12, అక్టోబర్ 2024, శనివారం

బొమ్మల కొలువు*

 *బొమ్మల కొలువు*



దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులలో బొమ్మల కొలువులను నిర్వహించే ఆచారం ఉంది. బొమ్మలను కొలువు తీర్చడానికి తొమ్మిది మెట్లున్న వేదికను ఏర్పాటు చేస్తారు.


ఎప్పుడు రాక్షసుల వలన లోకాలకు బాధ కలుగుతుందో అప్పుడు ఆ పాపాలను తొలగించి, రాక్షసులను అంతమొందించేందుకు నేను అవతరిస్తాను అని ఆదిపరాశక్తి పలికినట్లుగా మార్కండేయ పురాణంలో చెప్పబడింది.


లోక రక్షణ కోసం ఆ జగన్మాత పలు రూపాలలో పలు నామాలతో అవతరించి అనేకమంది రాక్షసులను సంహరించింది. శుంభ, నిశుంభ, చండ, ముండ, రక్తబీజ, దుర్గమ, అరుణాసుర, మహిషాసుర వంటి రాక్షసులను సంహరించి సకలలోకాలను ఆ జగన్మాత రక్షించింది. అట్టి జగన్మాతను ఆరాధిస్తూ జరుపుకునే నవరాత్రులే దేవీ నవరాత్రులు.


ఆశ్వీయుజ మాసం శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు ఉన్న తొమ్మిది రోజు లు దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రులను వాడుకలో దసరా పండుగ అని అంటారు. దేవీ నవరాత్రులతో పాటు దశమి కలిపితే దసరా, దసరా అనే పదం దశహరా నుంచి వచ్చింది. దశహరా అంటే దశవిధ పాపహరణం అని అర్ధం. అంటే పది రకాలైన పాపాలను హరించేది అని అర్ధం.


దేవీ నవరాత్రుల సందర్భంగా జగన్మాతకు వివిధ రూపాల్లో పూజలు చేయడం సంప్రదాయం. అంతేకాకుండా దసరా పండుగలో బొమ్మల కొలువులను నిర్వహించడం కూడా ఆనవాయితీ.


ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులలో బొమ్మల కొలువు లను నిర్వహించే ఆచారం ఉంది. సాధారణంగా బొమ్మల కొలువులను ఆలయాల్లోనూ, గృహాలలో ఏర్పాటుచేస్తారు. ప్రధానంగా మహిళలు, యువతులు బొమ్మల కొలువులను ఏర్పాటుచేసి నిత్యం పూజలు నిర్వహించడంతోపాటు ప్రతి రోజూ సాయంత్రం లలితా సహస్ర నామం వంటి దేవీస్తోత్రాలు చదివి పూజ లు నిర్వహించడంతో పాటు సాయంత్రం ముత్తయిదువులను పిలిచి పేరంటాలు నిర్వహించి, కుంకుమ, చందన తాంబూ లాదులు ఇవ్వడం ఆచారం.


బొమ్మలను కొలువు తీర్చడానికి తొమ్మిది మెట్లున్న వేదికను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా 3,5,7 మెట్లున్న వేదికలను కొందరు ఏర్పాటు చేసుకుంటారు.


అయితే జగన్మాత తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపా లను ధరించి దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేసింది అనేందుకు నిదర్శనంగా తొమ్మిది మెట్లున్న వేదికలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉన్న తర్వాతనే జననం జరిగి మనిషి ఈ భూమి మీదికి రావడం జరుగుతుంది. ఇది సృష్టి రహస్యం.


సృష్టి వెనుక ఉన్న ఈ రహస్యాన్ని వివరించేందుకే తొమ్మిది మెట్లను ఏర్పాటుచేస్తారని పండితులు చెబుతారు. దీనికితోడు తొమ్మిదిమెట్లను ఏర్పాటుచేయడం అనేది నవగ్రహాలకు ప్రతీకగా కూడా కొందరు పేర్కొంటారు.


తొమ్మిది మెట్ల పైన వివిధ దేవతా మూర్తులను కొలువుదీర్చి తొమ్మిది రోజులపాటు పూజలు చేయడంవల్ల నవగ్రహాల బాధలు తొలగి నవగ్రహాల అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు పేర్కొంటారు.


సాధారణంగా తొమ్మిది మెట్లలో పైభాగంలో ఉన్న మెట్టులో సృష్టి స్థితి లయలను కొనసాగిస్తూ ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతోపాటు జగన్మాతను కొలువు తీరుస్తారు. కృత, త్రేతా, ద్వాపర యుగాలనాటి దేవతామూర్తులను, పురాణ గాథలను తర్వాతి మెట్లలో అమరుస్తారు.


తర్వాత కలియుగంలోని మహర్షులు, పీఠాధిపతులు వంటి వారి బొమ్మలతో పాటు నిత్యజీవితంలోని వివాహం, తులసి పూజ, నాయకులు, ఆలయాలు ఉత్సవాలు, పిల్లలు ఆడుకునే సన్నివేశాలు, రైతులు, వ్యాపారులు, దుకాణాలు, వివిధ ఇంటి సామాగ్రి, పిల్లలు ఆడుకునే వస్తువులు వంటివాటిని ఉంచుతారు.


వీటికి తోడు మరపాచి బొమ్మలకు బొమ్మల కొలువులో ప్రత్యేక స్థానం ఉంది. ప్రధానంగా చెక్కతో చేసిన పెళ్ళి కుమారుడు, పెళ్ళికూతురు బొమ్మలను మరపాచి బొమ్మలు అని పిలుస్తారు.


ఈ విధంగా బొమ్మల కొలువులను నవరాత్రి ముందురోజు అంటే భాద్రపద బహుళ అమావాస్య నాడు ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు నుంచి అంటే ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు ప్రతిరోజూ వివిధ నైవేద్యాలు సమ ర్పించడంతోపాటు దేవీ స్తోత్రాలు, పాటలు గానం చేసి అమ్మ వారిని పూజిస్తారు.


తొమ్మిది రోజుల పూజ అనంతరము విజయదశమి నాడు సాయంత్రం పూజించి చివరగా బొమ్మలను శయనింపచేసి శయనోత్సవాన్నీ నిర్వహిస్తారు.


తర్వాత అంటే ఆశ్వీయుజ శుక్ల ఏకాదశి నాడు బొమ్మల కొలువులను ఉద్యాపన చేసి తీసివేస్తారు.


ఈ విధంగా బొమ్మల కొలువులను నిర్వహించడంవల్ల ఆ యా దేవతామూర్తుల, జగన్మాత కరుణాకటాక్షాలు ప్రసరించిచేపట్టిన పనులు అన్నింటిలో విజయం లభించడం అనే ఆధ్యాత్మిక ప్రయోజనంతో పాటు సామాజిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.


బొమ్మలకొలువు సమయంలో సాయంత్రం నిర్వహించే పేరంటాల వల్ల చుట్టుపక్కలవారు ఒకచోట చేరుతారు. ఫలితంగా పరస్పర సహకారం, సామాజిక ఏకత్వం అనే భావన వృద్ధిచెందుతుంది.


దీనికి తోడు పిల్లలు బొమ్మలు చూసేందుకు ఆసక్తిగా హాజరుకావడంవల్ల వారి మధ్య కూడా సహకార భావం ఏర్పడటంతో పాటు మన దేవతలు, ఆచారవ్యవహారాలు, సామాజిక కట్టుబాట్లు వంటివి వారికి తెలిసే అవకాశం బొమ్మలకొలువుల వల్ల కలుగుతుంది.


ఈ విధంగా ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగి ఉండటం వల్లనే బొమ్మల కొలువులు భారతీయతలో భాగమై తరాలు మారినా నిత్యనూతనమై వర్ధిలుతున్నాయి

కామెంట్‌లు లేవు: