10, అక్టోబర్ 2024, గురువారం

మొదటి పెద్ద నవల

నేను చదివిన మొదటి పెద్ద నవల. దాదాపు 540 పేజీలు ఉన్న ఈ నవల ని నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు సంక్రాంతి సెలవులలో చదవడం నాకు గుర్తు. ఒక నవల చదువుతూ పడి పడి నవ్వడం అదే మొదటి సారి. 


మొత్తం మూడు భాగాలుగా ఉన్న ఈ నవలలో కథానాయకుడైన పార్వతీశం గోదావరి జిల్లా లోని మొగల్తూరు నుండి ఇంగ్లండ్ వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి భారత దేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాందించి కథ చివరిభాగంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటాడు. మొదటి భాగం చాలా హాస్యంగా నడుస్తుంది. రెండవ భాగంలో హాస్యం మరింత తగ్గగా, మూడవ భాగంలో తన పెళ్ళి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, పార్వతీశం ప్రకాశం పంతులు గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర్యోద్యమానికి ధార పోయడం, పలు మార్లు జైలుకి వెళ్ళడం ఉంటాయి. ఈ భాగంలో హాస్యం మరింత తగ్గుతుంది. 


ఈ పుస్తకం చదవడం వల్ల స్వాతంత్రానికి పూర్వ పరిస్థితులపైనా మనకు అవగాహన వస్తుంది. ఒక విధంగా ఇది మొక్కపాటి నరసింహశాస్త్రి గారి పాక్షిక జీవిత చరిత్ర అనుకోవచ్చు. ఇదే పేరుతొ ఈ నవలని సినిమా గా కూడా తీశారు. 1940లో విడుదలయిన బారిస్టర్ పార్వతీశం సినిమా తెలుగులో మొట్టమొదటి హస్యకథా చిత్రం. ఈ సినిమాకు ఎచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వం వహించారు.

కామెంట్‌లు లేవు: