అనగనగా ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కొడుకులు, ఏడుగురు కోడళ్ళు కలరు.ఆ ఏడుగురు కోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకుందామని ప్రయత్నం చేసుకున్నారు.అంతలో ఆఖరి కోడలికి అమావాస్య రోజున ఒకపిల్ల చచ్చిపోయెను.ఆ కారణంగా ఆ సంవత్సరం అందరూ నోము నోచుకోవడం మానేసారు.అది మొదలు ప్రతి సంవత్సరం వీళ్లంతా నోము నోచుకుందామని ప్రయత్నం చేసుకోవడం, అమావాస్య వచ్చేసరికి ఆఖరి కోడలికి పుట్టిన పిల్ల చచ్చిపోవడం జరుగుతుండటం వల్ల ఆ ఏడుగురు కోడళ్ళకి ఆ నోము పట్టడానికి వీలు లేకపోయింది.ఇలా ఏడేళ్ళు గడచిన తరువాత, "ఏటేటా ఈ ఆఖరుదానికి పిల్లలు పుట్ట, చావ " అని తిట్టుకుంటూ మిగతా కోడళ్ళు ఆ నోము నోచుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేసుకున్నారు.అమావాస్య వచ్చేసరికి ఆఖరి కోడలికి పుట్టిన పిల్ల మళ్ళీ చచ్చిపోవడంతో అంతా తనని తిట్టిపోస్తారని, చనిపోయిన ఆ పిల్లని ఇంటిలో పెట్టి తాళం వేసుకుని చివరికోడలు అందరి తోడికోడళ్ళ ఇంటికి వెళ్ళి అందరికీ తలా ఒక పనిలో సాయం చేసింది.తరువాత ఒకరి ఇంటిలో తలంటి నీళ్ళు పోసుకుని, మరొకరి ఇంట్లోనుండి పిండి, పప్పు మొదలైనవి తెచ్చుకుని ఇంటికొచ్చి చచ్చిన ఆ పిల్లని ఇంట్లో పెట్టుకునే తాను కూడా ఆ నోము నోచుకుంది.ఆ రాత్రిదాకా ఉండి చీకటిలో చచ్చిన పిల్లని భుజం మీద వేసుకుని పోలేరమ్మ గుడి వద్దకి వెళ్ళి ఆ పిల్లని అక్కడ పడుకోబెట్టి ఏడ్వసాగింది.ఇంతలో గ్రామ సంచారానికి వెళ్లిన అమ్మవారు గుడి వద్దకు వచ్చి, ఏడుస్తున్న ఆ స్త్రీని చూసి ఎందుకేడుస్తున్నావని ప్రశ్నించింది.అందుకు ఆ స్త్రీ, "ఏడేళ్ళనుండీ ఏడుగురు పిలల్లని ఈ అమ్మవారికి అప్పగిస్తున్నాను.ఈ ఏడు కూడా ఈ పిల్ల చచ్చిపోయింది.తోడికోడళ్ళు తిడతారని ఈ చనిపోయిన పిల్లని ప్రొద్దుటినుండీ దాచి ఇప్పుడు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి ఏడుస్తున్నాను" అని సమాధానమిచ్చింది.
అప్పుడు అమ్మవారు కరుణించి, "నీ పిల్లలకి మరేమీ భయం లేదు.నేను తీసుకుని వచ్చి ఇస్తాను!" అని చెప్పి అక్షింతలు ఆ స్త్రీ చేతిలో పోసి, "నువ్వు నీ పిల్లలని పాతిపెట్టినచోటుకి వెళ్ళి వాళ్ళని పిలువు!" అని చెప్పెను.
ఆ స్త్రీ ఆ అక్షింతలని చేతిలో వేసుకుని, "అందెలాడ రారా!మువ్వలాడ రారా!" అని వరుసగా ఏడుగురిని పిలవగానే అందరూ వరసగా లేచి వచ్చిరి.సంతోషముతో ఆ పిల్లలందరినీ తీసుకొని ఆ స్త్రీ ఇంటికి వెళ్ళింది.
తెల్లవారిన తర్వాత అందరూ ఈ పిల్లలని చూసి వీరెక్కడినుండి వచ్చారని ఆమెని అడిగారు.పోలేరమ్మ దయవలన ఆ పిల్లలు బ్రతికికి వచ్చారని ఆ స్త్రీ వారితో చెప్పింది.అప్పటినుండి ప్రతి సంవత్సరం అందరూ ఈ అమావాస్యకు తప్పకుండా నోము నోచుకుని ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకోసాగారు.అందుకు అమ్మవారు సంతోషించి సంతానము లేనివారికి సంతానమిచ్చి,సంతానము కలవారికి కడుపు చలవ ఇచ్చి రక్షించుచుండెను.
దీనికి ఉద్యాపనము లేదు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి