12, సెప్టెంబర్ 2023, మంగళవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్యచరిత్ర🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.      *🌹శ్రీ వేంకటేశ్వర దివ్యచరిత్ర🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు.


 ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. 


అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. 


ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. 


తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. 


ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.


*రాజాశ్రయం*

విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.


*అంత్య కాలం*

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.


ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట.


 అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.


95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (1503 ఫిబ్రవరి 23) పరమపదించాడు.


 రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.


ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.


అన్నమయ్య కీర్తనలు, రచనలు 

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.


అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)

సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు లభించలేదు. ఐ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిద్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే"

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.


ఉదాహరణలు

"అదివో అల్లదివో శ్రీహరి వాసము     పదివేల శేషుల పడగల మయము"


"అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల

పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల "


"కులుకక నడవరో కొమ్మలాలా        జలజల రాలీని జాజులు మాయమ్మకు"


"క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని       నీరజాలయమునకు నీరాజనం"


"జోఅచ్యుతానంద జోజో ముకుంద         రావె పరమానంద రామ గోవింద "


"చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ-

పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా"


ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలువిడె

అదనెరిగి రాడాయెనమ్మా నా విభుడు


*కవి కుటుంబం*

అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.


తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాథుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.


చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంథము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.


ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు.


*దొరికిన పెన్నిధి*

 

తిరుమల సంకీర్తనా భండారంలో లభించిన రాగిరేకులలో ఒకటి

1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారం (తరువాత పెట్టిన పేరు)లో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది.


 *వేద రక్షకా గోవిందా, వేద* *స్వరూపా గోవిందా, వేదోద్ధారా* *గోవిందా, వేద పురుష గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా. |* 


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: