*సహజస్థితి:*
➖➖➖✍️
*ఎవరైతే సమస్త సృష్టిలో సర్వవ్యాపిని చూడగలుగుతారో, వారికే ఆత్మ దర్శనం కలుగుతుంది.*
*ప్రతి మనిషిలో ముఖ్యంగా మూడు కోరికలు ఉంటాయి.*
1 జీవించాలి...! మరణం ఉండకూడదు!!*
*2,సంపాదించాలి...! మితం ఉండకూడదు!!*
*3.ఆనందించాలి...! హద్దులు ఉండకూడద.!! ఎవరైతే వీటిని దూరంగా ఉంచగలు గుతారో వారిని మానవాతీతులుగా భావించాలి.*
*మనిషి మొదటి నుంచి తాను ఉన్న స్థితిలో రాజీ పడలేక ఇంకా దేనికోసమో తపనతోనే జీవిస్తున్నాడు. అనంతాన్ని జయించాలన్న కోరిక ఒక్క మనిషిలోనే కనిపిస్తుంది.*
*‘మీరు ఇంకా ఒక్క గంట మాత్రమే బతుకుతారని ముందుగా తెలిస్తే, ఎలా ఉంటుందో... ఆ స్థితిలోనే జీవించాలి’ అంటారు ఆత్మ జ్ఞానులు.*
*ఆ రహస్యం తెలిసిన మరుక్షణమే తనకు సంబంధించినవన్నీ తనవారికి ధారాదత్తం చేయడానికి ఆ గంట వ్యవధి సరిపోదని బాధపడతాడు మనిషి. త్యజించాల్సిన శరీరాన్ని బతికించాలన్న తపనతోనే, విలువైన సమయాన్ని వృథా చేస్తాడు. కానీ తాను చేరుకోవాల్సిన సహజ స్థితి గురించి ఆలోచించడు.*
*కర్మ ఫలాల్ని జన్మ జన్మలుగా అనుభవిస్తున్నాడు. అయినా దేహం ఉండగానే విముక్తి కోసం సాధన మార్గం సుగమం చేసుకోలేక పోతున్నాడు.*
*రామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి, రమణ మహర్షి పొందిన సహజస్థితి, బుద్ధుడు పొందిన జ్ఞానోదయం...*
*ఇవన్నీ వారు అంతఃకరణాన్ని, ఇంద్రియాలను, సమస్త భోగ సామగ్రిని త్యజించి సాధించారు. ఆశారహితులై శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవించబట్టే అవి సిద్ధించాయి. మనిషి సహజ స్థితిని పొందడానికి సన్యాసం అవసరం లేదంటారు.*
*మరణం తరవాతే సహజస్థితి సిద్ధిస్తుంది అనేది అపోహ. వాస్తవానికి మనిషి నశించేవాడు కాదు, స్వేచ్ఛారహితుడు అంతకంటే కాదు. నిజమైన మనిషి అంటే ఆత్మ. ఆత్మ నిజస్వరూపం సచ్చిదానందం. అనంత ఆకాశంలో సర్వవ్యాపకమైన సర్వస్వాన్ని ప్రకాశింపజేసేదే సత్, చిత్, ఆనందం. నిత్యమైన, మరణం లేని, పతనం లేని పరమాత్మతత్వం ఇదే.*
*దాన్ని పొందడానికి చేసే సాధనలో ‘అహం’ అడ్డు పడుతూ ఉంటుంది. ‘అహం’ అనే ప్రవాహం మీద తేలుతూ సహజస్థితి చేరే సాధన చేయడం అసాధ్యం. అహం హద్దులు దాటి, దాని ఆద్యంతాలు తెలుసుకోవడానికి అంతఃచైతన్యమనే నిచ్చెన ఎక్కాలి. అప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. చైతన్య ఉన్నత స్థితిని చేరుకోవడానికి చేసే ప్రయత్నమే నిజమైన సాధన.*
*సూర్యుడి వేడికి సముద్ర జలాలు ఆవిరై, మేఘాలుగా మారతాయి. అవి హిమాలయాల ఎత్తుకు ఎగురుతాయి. ఆవిరి అణువుల నిజస్వరూపం సముద్రమే. తమ మూలస్థానమైన సముద్రాన్ని తిరిగి చేరడానికి ఆ అణువులు నిరంతరం తాపత్రయ పడతాయి. ఆకాశంలో సంచరిస్తూ తిరుగుతుంటాయి. సమయం రాగానే వర్షించి, అనంత సాగరంలో ఐక్యమై సహజస్థితికి చేరుకుంటాయి.*
*అన్ని నీటి బిందువులూ సముద్రాన్ని చేరనట్లే, ఎంత సాధన చేసినా కర్మఫల శేషం వీడిపోనిదే సహజస్థితి సిద్ధించదు. కర్మ బంధాలనుంచి విముక్తి పొంది, ఆత్మను గుర్తించి, ఇంద్రియాల పరిధిని అధిగమించడానికి చేసే ప్రయత్నం నిరంతరం కొనసాగాలి.*
*ఎవరైతే సమస్త సృష్టిలో సర్వవ్యాపిని చూడగలుగుతారో, వారికే ఆత్మ దర్శనం కలుగుతుంది. ఆ స్థితిని నిలబెట్టుకోవడమే యోగం.*
*భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, ఎంతో మంది తపోధనులు తమ యోగవిద్య ద్వారా, ఉన్నతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో అస్తిత్వ సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు.*
*తమ ఆధ్యాత్మికతతో అహం తాలూకు వాస్తవ స్వరూపం తెలుసుకొని, భవబంధ విముక్తులు అయ్యారు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🚩🙏*
*లోకా సమస్తా సుఖినోభవన్తు!*🙏
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి