*ధర్మం’ అంటే ఏమిటి?.*
ఇది చాల క్లిష్టమైన ప్రశ్న!
వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న! ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి
చాలా లోతువుంది.
చాలా సంక్లిష్టత ఉంది.
చాలా నిగూఢత ఉంది.
చాలా విశాలత ఉంది.
‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’
ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.
ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. (ధృ – ధారణే).
ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.
ధర్మము – సామాన్యధర్మం,
విశేషధర్మం అని రెండు రకాలు.
శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|
హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||
“ధృతి –
క్షమ –
దమం –
అస్తేయం –
శౌచం –
ఇంద్రియ నిగ్రహం –
హ్రీః (సిగ్గు) –
విద్య –
సత్యం –
అక్రోధం”,
ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది.
అంటే;...
1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు.
తనకు సంబంధించినది కానివ్వండి,
కుటుంబానికి సంబంధించినది కానివ్వండి,
సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు.
కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి.
కువిర్శలు ప్రారంభమౌతాయి.
ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది.
ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి.
‘ఇది ధర్మం’.
2. మనిషి ఏ విషయంలోనైనా,
ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి.
క్షమాగుణంతో ఉండాలి.
ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి.
కోపగించుకోకూడదు.
ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.
3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి.
ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం.
చదువుతున్నా,
వింటున్నా,
పని చేస్తున్నా,
మాట్లాడుతున్నా,
మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.
4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక,
నిస్తేజంగా..
నిర్వికారంగా,
నిరాశగా,
నిర్లిప్తతగా,
నియమరాహితుడుగా,
ఉండకూడదు.
‘ఇది ధర్మం’.
5. మనిషి ఎల్లపుడూ..
మనస్సునూ,
శరీరాన్నీ,
మాటనూ..
ఆలోచననూ,
సంసారన్నీ,
ఇంటినీ,
పరిసరాన్నీ,
ధరించే వస్త్రాలనూ
పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి.
మనసు పరిశుభ్రంగా వుండాలి.
మనిషి పరిశుభ్రంగా ఉండాలి.
‘ఇది ధర్మం’.
6. చదువువున్నా,
సంపదలున్నా,
కీర్తివున్నా,
బలంవున్నా
ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు.
కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాన్ని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి.
‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని..
భూతప్రేతాలుగాని,
దెయ్యాలు గాని,
యక్షకిన్నర కిమ్పురుశులుగాని,
గ్రహాలు గాని,
రోగాలు గాని,
కష్టసుఖాలుగానీ,
మరణంగానీ,
వశంలో వుంటాయి.
కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి .
‘ఇది ధర్మం’.
7. ప్రతి విషయానికీ సంకోచపడటం,
సిగ్గుపడటం,
అనుమానపడటం,
తనను తాను తక్కువగా భావించటం కూడదు
‘ఇది ధర్మం’.
8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి.
అకారణంగా,
అనవసరంగా,
ఒకరి మెప్పుకోసం,
ఒకరిని మెప్పించటంకోసం,
తన పనిని సాధించుకోవటం కోసం,
తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది..అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది.
అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది.
అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది.
మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది.
కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు.
‘ఇది ధర్మం’.
9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో,
వివేకం కూడ అంతే ముఖ్యం.
వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు.
విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి.
‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి.
మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా,
స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,
భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి.
‘ఇది ధర్మం’.
10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం
ఇవన్నీ మనిషిని పతనావస్థకు నేడతాయి.
పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి.
తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ,
తాను జన్మనిచ్చిన వారికీ,
తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది..
.
*మనమందరం అహంకార శూన్యులుగా మారాలి*
*అహం వదిలిపెట్టాలి.....*
మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడు.
నేను, నాది, నా అనే అర్థాలకు వాడు, వాడిది, వాడే అనే భావాన్ని జోప్పించాలి.
భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి.
‘సత్య నిష్ఠ ఏ ఈ కలియుగానికి తరుణోపాయం’ అని శ్రీరామకృష్ణులు సెలవిచ్చారు.
సత్యం అన్నది సత్తుకు సంబంధించినటువంటిది. సత్ పరబ్రహ్మ వస్తువు. సత్ యే ఆనందం. ఆనందమే బ్రహ్మం.
ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలి బాటలో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు.
తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తూ ఒక పాడుబడిన బావిలో పడ్డాడు.
అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది.
ఆ చెట్టుకొమ్మను పట్టుకు వ్రేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వ్రేలాడుతూ ఉండిపోయాడు.ఆదిత్యయోగీ..
ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వ్రేలాడుతున్న అతను క్రిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండ రాళ్ళు కనపడ్డాయి.
వాటిని చూసి, ‘ఆహా! ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి’ అని అనుకోని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఆపదనుండి బయట పడడానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరిచినా ఎవరూ రాలేదు. అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్ళనూ వాళ్ళనూ పిలిచి ప్రయోజనం ఏమిటి భగవంతుణ్ణే పిలుస్తాను అని అనుకొని భగవంతుణ్ణి పిలిచాడు..
నీవు పిలిచావు కాబట్టి వచ్చాను అన్నాడు.
అవును, నువ్వు నిజంగా భగవంతుడివే! ఆలస్యం చేయక నన్ను పైకి లాగి కాపాడు’ అని బావిలోకి వ్యక్తి వేడుకున్నాడు.
‘నిన్ను కాపాడడానికి వచ్చాను. అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అన్నాడు.
‘అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు’ అన్నాడు లోపలి వ్యక్తి.
నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వసిస్తున్నావా?’
దానికి బదులుగా బావిలోని వ్యక్తి, ‘విశ్వసిస్తున్నాను, నీవు నిజంగా భగవంతుడివే’ అన్నాడు.
‘నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నీవు నిజంగా నమ్ముతున్నావా?”
‘నమ్ముతున్నాను’ అన్నాడు.
‘నేను ఏది చెప్పినా చేస్తావా?”
‘కచ్చితంగా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను’ అన్నాడు.
‘అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో, దాన్ని వదిలేయి. నేను నిన్ను కాపాడతాను’ అన్నాడు భగవంతుడు
బావి లోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి, ఆయన చేతిలో ఏవిధమైన తాడు కానీ, నిచ్చిన కానీ, మరే విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు.
కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి, ముందు కిందనున్న బండరాళ్ళ మీద పది, తల పగిలి చస్తానని అనుకున్నాడు..
‘ఇది చాలా కఠినమైన షరతు. కొమ్మను వదలడం తప్ప, నువ్వు ఏం చెప్పినా చేస్తాను’ అన్నాడు బావిలోని వ్యక్తి.
‘నువ్వు ఏమీ చేయనక్కరలేదు. కొమ్మను వదిలితే చాలు’ అన్నాడు భగవంతుడు.
సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారమనే కొమ్మను పట్టుకొని వ్రేలాడుతున్నాం. ఎప్పుడైతే మనం ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు.
కాబట్టి, మనమందరం అహంకార శూన్యులుగా మారాలి...
.
*జ్ఞాన వార్ధక్యం*
వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవయసులోనే పరిపూర్ణజ్ఞానం గలవారిని జ్ఞానవృద్ధులంటారు. సాధారణంగా జీవితమంతా ఆర్జించిన అనుభవాలు వార్ధక్యజ్ఞానంగా పరిణతి చెందుతాయి.
అనుభవజ్ఞానం అన్నింటికన్నా గొప్పదంటారు. కొందరికి పుట్టుకతో లభించే జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. అష్టావక్రుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడే, తండ్రి శిష్యులు ఉచ్చారణ దోషాలను ఎత్తిచూపి శాపగ్రస్తుడయ్యాడని కథ.
జ్ఞానం దైవప్రసాదం. వేదవ్యాసుడు సద్యోగర్భజనితుడు (ఆ క్షణంలోనే జన్మించినవాడు). ఆయనకు కృష్ణద్వైపాయనుడనే పేరు కూడా ఉంది. పద్దెనిమిది పురాణాలు, మహాభారతం, భాగవతం వంటి దివ్యరచనలు చేసిన వ్యాసుడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన విష్ణురూపుడు. మరణం లేని కాలాతీతుడు. త్రికాలవేది. జగద్గురువుల్లో ప్రసిద్ధుడు. ఆయన ఎవరి దగ్గరా శిష్యరికం చెయ్యని జన్మజ్ఞాని. దత్తాత్రేయ అవతారాలన్నీ ఇలాంటివే.
కొందరు ఏకసంథాగ్రాహులుగా ఉంటారు. వారు అల్పకాలంలోనే అనల్పజ్ఞానం ఆర్జిస్తారు. గురువులను మించిపోతారు. గురు నానక్ దేవ్ అలాంటి అసమాన జ్ఞాని. సిక్కులు ఆయనను గురుపరమాత్మగా ఆరాధిస్తారు.
మనలో కొందరు బాలమేధావు లుంటారు. సంగీతం, నృత్యం వంటి కళారంగాల్లో వారు ప్రసిద్ధులు.కానీ, వారి ప్రావీణ్యం ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. ఎవరి జ్ఞానం వృద్ధుల చేత గుర్తింపు పొంది, గౌరవానికి నోచుకుంటుందో, వారు వయసులో చిన్నవారైనా జ్ఞాన వృద్ధులుగా పేరొందుతారు.. ఆదిత్యయోగీ..
ప్రపంచ సంపదలకు హెచ్చుతగ్గు లుంటాయి. జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది. విదురుడు కారణజన్ముడు. జ్ఞాన వృద్ధుడిగా చెప్పదగిన వాడు. ధృతరాష్ట్రుడు వంటివారికి నీతి బోధ చేసినవాడు. ‘మహాత్మా’ అనిపించుకున్న యోగ్యుడు. అనేక ధర్మ సందేహాలను తీర్చిన ప్రాజ్ఞుడు. ఆయన బోధలు విదురనీతి పేరుతో లోక ప్రసిద్ధం.
జ్ఞానం ఆనందకారకం. హయగ్రీవస్వామిని, దక్షిణామూర్తిని జ్ఞానానంద స్వరూపులుగా చెబుతారు. దక్షిణామూర్తిని దీక్షగా చూస్తే చాలు... జ్ఞానప్రసారం జరుగుతుందన్న కథ ఉంది.
ఏది అజ్ఞానమో తెలిపేది జ్ఞానం. అలౌకికమైన జ్ఞానమే ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనం. వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే వివేకం. క్షణభంగురమైన జీవితాన్ని శాశ్వతమని భ్రమించక, సద్వినియోగం చేసుకోవడమే మనిషి కర్తవ్యం.
ఆదిశంకరులు ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నప్పుడు ఒక చోట వృద్ధుడు వ్యాకరణం వల్లె వేస్తుంటాడు. ఆ క్షణంలోనే ఆయన భజగోవింద శ్లోకాలు ఆశువుగా చెప్పినట్లు కథ ప్రచారంలో ఉంది. ఆ వృద్ధవిద్యార్థితో ఆదిశంకరులు- ‘ఓ మూఢుడా! మృత్యుముఖంలో ఉన్నప్పుడు ఈ వ్యాకరణసూత్రాలు నీకు అక్కరకు రావు. గోవిందుణ్ని భజించు. నీకు మోక్షం లభిస్తుంది’ అంటారు.
ఈ సలహా అందరికీ వర్తిస్తుంది.
భగవంతుడి సన్నిధికి చేర్చేది భక్తి మార్గమే... శాస్త్ర జ్ఞానం కాదు. జ్ఞాన వృద్ధులు బాల్యం నుంచే భక్తిమార్గంలో స్థిరచిత్తులైై ఉంటారు.
భగవంతుడి గురించి సుబోధకం చేసేదే జ్ఞానం. అలాంటి జ్ఞాని ప్రపంచ మాయలో చిక్కుకోడు!....
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి