10, అక్టోబర్ 2024, గురువారం

శ్రీ ఆది శంకరాచార్య చరితము 38

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము 38 వ భాగము*

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿


*వరాహ మతస్థుడు:*

లక్ష్మణుడను పేరుగల వరాహ మతస్థుడు లేచి శ్రీ ఆచార్య స్వామిని సమీపించి,'శ్రీ శంకర దేశికేంద్రా! నమస్కారములు!

మా మతమెట్టిదో దెలిపెద నాలకించుడు. ప్రళయ కాలమందీ భూమండ లము యావత్తు నీట మునిగి పోవుచున్నది. అప్పుడు పరాత్పరుడు దయామయుడై వరాహ రూపమెత్తి తన కోర కొనతో భూమిని పైకెత్తి యున్నాడు. అట్టి వరాహ స్వామివారి కోరలు చిహ్నములుగా ధరించి ఆ స్వామిని తదేక ధ్యానముతో ఉపాసించుడు. మేము కూడా అటుల జేయు చున్నారము. మాకు ఆయన అనేక విధము ల సాయపడుచు ముక్తి నిస్తున్నాడు. తప్పక మావలె ఉపాసించుడు' అని వివరించాడు.


శ్రీశంకరులు 'లక్ష్మణా! నాయనా! నీవన్నది ఎన్నటికినీ సత్యం కానేరదు. బ్రాహ్మణుడైన వాడెవ్వడు అట్లు చేయ కూడదు.ద్విజుడెప్పుడు కర్మనాచరించవలెను, తపస్సు చేయవలెను. సగుణారాధన చేయ దలచితివా ఉత్తమోత్త మమైన దేవుని ఆరాధించుము.  సగుణరూపంలో శివునిగాని, విష్ణువును గాని కడుభక్తితో పూజింపుము.  విప్రుడు విధిగా చేయదగుకర్మలు సంధ్యావందనా దులున్నవి. అవి చేయకున్న శిక్షలకు పాత్రుడవు కాగలవు! అట్లు సత్కర్మల నాచరించిన చిత్తం పరిశుద్ధమై మోక్షమునకు హేతువ గును' అని బోధించుటతో శంకరుల ఆజ్ఞను అనుసరించి లక్ష్మణుడు శ్రీశంకరపాదులకు ముఖ్య శిష్యుడై జ్ఞానార్జన చేయుచు తపస్సు చేసికొనుచు కడకు జ్ఞానియయ్యెను.


*లోకసేవక మతస్థుడు:*


కామకర్ముడను పేరుగల లోకసేవక మతస్థుడు ఒకడు శ్రీశంకరాచార్య స్వామిని జేరి నమస్కారము లర్పించి 'స్వామీ!మానవసేవయే మాధవసేవ యను ధర్మము చాల ప్రసిద్ధి కెక్కియున్నది. పరాత్ప రునకు రెండు రూపము లున్నవి. అందొకటి వృష్టిరూపం, రెండవది సమిష్టిరూపం. సమిష్టి రూపమైనది భూతకోటి. అట్టి సమిష్టిరూపము నకు సేవ చేసినచో పరాత్పరునకు సేవ చేసినట్లే యగుచున్నది. ఆ ధర్మమును మేమందరం నమ్మి లోకమునకు సేవ చేయు చున్నాము. అట్లు చేయుటవలన మాకు సత్యలోక ప్రాప్తి కలుగు చున్నది. అదియే మాకు ముక్తి. ముక్తి కలుగవలెనన్న ఇది యొక్కటే మార్గము' అని వివరించాడు.


శ్రీశంకరాచార్యులు ఆ మార్గమును విని, 'నాయనా! ఇటు వినుము! ఈ కనబడే లోకమంత అసత్యము, అనిత్యము. అట్టిదానిని సేవించిన, నిత్యమైన ముక్తి బడయలేము. నిత్యమైనవాడు, సత్య స్వరూపుడు పరాత్పరు డొక్కడే ఉన్నాడు. ఆయనసర్వాంతర్యామి శాశ్వతానంద స్వరూ పుడు. అట్టివానిని తెలిసికొని ఆయన్నే సేవించాలి. పరోపకార మనునది మానవుడు ఆచరించదగియున్న పెక్కు ధర్మములలో నొకటిగా నున్నది. అట్టి ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ప్రాకులాడడంతో మోక్షం రానేరదు. తత్త్వ విచారణ చేయ వలెను. తద్వారా జ్ఞానము నార్జించుకొన వలెను. జ్ఞాని కావడమే మోక్షము' అని వివరించారు.


కామకర్ముడు శ్రీ జగద్గు రువులు చేసిన బోధ విని, తన బుద్ధిని మార్చుకొని, శ్రీశంకరా చార్యులకు శిష్యుడై జ్ఞానార్జన చేయుచు సుఖముగ నుండెను.


*గుణోపాసకులు:*


గుణోపాసకులలోనుండి ఒకడు శ్రీశంకరాచార్యు ల కడకు జని, 'యతివర్యా! వందనములు! అనేక మతములను తమ మతములో లీనం చేసికొని తమ మతమునే ప్రతిష్ఠించు కొనుచున్నారు. మా మతమట్టిది గాదు వినుడు, వివరించె దను! సత్వరజస్తమో గుణములు మూడును లోకమందు ప్రధాన కారణమై వెలయు చున్నవి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గూడ ఈ మూడు గుణములు గలవారలై యున్నారు. వారి గుణముల నాధారముగ లోకము లను సృష్టించుచు, పరిపాలన చేయుచు, లయం చేస్తూ ప్రకాశించుచున్నారు. అందువల్ల ఈ త్రిగుణ ములు ప్రధాన కారణ మనుటకు ఆస్కారం కలిగినది. అందువలన మేమందరం ఈ త్రిగుణ ములనే ఆశ్రయించి గౌరవంతో ఉపాసించు చున్నాము.తాముగూడ మా వలెనే గుణోపాసన చేయుడు. అట్లొనరిం చిన అప్రయత్నముగ సర్వం సిద్ధించును' అని తెలియ జేసెను.


గుణోపాసకులు వివరించిన విధాన మంతయు శ్రీశంకర పాదులు విని, 'గుణములు ప్రకృతి నుండి కలుగుచున్నవి. ప్రకృతి సంబంధమైన ఉపాసన వలన ముక్తి కలుగదు. మీరాచరించు చున్నది తగినది కాదు. గుణోపాసన విసర్జించి తత్త్వ విచారణ చేయుడు. సర్వము మీరందు తెలిసి కొన గలరు’ అని చెప్పుటతో తమ మతమునకు స్వస్తి చెప్పి అద్వైత తత్త్వ విచారణ చేయుటకు ప్రారంభించి శ్రీశంకర పాదులకు శిష్యులై వేదవిహిత మైన కర్మలు చేస్తూ సుఖముగ నుండిరి.


*సాంఖ్య మతస్థులు:*


గుణోపాసకులు శ్రీ శంకరపాదులకు శిష్యు లయిన తరువాత, సాంఖ్య మతస్థులలో ఒక పెద్ద లేచి జగద్గురువుల కడ కేగి నమస్కారములర్పించి, 'స్వామీ! జగత్తునకు ఉపాదాన కారణం ప్రధానం. మనుస్మృతు లు మొదలైనవి ఉన్నట్లుగనే మా మతమునకు గూడ స్మృతి ప్రమాణము ఉన్నది. త్రిగుణ సామ్యస్థితినే ప్రధాన మందురు. అది మహత్తత్త్వములకు కారణం. ప్రధానము లోకమందు అఖండమై, అన్నిటికంటే గొప్పదై అవ్యక్తరూపంలోను, వ్యక్తరూపంలోను గలదు. సూక్ష్మమును, ప్రధానమును అవ్యక్త మందురు. స్థూలము, ప్రపంచమును వ్యక్త మందురు. మాచే ఆచరింపబడు ప్రధాన ఉపాసన వలన ముక్తి మాకు చాల అందు బాటులో గలదు. ఇది స్మృతి ప్రమాణము. కావున మా మతము అందరకు ఆచరణ యోగ్యముగ నున్నది. కావున తాము తప్పక మా మతమును స్వీకరించుడు' అని వివరించాడు.


శ్రీశంకరులు సాంఖ్య మతాశయమును విన్నారు. అంతట సాంఖ్యునితో, 'ఓయీ! నీవన్నదంతయు వేద విరుద్ధముగ నున్నది. స్మృతులు వేదములకు విరుద్ధముగ నుండ కూడదు. 'ప్రధానము' అనుచుంటివి! అది శబ్దం లేనిది. అందువల్ల అది జగత్కారణము కాదు. వేదమందు సర్వం చూచే శక్తి పరమాత్మకు గలదని చెప్పబడినది. నీవన్న ప్రధానం జడమై యుండి చూచే శక్తి లేనట్టిది. చైతన్య వంతమై పరబ్రహ్మ మొక్కటే జగత్కారణ మగుచున్నది. కావున వివేకంతో శ్రుతి వాక్యమును తెలిసి కొనుము' అని తెలియ జెప్పిరి. అంతట సాంఖ్యమతస్థుడు, 'నా శబ్దం ప్రధానం' అన్నందువల్ల శబ్దం లేక పోలేదు. అచింత్యము, అవ్యక్తము,అరూపము, అరసము, అగంధము, అనాది, అనంతము, మహత్తుకంటే పరమైనది ధృవమైనది, నిత్యమైనది, ఇట్టి గుణములు గలదానిని తెలిసికొనినవాడు మృత్యుముఖము నుండి బయటపడు చున్నాడు. ఇది శ్రుతి ప్రమాణము గదా! కనుక ప్రధానము లోకములన్నిటికి కారణమగుటకు సందియమే లేదు' అని అడ్డు పలికెను.


అంతట శ్రీ జగద్గురు వులు, ‘బుద్ధిమంతుడా! ప్రధానం ఉపాసించుట వలన జ్ఞానం కలుగదు. జ్ఞానం లేనిదే ముక్తి రాదు. జ్ఞానం కావలె ననెదవా ప్రధానోపాసన కట్టిపెట్టి అద్వైత తత్త్వమును తెలిసికొని శాశ్వతానందమును పొందుము' అనిబోధించెను.


అంతట సాంఖ్యుడు తనకున్న అజ్ఞానమును విడనాడి శ్రీ శంకర పాదులకు శిష్యుడ తత్త్వ జ్ఞానమును ఆర్జించుకొన్నాడు.


*కాపిల మతస్థుడు:*


కాపిలమతము లోని వాడొకడు లేచి శంకరుల కడ కరుదెంచి, 'యతీశ్వరా! నమస్కారములు! యోగమువల్ల ముక్తి లభించునని మా మత ధర్మము. ఇందులకు ప్రమాణము లనేకము లున్నవి. అదెట్లు లభ్యమగునో వచించెద నాలకించుడు. 'జనులు సంచరించని ప్రశాంత స్థలమందు సుఖాసీను డై, శుచియై, నడుము వంచక, మెడ నిబ్బరంగ  నుంచుకొని ఇంద్రియ వ్యాపారము నరికట్టి, అత్యంత భక్తితో గురువులకు నమస్క రించి, తన హృదయ మును నిర్మలముగ నుంచు కొని, అట్టి పరిశుద్ధ హృదయ మందు, ద్వంద్వా తీతుడు, కంటికి కన్పించనివాడు, మనస్సున కందరాని వాడు, అంతులేని రూపం గలవాడు, మంగళాకారుడు, ప్రశాంత మైనవాడు, అమృతస్వరూపుడు, బ్రహ్మ పుట్టువునకు కారణ మైనవాడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, చిదానం దుడు, నిరాకారుడు, నిర్గుణుడు, అద్భుత మైన రూపం గలవాడు, ఉమాసహితుడు, దేవాదిదేవుడు, ముక్కంటి, నీలకంఠుడు అయిన పరాత్పరుని నిలుపుకొని ధ్యానం చేయు తపశ్శాలి సకల భూతములకు మూలా ధారుడు,సాక్షీభూతుడుఅయిన పరాత్పరుని పొందుచున్నాడని యున్నది' కావున మా మతం అన్ని మతము లకన్న మిక్కిలి ఆదరణీయమై ప్రకాశించు చున్నది. జప విధానమంతయు వేరుగ శాస్త్రమందు చెప్పబడియున్నది. కావున ముక్తిని కోరు వారందరు విధిగా మా యోగమతమును స్వీకరించవలయును' అని వివరించెను.


శ్రీ శంకరాచార్యస్వామి యోగమత విధానము కపిలుడు చెప్పగా విని, 'ఓయీ! దహరోపాసన వేదమందు చెప్పబడి యెను. దానిచే ముక్తి కలుగునని యున్నది. కాని యోగో పాసన ముక్తికి హేతువని వేదములో తెలుపబడి యుండ లేదు. కావున యోగము ముక్తికి కారణం కానేరదు. జ్ఞానమే ముక్తికి హేతువు. జీవబ్రహ్మైక్య జ్ఞానం లభిస్తే ముక్తి వచ్చినట్లే. యోగమందు జీవబ్రహ్మఐక్య జ్ఞానం లేదు. 'సోహం,' 'శివోహం' మొదలైన అజపా మంత్రములను జపించుట వలన జీవాత్మకు పరమాత్మకు భేదం తొలగిపోవును. ‘ఆ పరమాత్మయే నేను’ అనునది జీవబ్రహ్మ భేదము. జపములు మోక్షము నియ్య జాలవు. అజపామంత్రం అట్టిది కాదు. ఆత్మను దర్శించవలెనన్న సర్వాత్మభావముండ వలెను. తనలో సర్వ భూతములున్నట్లు, సర్వభూతములలో తానున్నట్లు చూడవల యును. అట్టి అఖండ జ్ఞాన మెవనికి యుండునో వాడు పరమాత్మను పొంది నవాడగు చున్నాడు. షట్చక్ర భేదనాది యోగముల వలన ముక్తిరాదని వేదము స్పష్టముగ పలుకుచుండ అద్దానిని విడనాడి సాధన చతుష్టయ సంపత్తి గలిగి శ్రవణం మననం మొదలైన సాధనలను చేసి పరాత్పరుని తనలో చూడవలెను. అనగా తననుతాను పరమాత్మగా తెలిసికోవలెను. అదే అత్యంత పరమ జ్ఞానం. సన్న్యాసులు జ్ఞానం గలిగి సర్వసంగ పరిత్యాగం చేసి శుద్ధ సత్వబుద్ధితో ఉంటూ, ఆత్మతత్త్వ జ్ఞానామృతపానం చేస్తూ పరబ్రహ్మలగుచున్నారు. పరాంతకాలమందు పరామృత తత్త్వము నొంది సమస్త బంధము లనుండి విడివడి మోక్షమును పొందు చున్నారు. శ్రుతులు అట్టి విధముగ వినుపించుచున్నవి' అని బోధించారు. అంతట కాపిల మతస్థుడు,‘యతివర్యా పరిజ్ఞానమున్నవారు ఎవరూ మీవలె పలుకరు. ఖేచరీముద్ర అననేమో తెలియని వాడు 'నేను బ్రహ్మ జ్ఞానిని' అని పలికిన, వాని నాలుక తెగ గోయవలెను. గంగాయమునా సరస్వతీ నదుల సంయోగస్థానమైన (ఇడ, పింగళ, సుషుమ్న) త్రికూటము (భ్రూమధ్యస్థానము) తెలిసికొనక 'నేను బ్రహ్మనైతిని' అను వాని నాలుకను తుత్తునియ లు జేయవలెను. మేరుశృంగమును - సహస్రారమును తెలిసి కోకుండ 'నేనే బ్రహ్మను' అను వాని జిహ్వను చీల్చివేయవలెను. పూర్ణమండల మార్గము ద్వారా మనోన్మనీ స్వరూపాన్నితెలిసికొనకుండ 'నేను బ్రహ్మనైతిని' అని పలుకువాని నాలుకను ముక్కముక్కలుగా చేయవలెను. హృదయ మందు అంగుష్ఠ ప్రమాణములో ప్రకాశించుచున్న పరమాత్మ నెరుగక 'నేను బ్రహ్మనైతిని' అని చెప్పువాని నాలుకను ఖండ ఖండములుగ జేయవలెను. మహావిజ్ఞానఖని బాలునివలె, పిచ్చివానివలె, పిశాచము పగిది తిరుగాడును. అట్టి స్థితిని తెలిసికొనక 'బ్రహ్మమే నేనని' వచించువాని తల క్రింద పడునట్లు చేయవల సినదే. లయ యోగమును సాధించినవాడు పరమాత్మను పొందుచున్నాడు. ఇంకొక మార్గమేదియు కానరాదు. హఠయోగి కూడ సనాతనుడైన పరబ్రహ్మ స్థానమునే పొందు చున్నాడు. కావున యోగులు సదా ముక్తిని పొందుచున్నారు. ఇంకను ముక్తి హేతువు లైన యోగములు మెండుగా నున్నవి. కావున మీరందరు ముక్తిని బడయనెంచి యోగమును స్వీకరిం చుడు!' అని వివరించి నాడు.


శ్రీశంకరాచార్యస్వామి కాపిలుడు వివరించినది అంతయు విని 'ఓయీ! జ్ఞానమనిన ఎట్టిదో యెఱుంగక ఆ విధముగ నుడివితివి. యోగాభ్యాసము    వలన చిత్తశుద్ధి, ఏకాగ్రత అలవడును. చిత్తం బహు చంచల మైనది. దానికున్న గమనవేగం అగణ్య మైనది. వేలకు మించిన రెక్కలుగలది. విచిత్ర మైన పరుగులు వారును. అది సామాన్యముగ లోబడునది కాదు. చిత్తమును నిరోధించుటకు అష్టాంగ యోగములు ఉపయోగ పడునని యున్నదే కాని (ముక్తి మాత్రం రానేరదు) విజ్ఞానం కొరకు జెప్పబడి యుండలేదు. ఖేచరీ మొదలయిన ముద్రల వలన ముక్తి కలుగునని నీవన్నది విరుద్ధముగ నున్నది. ఆ ముద్రలు కూడ ఏకాగ్రత ను సాధించుట కొరకే ఏర్పాటు కాబడినవి. ఒక్క తత్త్వజ్ఞానం వలననే ముక్తి లభిస్తుందని వేదం వక్కాణిస్తూంది. మరియొక దానివలన రాదని వచించినది. వైదిక కర్మానుష్ఠానం ద్వారా కలిగిన చిత్తశుద్ది వివేకము, వైరాగ్యముశమదమాది సంపత్తిని కలుగజేయు చున్నది. ఆ విధంగా చిత్తశుద్ధిని పొందిన వాడు మోక్షం కోరినచో గురుముఖమున తత్త్వమస్యాది మహావాక్య శ్రవణం జేసి అందుండి స్రవించు జీవబ్రహ్మైక్య వేదాంత రహస్యామృతమును పానం చేయవలెను. అదియే మోక్షము' అని బోధించుటతో తెలివి నొంది శ్రీశంకరదేశికేంద్ర పదములకు కడుభక్తితో నమస్కరించి శిష్యుడై అద్వైతము నాశ్రయించెను. తరువాత పరమాణువాద మతమువారు శంకరులతో వాదించ నుద్యుక్తులయ్యారు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము 38 వ,భాగముసమాప్తము*

కామెంట్‌లు లేవు: