4, జులై 2024, గురువారం

పెళ్ళిళ్ళ........సరదాలు

 🎊🎊🎊🚩పెళ్ళిళ్ళ........సరదాలు......సంబరాలు....🌷😃😃


👉🏿అల్లరి చేసే పిల్లాణ్ని అదుపు చేయడానికి తల్లి

‘ఒరే! నీ పెళ్లి చేస్తానుండు’ అని బెదిరిస్తుంది. అంతే!

వాడి అల్లరి అటకెక్కిపోతుంది. చేతులు కట్టుకుని మరీ

నిలబడతాడు. అదీ పెళ్లి అనే మాటకున్న శక్తి!

😂

👉🏿 పెళ్లి నూరేళ్ల పంట

అంటారు. ‘కాదు... కాదు నూరేళ్ల వంట’ అని కస్సుమంటారు ఆడవాళ్లు. అయినా పంట లేనిదే వంట ఎక్కడుంది? ఇదోరకం అద్వైతం.

👉🏿పెళ్లి సరసాలకు మూలం. సరదాలూ ఉంటాయి. ‘తాళి కడితే ఖాళీ’ అంటారు కొందరు. నిజమే దంపతులు ఒకరికొకరు మానసికంగా తమ సర్వస్వం ధారపోసుకోవడంతో ఖాళీ అయిపోతారు. ‘ఇతరులకు ఇందులో ప్రవేశం ఉండదు!’ గిలిగింతలకయినా, కౌగిలింతలకయినా ఒకరికొకరే.

👉🏿‘అప్పగింతలవేళ అమ్మాయికది ఆఖరి ఏడుపు. అబ్బాయికది ఆఖరు నవ్వు’ అంటారు విజ్ఞులు. తత్వం బోధపడితే ఏడుపైనా, నవ్వయినా ఒక్కటేగా. ఏడ్చినా నవ్వినా కన్నీళ్లే అయినప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు?

👉🏿

ఏదో ఒకటి లేదనేదే ఏడుపునకు మూలం. అది ఎంతోమందికి పెళ్లప్పటి నుంచే మొదలవుతుంది. అసలు సమస్య అదే!

👉🏿‘మా ఆయనకు నోట్లో నాలుక లేదు’ అని ఒకావిడ బాధపడిపోతుంటుంది. అది అనవసరం. సాక్షాత్తూ బ్రహ్మకే

నోట్లో నాలుక లేదు. ఆ నాలుక సరస్వతీదేవిది.

👉🏿'మా ఆయనకు హృదయం లేదు’ అని మరొకావిడ

పతిదేవుణ్ని తూలనాడుతుంటుంది.

అది అన్యాయం! విష్ణుమూర్తికే సొంతానికి హృదయం లేదు.

దానిని లక్ష్మీదేవి ఎప్పుడో ఆక్రమించేసింది.

👉🏿‘మా ఆయన ఒక్క అడుగు కూడా సొంతంగా వేయలేడు’ అని ఒక ఇల్లాలు బాధపడిపోతుంటుంది.

ఏం చేస్తాం? శివుడికే ఆ పరిస్థితి లేదు. అర్ధనారీశ్వరుడాయే!

ఒక కాలు పార్వతిదే. అదే ఆయన అవస్థ.

🚩ఇన్ని నిజాలు తెలిసీ భర్తల గురించి ఆడిపోసుకోవడం ఎందుకట అంటారు కొందరు పతులు.

సరికొత్త మానవపరిణామ సిద్ధాంతానికీ బాటలు వేసేది పెళ్లే.

👉🏿‘బ్రహ్మచారీ శతమర్కటః’ అన్నారు.

పెళ్లి కాగానే ఆ వంద కోతులూ మాయమైపోతాయి.

చెప్పింది వింటూ, పెట్టింది తింటూ బుద్ధిమంతుడిగా మారిపోతాడు వివాహితుడు.

👉🏿హెల్మెట్టూ భార్యా ఒకే రకం. నెత్తిన పెట్టుకుంటే తలకాయకు బోలెడంత భద్రత అని ఒకాయన స్వానుభవంతో ఉపదేశించాడు.

👉🏿పెళ్లి చేసుకొనుటయా? మానుటయా? అని ఈ రోజుల్లో బ్రహ్మచారులు తర్జనభర్జనలు పడుతున్నారు. అయినా పెళ్లి చేసుకొనుటే ఉత్తమంబు, ఉత్తమంబు.

👉🏿వెనకటికి మహాతాత్వికుడయిన సోక్రటీసును

శిష్యుడొకరు ‘గురూజీ పెళ్లి చేసుకొమ్మని మావాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. తమరి సలహా ఏమిటి?’ అని అడిగాడు.

ఆయనేమో ‘చేసుకో నాయనా’ అన్నాడు తాపీగా.

శిష్యుడు జుట్టు పీక్కుని ‘ఏంటి గురూజీ అలా అన్నారు?

మీ ఇంట్లో అమ్మగారు గయ్యాళి అని అందరికీ తెలుసు.

అయినా పెళ్లి చేసుకొమ్మని నాకు సలహా ఇస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.

దాంతో సోక్రటీసు ‘నాయనా! పెళ్లి చేసుకుంటేనే మేలు.

భార్య అనుకూలవతి అయితే గొప్ప భోగివి అవుతావు.

కాకపోతే గొప్ప తాత్వికుడివవుతావు. ఏదయినా మంచిదే కదా!’ అన్నాడు.

👉🏿దేవుడు ప్రతిచోటా తాను ఉండలేక తల్లుల్ని సృష్టించాడంటారు. మరి అదే దేవుడు భార్యల్ని ఎందుకు సృష్టించాడు?

ప్రతి ఇంట్లో పోలీసుల్ని పెట్టలేక భార్యల్ని సృష్టించాడు.

భార్యే లేకపోతే ఎన్ని అరాజకాలు? ఎన్నెన్ని ఘోరాలు?

ఎన్నెన్ని నేరాలు?

శాంతిభద్రతల పరిరక్షకురాలు ఇల్లాలే.

👉🏿ప్రతి ఇంటికి పెళ్లి ఇచ్చిన వరప్రసాదమే ఇల్లాలు.

అయినప్పటికీ ‘వివాహం ప్రకృతి, వివాదం వికృతి’ అని వెనకటికి ఒకాయన ‘పెళ్లి’కిలించాడు. కానీ ఈ వివాదం సంతోషం సృష్టించాలి. సంతోషం దాంపత్యానికి సగం బలం- కాదు కాదు సంపూర్ణ బలం.

ఎవరు గెలిచినా ఇద్దరూ గెలిచినట్టే.

👉🏿పండంటి కాపురానికి పది సూత్రాలు అంటారుగానీ ఈ ఒక్క ‘మంగళ’కరమైన సూత్రాన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు.

👉🏿భార్యాభర్తలన్నాక ఎక్కసక్కెమాడుకోకపోతే ఏం మజా?

‘కన్యాదాన సమయంలో మీ నాన్న నా కాళ్లు పట్టుకుని,

కడిగినప్పుడు నీకు ఏమి అనిపించింది?’ అని కొత్తగా పెళ్లయిన యువకుడు తన భార్యను అడిగాడు.

ఆమె తడుముకోకుండా ‘ఆయన వసుదేవుడిలా కనిపించాడండీ’ అంది నవ్వుతూ. దాంతో మొగుడు కంగుతిన్నాడు.

👉🏿ఆ మాటకొస్తే అతివ అంటే ఎక్కువగా మాట్లాడు వ్యక్తి అనేదే పిండితార్థం. పండితార్థం.

👉🏿మూడు ముళ్లయినా, ఏడు అడుగులయినా ముసిముసి నవ్వులకు మూలకందాలే. పూలు తలలో పెట్టినా, చెవిలో పెట్టినా పెళ్లి పెళ్లే!

దానికి సాటీ లేదు! పోటీ లేదు!


సమర్పణ

🙌 😃😃😀

కామెంట్‌లు లేవు: