ నాచన నాచనామంచుకు తినని లింగమును తిను తినమందురు’’* అని సూటిగా ప్రశ్నించాడు. ఈ విధంగా బసవన్న తనకు లభించిన పదవిని జాతీయ సమైక్యతకై ఉపయోగించాడు. మూఢాచారములను ఖండించి శివభక్తిని ప్రచారం చేయసాగాడు సమకాలీన సమాజంలో నిరీశ్వరవాదులు మిద్యా బ్రహ్మ చర్యమును పాటించినట్లు నటించి పతనం కావటం చూచి *‘ఇంద్రియ నిగ్రహమేల చేసెదవు? పంచేంద్రియములు బాధపెట్టవా! సతీపతుల సౌఖ్యంబు వదిలిరా సింధు భళ్లాళ సిరియాళాదులు?’’* అని వైవాహిక బంధం వైశిష్ట్యాన్ని ప్రతిపాదించాడు.
*‘‘చచ్చిననే స్వర్గమ్మను మాటలు చెరుకుతుదను గల సారము వంటిది. టంకసాల ఈ భువి బ్రహ్మయ్యకు ఇట చెల్లిననే అచటను చెల్లును. ఇట చెల్లనిదెచ్చటనిక చెల్లదు. స్వామి కూడల సంగమదేవా’’* అని భూకైలాసాన్ని వాంఛించాడు. అశ్వారూఢ బసవన్న పరిపాలనకు సంకేతము. వచనకార బసవన్న సాహిత్య సృష్టికి నిదర్శనము. ధర్మప్రవచన బసవన్న శివతత్వ ప్రచారానికి నిదర్శనము. ఇలా మూడు రూపాలలో బసవన్న సాక్షాత్కరించాడు.
*ధనవంతులు నిర్మింతురు నీకై ధగధ్ధగోజ్వల గోపురాదులను. ధనము లేని బడుగును నేనెట్టుల తమకై కట్టుదు శివాలయంబును- స్వామి కూడల సంగమ దేవా- చెడును స్థావరము జంగమ మిదిగో- పాదములివి ఆలయ స్తంభంబులు పసిడి కలశమగునా శిరమిదిగో- నడిచెడి ఈ దేవాలయమంబులో నివసింపుము శ్రీ సంగమేశ్వరా!’’* అని బసవన్న కోరుకున్నారు.
దీని తాత్పర్యం ఏమిటంటే మానవ శరీరమే శివునికి సరియైన దేవాలయము. కాయకమే కైలాసము అంటే కర చరణాది అనే .... గల ఈ మృణ్మయ శరీరమును చిన్మయముగా మార్చవలెనని బసవన్న శాసనం కల్పించారు. కేవలము ఆలయము చుట్టూ తిరిగి లాభము లేదని సత్కర్మచరణముతో మానవ దేవాలయములను నిర్మించాలని బసవన్న తన అనుయాయులకు సందేశమిచ్చారు. బసవన్న ప్రబోధించి ఊరుకోలేదు. తాను చెప్పినది ముందు తానే చేసి చూపించాడు. అంటే ఆచరణ లేని ప్రవచనము వృధాయని బసవన్నగారి అభిప్రాయము.
*తాను ధనమును కూడబెట్టలేదు. ప్రజలకు అలా ధనాన్ని దాచుకోవద్దు- దాచుకున్నవాడు దోచుకున్నవాడూ ఇద్దరూ దొంగలే*
అని బసవన్న నూతన సందేశాన్ని సమాజానికి అందించాడు. అంటే తన సమకాలీన సమాజంలో ఆర్థిక, సాంఘిక తారతమ్యములు లేని ఒక మానవాళిని నిర్మించాలని ఆశించాడు.
*మానసిక ప్రక్షాళన లేకుండా డంబాచారములు శుష్కపూజలు నిరర్థకం* అన్నాడు.
*‘‘ఎంగిలంటున్నాయి లింగా ఏమి చేతునురా మహానుభావా! ఓ లింగమూర్తీ- గంగాతీరథము తీసుకొచ్చి లింగ పూజ చేతమంటే గంగలోని చేప కప్ప ఎంగిలంటున్నాయి. పుష్పములతో పూజ చేస్తే కొమ్మ కొమ్మకు వున్న తుమ్దె ఎంగిలి అంటున్నది. పాలతో అభిషేకం చేయాలనుకుంటే దూడ ముందే పొదుగును ఎంపిక చేసింది. అందుకని ఎంగిలి లేని మనస్సుతో శివపూజ చేయండి. పవిత్ర మనస్సు అనే పద్మం సమర్పించినవారికి పూజకు వేరే పూలతో అవసరమేముంది’’* అని బసవన్న ప్రబోధించాడు. చారిత్రిక స్థలములు హింగులేశ్వర బాహ్యవాడి, ఇది రెండు గ్రామములు. 1. హింగులేశ్వరము అనుపేరుగల బ్రాహ్మణ అగ్రహారము, ఇందులో ఎక్కువమంది పాశుపత శైవులు. 2. బాహ్యవాడి ఇది హింగులేశ్వరమునకు అతి సమీపంలో ఉన్న జనపదము. ఇక్కడ నందీశ్వర మందిరమున్నది. ఇందులోనే మాదాంబిక నందికేశ్వర వ్రతమున్నది. ప్రస్తుతం దీనిని బసవన బాహ్యవాడి అనే పేరుతో పిలుస్తారు. కూడల సంగమేశ్వరం. బసవేశ్వరుని ఐక్య స్థలము. ఇక్కడ కృష్ణ, మలప్రభ, గతప్రభ, అనే మూడు నదులు కలసి త్రివేణి సంగమం గా మారింది. ఈ దక్షిణ ప్రయాగను శైవులు కూడలి సంగమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు.
2
అక్కడ కల్యాణ నగరంలో బలదేవ దండనాయకుడు కైలాసానికి వెళ్లిపోయాడు. అప్పుడు ప్రభువైన బిజ్జలుడు ఆప్తులను పిలిచి *‘‘బలదేవుని బంధువులలో ఈ దండ నాయక పదవి’’ నిర్వహింపగలవారెవరైనా ఉన్నారా?’’* అని ప్రశ్నించాడు.
*‘‘ఉన్నాడు ప్రభూ! బసవన్న! ఆయనకే మన బలదేవుడు తనకుమార్తెనిచ్చాడు కదా! బసవన్న సామాన్యుడు కాడు. మహావినయ సంపన్నుడు. పాపరహితుడు. బలవంతుడు, సర్వకళా ప్రవీణుడు, సాక్షాత్తు సంగమేశ్వరుడే స్వయంగా వచ్చి ఆశీర్వదించి వెళ్లాడు ఆయనను. అతడే తమకు ప్రధానమంత్రిగా తగినవాడు’’* అని ఆప్తులు సలహా ఇచ్చారు.
అది విని బిజ్జలుడు సంతోషించి మంత్రులకు, అధికారులకు బసవని తీసికొని రమ్మని పంపాడు. వారు బిజ్జలుని ఆజ్ఞతో ఆయన ఎక్కే పట్టపుటేనుగును బసవేశ్వరునికోసం తీసుకొని సంగమేశ్వరం చేరారు.
- ఇంకా ఉంది🙏
🙏 హర హర మహాదేవ 🙏
J N RAO 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి