18, ఆగస్టు 2023, శుక్రవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-22🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-22🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


సోదిని నమ్మే ఆచారము వున్నది కదా! అందుచే శ్రీనివాసుడు కనకాంబరము చీర కట్టాడు. కాని రంగు రవికె తొడుగుకున్నాడు. ముద్దొచ్చే పచ్చబొట్టు ముఖానికి పెట్టుకున్నాడు. కండ్లకు నల్లనైన కాటుక పెట్టుకున్నాడు. తలమీద సోదిబుట్ట పెట్టుకొన్నాడు.


 ఈ విధముగా ఎరుకలసాని వేషము ధరించినవాడై శ్రీనివాసుడు అచ్చు ఆడుదానివలె తయారయి ఆకాశరాజు నగరములో ప్రవేశించాడు, సరాసరి రాజభవనము చేరింది ఆ క్రొత్త సోది స్ర్తీ.


 ‘సోది చెబుతానమ్మా సోదీ!’ అని బిగ్గరగా కేక వేసింది. ఆకాశరాజు భార్య ధరణీదేవి ఈ మాట విన్నది. పిలికించి ఆమెను ‘మా అమ్మాయికి సోది చెప్పుము’ అంది. ‘సరే’ యన్నది ఎరుకల సాని పద్మావతిని బుట్టకి ఎదురుగా కూర్చుండజేసి చేటలో విలువైన ముత్యాలు పోయించినది. 


గద్దెపలక వుంటుంది కదా దానికి పసుపూ, కుంకుమా పెట్టించింది. దేవతలను కొలిచినది. మూలదేవతలకు మ్రొక్కినది. ఇంక సోది చెప్పుట ప్రారంభించినది.....


‘‘ఇనుకోవె ఓ పిల్లా ఇవరంగా చెప్పుదు

జరిగేది యంతా నిజముగా చెప్పుడు

వనములో పురుషుని వలపుతో జూసి 

అతని నీ మనసులో అట్లే దాచావు

గుండెలో నతుడు బాగుండినాడే పిల్ల 

శృంగార వనములో శృంగార పురుషుడే ‘‘నన్ను 

ప్రేమింతువా?’’ యని యన్నందుకే నీవు 

రాళ్ళతో కొట్టించు రాలుగాయీ పిల్లా 

వెన్నవంటీ మనసున్నవాడే వాడు 

నిన్న బోలిన బాధ నున్నాడు వాడు 

ఆ రోజు నడవి వాడనుకొంటివే వెఱ్ఱి!

ఆదిదేవుడు నారాయణుడతండే 

శ్రీనివాసునిగాను చెలగుచున్నాడే

ఆకాశమె క్రిందుగా గమనించిననూ 

భూమియే పైపైకి పోయినా ఏమైనా 

దంపతులగుదరు పెండ్లియు జరిగి 

దిగులు నీ పెండ్లితో దిగునులే పిల్లా‘‘

అని వున్నవీ, జరిగేవీ వివరముగా సోది చెప్పినది. వారిచ్చిన కట్నము తీసుకొని వెళ్ళిపోయింది ఎరుకులసాని.

ఎరుకసాని వేషము వేసుకొని సోది చెప్పిన వెనుక శ్రీనివాసుడు పద్మావతి గురించే ఆలోచించసాగాడు. పద్మావతి శ్రీనివాసునితో తనకు ఏ విధముగా పెండ్లి జరుగుతుందా అనే ఆలోచనలో పడింది

. ఆకాశరాజా, ధరణీదేవి పద్మావతిని చూచి విచారించసాగారు. పద్మావతికి కలలో శ్రీనివాసుడు కనుపించి అనేకమైన లీలలు చూపించినాడు. ఆమె ఆవిషయము తన తల్లిదండ్రులతో చెప్పి తాను శ్రీనివాసుని తప్ప మరొకరిని వివాహమాడననెను. ధరణీదేవీ, ఆకాశరాజూ కూడా తాము పెద్దలను సంప్రదించి ఆమె కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తా మన్నారు.

వకుళ, రాయబారము సాగించుటకు నారాయణపురము చేరినది. అంత:పురములో ప్రవేశించినది. ఆకాశరాజు, ధరణీదేవి ఆమెను తగురీతిని గౌరవించి పూజించారు. 

అనంతరము ఆకాశరాజు వకుళతో ‘‘అమ్మా! చూడగా మీరు యోగినివలె కనిపించుచున్నారు. మీ రాకవలన మా గృహము పావనమైనది. మీ రాకకు గల కారణము తెలుసుకొనవలెనని కుతూహల పడుచుంటిమి. మీరు యెక్కడ వుంటుంటారు? ముఖ్యంగా మీరు శ్రమపడి వచ్చిన పనిని తెలియజేయ కోరుతున్నాము. అన్నాడు. 


వకుళాదేవి ఆకాశరాజుతో మహారాజు! నేను శేషాచల నివాసిని, నాకు ఒక్కగానొక్క, కుమారుడు. అతనిపేరు శ్రీనివాసుడు. నాకుమారుని అందము చెప్పడానికి భాషలోని మాటలు చాలవు. అతనిది వశిష్టగోత్రము అతని వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే. ఒకనాడు మావాడు వేటకు వెళ్ళి శృంగారవనమున ప్రవేశించి, మీ ముద్దుల కుమార్తె అయిన పద్మావతి యొక్క సౌందర్యతిశయాన్ని చూసి ప్రేమించినాడు పద్మావతిని తప్ప అన్య కన్యను ఒల్లనంటున్నాడు.’’ ఈ మాటలు అంటూంటే ధరణీదేవి మా అమ్మాయి కూడా యింతే కదా అనుకొన్నది.


వకుళ చెపప్పసాగినది. ‘‘నా కుమారుడు మూడు లోకాల్ని ఏలగల దిట్టడు. ఆ లక్షణాలన్నీ వున్నాయి. బుద్ధిమంతుడూ, అందగాడూ అయిన మా పిల్లవాడికి బుద్ధిమంతురాలూ, సుందరీ అయిన మీ కుమార్తెనిచ్చి వివాహము చేసే ఉభయత్రా బాగుంటుంది. కనుక, మీరు సందేహించక ఆ విధముగా చేయండి. మావాడు దైవాంశజుడేగాని, మానవమాత్రుడు కానేకాడు’’ సాత్త్విక భావము తొణికిసలాడే ఆమె పలుకులకు ఆకాశరాజు ఆనందించి ‘‘ అమ్మా! మీరు ఉన్న విషయాలన్నీ చెప్పారు. ఈ విషయాలన్నీ మా పెద్దలతో కూలంకషంగా యోచించి, ఏ విషయమూ మీకు వర్తమానము పంపుతాను’’ అన్నారు. వకుళాదేవి వారివద్ద శలవు గైకొని తిరిగి తిరిగి తన స్థలానికి చేరుకొన్నది

బిల్వపత్రార్చిత గోవిందా, బిక్షుక సంస్థుత గోవిందా, బ్రహ్మాండ రూప గోవిందా, భక్త రక్షక గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||22||


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: