4, జులై 2024, గురువారం

రథయాత్ర

 *ఈ నెల 7న పూరీ  రథయాత్ర*

ఆషాఢంలో సర్వం జగన్నాథం! ఆషాఢ శుద్ధ విదియ మొదలు ఏకాదశి వరకు పూరీ క్షేత్రంలో ప్రతిరోజూ పండుగే. కడలి ఉప్పొంగుతుంది. అలలు కొత్త కళను సంతరించుకుంటాయి. పూరీ కేంద్రంగా ఇలాతలాన్ని పాలిస్తున్న జగన్నాటక సూత్రధారి.. గర్భాలయం వదిలి.. వీధుల్లోకి కదిలి వస్తాడు. ఎక్కడా లేని విశేషం పూరీలో ఒకటుంది. ఏ హిందూ ఆలయంలో అయినా.. ఊరేగింపు సేవకు మూలమూర్తిని కదిలించరు. ఊరూరా ఉత్సవ విగ్రహాలే ఊరేగుతాయి. పూరీలో మాత్రం మూలమూర్తి రథం ఎక్కుతాడు. ఊరంతా తిరుగుతాడు. పది రోజులు ఆలయాన్ని విడిచిపెడతాడు. బలభద్ర, సుభద్ర సమేతుడై  రథయాత్రకు వేంచేసే జగన్నాథుడి మూలవిరాట్టు.. భక్తజన హృదయ సామ్రాట్టు.


పూరీ ఆలయంలో ఎన్నో విశేషాలు. ఇక్కడ స్వామి కొయ్యతో కొలువుదీరడం ఆశ్చర్యం. భక్తులను స్వయంగా వచ్చి అనుగ్రహించడం మరో అద్భుతం. పైగా సాధారణంగా ఏ ఆలయంలో అయినా ఊరేగింపు కోసం ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని వినియోగిస్తుంటారు. కానీ, పూరీలో మాత్రం జగన్నాథుడి రథ చక్రాలు మాత్రమే కాదు.. రథం కూడా ఏటా ప్రత్యేకంగా తయారవుతుంది.  రథయాత్రకు రెండు నెలల ముందు నుంచే రథ నిర్మాణ క్రతువు మొదలవుతుంది. వైశాఖ బహుళ విదియ రోజు రథ నిర్మాణానికి పూరీ సంస్థానాధీశుడు ఆదేశాలు జారీ చేస్తాడు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు.


అక్షయ తృతీయనాడు రథ నిర్మాణ పని మొదలుపెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలను సిద్ధం చేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. దీని ఎత్తు 45 అడుగులు. పదహారు చక్రాలు పూన్చిన జగన్నాథుడి రథాన్ని దర్శించుకున్న మాత్రాన పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఆ రథాన్ని లాగే అవకాశం దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఇక బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, పద్నాలుగు చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు పద్మ ధ్వజం. ఎత్తు 43 అడుగులు. చక్రాలు పన్నెండు. జగన్నాథుడి రథాన్ని పసుపు వస్త్రంతో అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని ఎర్రటి చారలుండే నీలి వస్త్రంతో కప్పుతారు. పద్మధ్వజాన్ని ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు.


కన్నుల పండుగ పహాండీ

విదియ నాడు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత విగ్రహాలను వారి వారి రథాలపై అధిరోహింపజేస్తారు. ఈ వేడుకను ‘పహాండీ’ అని పిలుస్తారు. తర్వాత పూరీ సంస్థానాధీశులు రథం ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. దీనిని ‘చెరా పహారా’ వేడుకగా చెబుతారు. తర్వాత పలు సంప్రదాయ క్రతువులు కొనసాగుతాయి. చివరిగా భక్తుల జయజయధ్వానాల మధ్య  రథయాత్ర మొదలవుతుంది. ‘జై జగన్నాథ.. జైజై జగన్నాథ..’ అంటూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. దీన్నే ఘోషయాత్ర అంటారు. జగన్నాథ ఆలయం నుంచి మూడుమైళ్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి రాత్రికి గానీ రథాలు చేరుకోవు. మూలమూర్తులను ఆ పూట రథంలోనే ఉంచుతారు.


మర్నాడు మేళతాళాలలో గుడిలోకి తీసుకెళ్తారు. గుండీచాదేవి.. జగన్నాథుడి పిన్నిగా చెబుతారు. ఆ ఆలయంలో స్వామి వారం రోజులు ఆతిథ్యం స్వీకరిస్తారు. తర్వాత ఆషాఢ శుద్ధ దశమి నాడు పూరీకి తిరుగు ప్రయాణం అవుతాడు. దీనిని బహుదాయాత్ర అంటారు. దశమి నాటి మధ్యాహ్నానికి పూరీ ఆలయానికి రథాలు చేరుకుంటాయి. రోజంతా ఆలయం వెలుపలే నిలిచి ఉంటాయి. తొలి ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలకంరిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ఉంచడంతో పూరీ  రథ యాత్ర ముగుస్తుంది.

కామెంట్‌లు లేవు: