9, నవంబర్ 2023, గురువారం

దౌత్య నైపుణ్యం

శు భో ద యం🙏


దౌత్య నైపుణ్యం! హంస  చాతుర్యం! 


                      తెలుగు సాహిత్యం అనువాదంతో  ప్రారంభమైంది. ఆకోవలోనే   కావ్యానువాదాలూ  నర్వహింపబడినాయి. శ్రీనాధమహాకవి  కాశీఖండాది  పురాణముల ననువదించుటయేగాక, శ్రీహర్షనైషధమును మూలమునకు వన్నెబెట్టుచు, కడుమనోహరముగా ననువదించినాడు. 


                          అందు నల-దమయంతుల నడుమ ప్రణయ రాయబారృనొనరించిన  హంస  పాత్రను కడుంగడు మెళకువతో తీర్చిదిద్దినాడు. ఆమెమాటలు నేర్చిన  హంస. కార్య సాధనకు దగిన వాక్ చాతుర్య మామె సొత్తు. అవసరమైనచో  యెంతటివారినైనను  తన మాటల మధ్యలో నిరికించి తనపని పూర్తిచేసికొను నుపాయమామెకు కరతలామలకము. ఆరాయంచ కార్యసాధనా నైపుణ్యమునకు ప్రతీకలైన    రెండుపద్యములను  మీకు పరిచయ మొనరింతును. చిత్తగిపుడు!చం: 


చం:  అడిగితి  నొక్కనాడు  కమలాసను   తేరికి   వారువంబనై  

         నడచుచు  నుర్విలో   నిషధనాధున  కెవ్వతెయొక్కొ భార్యయ 

         య్యెడునని, చక్ర  ఘోషమున నించుక  యించుక   గాని, యంత  యే 

         ర్పడ  విన నైతి; నీవ యని చెప్పిన చందము  దోచె, భామినీ! 


ఉ:    నిర్ణయ  మానృపాలునకు  నీకును  సంగతి ; యెల్లి   నేటిలో 

        దూర్ణము  చేయగాగలడు  తోయజసూతి; తదన్యధా  వృధా 

        దుర్ణయ  వృత్తికిన్   మనసుఁ దూర్చినయేని, జగజ్జనాప వా 

        దార్ణవ ముత్తరించుటకు   నాతని  కెయ్యది  తెప్ప? జెప్పుమా? 


                                ఈరెండు పద్యాలతో దమయంతిని కట్టిపారేసింది. యెటూమనస్సు త్రిప్పుకుంటానికి వీలులేకుండా!అదీచతురత! " బ్రహ్మగారు  నీకూ నలునకూ పెళ్ళి నిర్ణయించేశాడమ్మా! నేనడిగానొకనాటి ప్రయాణసమయంలో, చక్రాలరొదలో  స్పష్టంగా వినబడలేదుగానీ, నీపేరే చెప్పినట్లు గుర్తు. మీయిద్దరికీ ముడిపెట్టటానికి బ్రహ్మ ముహూర్తంగూడా పెట్టేశాడు. ఇప్పుడు నువ్వు నలుని కాదవ్నావనుకో బ్రహ్మగారు కుదేలే! లోకనింద సముద్రంకన్నా విశాలం. దానిని దాటటానికతనికి   తెప్పకూడా దొరకదమ్మా!(   ఇంత వరకూ బ్రహ్మ రాతకు తిరుగులేదనే జనుల యభిప్రాయం మారిపోతుంది. బ్రహ్మ రాతలన్నీ నీటిమూటలేృనని నలుగురూ నవ్వి పోతారు) అందు చేత నలుని మాత్రమే నీవు వరింతువుగాక! యనితనమాటతో దమయంతిని కట్టిపారేసింది! 

             

                       ఇదిగో  యిలాంటి అసమాన నైపుణ్యం  పింగళిసూరన  గారికావ్యం ప్రభావతీ ప్రద్యుమ్నం లోఉంది. అందులో 

"సుచిముఖి" అనేఓచిలుక  ప్రభావతీ  -ప్రద్యమ్నుల నడుమ  ప్రణయ రాయబారావ్ని నిర్వహిస్తుంది. అందుకే వాఙ్మయ పరిశీకులన్నారు" శ్రీనాధుని  హంసము, సూరనగారి  చిలుకకు గురుస్థానమున నిలచినదని". ఆవింత మరోసారి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: