12, అక్టోబర్ 2024, శనివారం

మన తెలుగు*

 🔔 *మన తెలుగు* 🔔


తెలుగు_కోతులం -   టెలుగు వినం - కనం - టెలుగూస్ గొప్పవాళ్లని అననే అనం

 

ఋగ్వేదంలో ఆంధ్రులున్నారు. రామాయణంలో సీతకోసం ఆంధ్రదేశంలో వెదకడం ఉంది. పోతన భాగవతం ప్రకారం బలి సంతానంలో ఆఖరివాడు ఆంధ్రుడే. యుధిష్ఠిర చక్రవర్తి పట్టాభిషేకోత్సవానికి హాజరైన రాజులలో ఆంధ్రరాజూ ఒకడు. పురాణమో, పుక్కిటపురాణమో.. ఒక లెక్కప్రకారం ఆంధ్రులంతా విశ్వామిత్ర మహర్షి సంతానమే. విశ్వామిత్రుడు విశిష్టిమైన వ్యక్తి. గురువునుమించి ఎదగాలన్న తపన  ఆయనది. ఎన్నో ఉద్యమాలకు ఆయన  స్ఫూర్తిప్రదాత.  సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపరవిధాత. త్రిశంకుస్వర్గనిర్మాత. గాయత్రీమంత్ర ఆవిష్కర్త. వంకాయ, టెంకాయ, గోంగూరవంటి విడ్డూరాలన్నీ ఆయన ప్రసాదాలే.  తెలుగువాడికి అందుకే అవంటే అంత ప్రీతి. దీక్ష.. కక్ష తెలుగువాళ్లందరికీ విశ్వామిత్ర మహర్షి నుంచే వారసత్వపు లక్షణాలుగా సంక్రమించాయేమోనని అనుమానం.  

రామాయణంలోని కిష్కింధ ఆంధ్రదేశంలోని ఓ అంతర్భాగమేనని  వాదన ఉంది. ఆ లెక్కన మనమందరం కిష్కింధవాసులమే! అన్నదమ్ముల మత్సరం వాలిసుగ్రీవులనుంచి అబ్బిన జబ్బేమో! వాయుపుత్రుడి లక్షణాలూ తెలుగువాడికి ఎక్కువే మరి!


స్వామిభక్తి తెలుగువాడికి మరీ విపరీతం. స్వామికార్యం తరువాతే వాడికి ఏ స్వకార్యమైనా. ఆరంభశూరత్వం, అత్యుత్సాహం ఆంధ్రుల గుత్తసొత్తు. చూసి రమ్మంటే కాల్చి వస్తేనే వాడికి తృప్తి! కొమ్మ తెమ్మంటే కొండను  పెకలించుకొచ్చాడంటే వాడు కచ్చితంగా తెలుగువాడే. ఆ రావడంలో కూడా ఆలస్యమవడం వాడి ప్రత్యేక లక్షణం. కోటిలింగాలు తెమ్మని రాములువారు  ఆజ్ఞాపిస్తే ఆంజనేయులుగారు ఏమి చేసారు? ఒకటి తక్కువగా తెచ్చుకొచ్చారు! ఆర్భాటంగా మొదలుపెట్టి అసంపూర్తిగా చుట్టబెట్టడం తెలుగన్నకు మొదట్నుంచీ అలవాటే!  స్వశక్తియుక్తులు మరొకడు పనిగట్టుకొని పొగిడితేగాని గుర్తెరగలేని బోళాతనం తెలుగువాడిది. సముద్రాలు లంఘించే శక్తిగలిగి వుండీ ఏ స్వామివారి పాదాల చెంతో విశ్రాంతి కోరుకోవడం తెలుగువాడికి అనాదిగా వస్తున్న బలహీనత.


'తెలుగువాడివి అన్నీ అవలక్షణాలేనా?' అని ఉసూరుమనుకోవాల్సిన అవసరం లేదు.  వనవాసంలో రామసోదరులను ఆదరించిన శబరితల్లి తెలుగుతల్లే! చేసిన ఘనకార్యం  చెప్పుకొనే  సంప్రదాయం అప్పట్లో లేదు. ఇంకెంతమంది కడుపునింపిందో  ఆ అన్నపూర్ణమ్మ తల్లి అందుకే మనకి తెలీదు. తెలుగుమహిళకు భోజనం వడ్డించడమంటే మహాసరదా కదా! పేరుకే అన్నపూర్ణమ్మ  కాశీ నివాసి. అసలు మసలేదంతా మన తెలుగునేల నలుచెరగులే కదా! డొక్కా సీతమ్మలు, మంగళగిరి బాలాంబలు అడుగడుక్కీ తారసిల్లే పూర్ణగర్భలండీ తెలుగురాష్ట్రాలు రెండూ!


ఉద్యమమైనా సరే.. ఉప్పు సత్యాగ్రహమైనా సరే సొంతముద్రంటూ లేకుండా తెలుగువాడు ఒక్కడుగు ముందుకు కదలడు. బౌద్ధాన్ని సంస్కరించి మరీ ప్రచారం చేసిన నాగార్జునుడు మన  తెలుగువాడే! తెలుగువాడికి కొత్తొక వింత. పాతొక రోత. అందాకా నెత్తికెత్తుకొన్న జైనం శైవం రాకతో హీనం అయిపోయింది! ఆనక వాడు వైదికం మోజులో పడ్డాక శైవం రాష్ట్రాల  శీవార్లలోకి పాతిపోయింది!


అటు ఆర్యులు.. ఇటు ద్రవిడులు! ఇద్దరూ ముద్దే మనకు! రెండు సంస్కృతుల పండుగలు  మనం సంబరంగా చేసుకొంటాం! పోతరాజు కృష్ణుణ్ణి తెలుగుదేవుడు చేసేసాడు. రామదాసు ఇక్ష్వాకులవాసిని సతీసోదరసమేతంగా భద్రగిరికి కట్టేసాడు.  కృష్ణరాయలు పాండిత్యప్రకర్షతో రంగధాముణ్ణి తెలుగుపెళ్ళికొడుకుగా తయారుచేసాడు. పాపయ్యశాస్త్రి భక్తిప్రవత్తులకు బద్ధుడైనట్లు బుద్ధభగవానుడు తెలుగు చిరునామా స్వీకరించాడు. అందరూ కావాలనుకొనే తత్వం తెలుగువాడిది. అయినా అతగాడే ఎవరికీ అక్కర్లేదు! భారతంలో తెలుగువాడి ఊసు ఆట్టే లేకపోయినా 'వింటే భారతమే వినాలి' అంటూ టాంటాం కొట్టుకొనే రకం తెలుగువాడు!


సాహసంలో మాత్రం? మనం వెనుకంజా? తైలంగ సామ్రాజ్యాన్ని స్థాపించాం. సుమిత్రా, జావా ద్వీపాల్లో వలస రాజ్యదీపాలను వెలిగించాం. సయాడోనిసిచయాల్లాంటి సుదూర ప్రాంతాల్లో నిబద్ధతతో బౌద్ధధర్మాన్ని ప్రచారం చేసి వచ్చాం. ఈజిప్టురాణికి చీనాంబరాలు కట్టబెట్టిన ఘనత మన  తెలుగువాడిదే! అజంతా, అమరావతి, సాంచి క్షేత్రాలలో అసమాన శిల్పకళావైభవాన్ని సృజించిన కళాతపస్వి మన తెలుగుయశస్వి. ధాన్యకటక విశ్వవిద్యాలయం స్థాపించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన గురువులు మన తెలుగువారు. మానవ నాగరికత మణికిరీటంలో నిరంతరం వెలుగులు చిమ్మే కోహినూరు వజ్రాలు కదుటండీ మన తెలుగువారు!


మేధస్సులో మాత్రం మనమేమన్నా అధమస్థులమా?హైందవం క్షీణదశలో దక్షిణాది గోదావరీతటం నుంచే మహాతత్త్వవేత్త శంకరాచార్యులు ప్రభవించించింది. స్వధర్మ పునరుత్థనార్థం జన్మించిన పుణ్యమూర్తి విద్యారణ్యుడూ తెలుగు పురుషుడే! ఆయన తోడాబుట్టిన సాయనుడు వేదాలకు  భాష్యం చెప్పిన ఉద్దండుడు.  ఉత్తరాది కావ్యాలకు  వ్యాఖ్యానాలు చేసిన మల్లినాథుడుది తెలుగునాడు. జగన్నాథ పండితరాయలు హస్తిన ఎర్రకోట యవనసుందరి అంకపీఠంపైన తెలుగుప్రతిభను సుప్రతిష్ఠంచిన ఘనుడు. దేశదేశాల తాత్వికకేతనం విజయవంతంగా ఎగురువేసిన తెలుగు జ్ఞాననికేతనం రాధాకృష్ణ పండితుడు.


– కర్లపాలెం హనుమంతరావు గారి సరదా వ్యాసం


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: