యమునా నదీ హర్షము
--------------------------------------
మ: ముదితా! యేతటినీ పయః కణములన్ మున్ వేణు వింతయ్యె నా
నది సత్పుత్రుని గన్న తల్లి పగిదిన్ నందంబుతో నేఁడు స
మ్మద హంసధ్వని పాటగా వికచ పద్మశ్రేణి రోమాంచ మై
యొదవన్ తుంగ తరంగ హస్త నటనోద్యోగంబుఁ గావింప దే!
ఇరువురు గోపికలు పరస్పరం యమునాతీరంలో కృష్ణుని బృందావన విహార సోయగాన్ని చూస్తో మాటలాడిన రీతిగా పోతన వర్ణించినతీరు అనన్య సామాన్యమైనది.
సఖీ చూశావా! తన నీటితో పెరిగి కృష్ణుని చేతికెక్కి భువన మోహనమైన రాగాలను వినిపించుచున్న ఈ వంశిని జూచి ప్రయోజకుడైన కొడుకును జూచి సంబరపడే తల్లివలె హంసనాదములనే పాటతో వికసిత పద్మములను రోమాంచముతో పైకెగసిపడే కెరటములనే హస్తములతో యమున నాట్యం చేస్తున్నది. అని భావం!
పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైన కొడుకును చూస్తే యేతల్లికి ఆనందం కలుగదు? అలాంటి ఆనందం యమునకు ఆవంశిని జూస్తే కల్గినదట! ఇంత మొలకగా తనగట్టున మొలచి, తన నీటితో నింతింతై యెదిగి కృష్ణయ్య చేతిలో మురళిగా మారింది. అలామారి యతనిచే పూరిపఁ బడి జగన్మోహనకరమైన రాగా లాపన చేస్తుంటే దానిని చూచి అంతులేని యానందం యమునకు కలుగదా మరి!
ఆనందం కలిగినప్పుడు దానిని రక రకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక్కడ యమున హంసధ్వనియే పాటగా( హంసధ్వని రాగంకూడా ఉంది. ఉల్లాసంగా హుషారుగా పాడుకుంటానికి అనువైనది) వికసించిన పద్మ సముదాయమే రోమాంచముగా ( సంతోష సమయంలో శరీరంలోని కేశములు నిక్క బొడచుట రోమాంచము) యెత్తైన కెరటములనే హస్తముల చాలనచే నాట్యం చేసే ప్రయత్నం చేస్తోందట!
రాగ తాళాను గుణ్యముగా నటన మాడుట నాట్యవిధానము. దానికనుగుణ మైన ప్రవృత్తి యమునా నదిలో సాక్షాత్కరింపజేసి పోతన యీ ఘట్టాన్ని అతి మనోహరంగా తీర్చి దిద్దినాడు. వస్తువునకు తగిన ప్రకృతి ప్రకృతకి తగిన వర్ణనము వర్ణనమునకు తగిన భావములు భావములకు తగిన పదములు పదములకు తగిన కూర్పు అందుకు తగిన పద్యములయల్లిక పోతన కవితా విెశిష్టతకు ప్రతీకలు!
ఇంత సుందరమైన సుమధురమైన వర్ణనా సామర్ధ్యము పోతనకు దైవదత్తమైనవరము. అందుచేతనే కాబోలును ఆంధ్రదేశమున పోతన భాగవతమున కున్న ప్రచారము సంస్కృత భారతమునకు కనిపించదు.
మిత్రులారా! భాగవతం చదవండి! చదివించండి!
స్వస్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి