42. " మహాదర్శనము "-- నలభై రెండవ భాగము---వారుణీ విద్య
42 . నలభై రెండవ భాగము-- వారుణీ విద్య
పంచాత్మ సంక్రమణ విద్యను గురించి ఆచార్యులు చెప్పదొడగినారు . " యాజ్ఞవల్క్యా , సావధానముగా ఉన్నావా ? అని అడిగినారు . సావధానముగానే కూర్చున్న కుమారుడు , ’ సిద్ధముగా ఉన్నాను , అనుజ్ఞ ఇవ్వవలెను , తమరు అనుమతి నిచ్చినట్లే , చెప్పువాడు ఆదిత్యుడు అన్న భావనము చేసుకొని మన ఇద్దరికీ రక్షణను ఇవ్వమని వేడితిని . " అన్నాడు .
ఆచార్యులు ’ సరే ’ యని ఆరంభించినారు . " మొదటిది అన్నమయ దేహము . దీనిని సాక్షాత్కరించుకో . అప్పుడు ఈ దేహపు ప్రతిబింబము నీ ఎదురుగా కూర్చొనును . ఇదేమిటి , ఒక దేహము రెండయినది అనుకోవద్దు . బయటి ఆకాశములో లయమగుచున్న నీ దృష్టి ఇప్పుడు దేహపు పక్కన ఉన్న ఆకాశములో నీ తపోబలముచేత వెనుతిరిగి నీ దేహమునే చూచును . కాబట్టి నీకు ఈ రెండవ దేహము కనిపించును . అన్నమయ కోశమును దాటుట అనగా అదే . "
" ఔను , రెండవ మూర్తి యొకటి కనిపిస్తున్నది . అలాగే అక్కడున్న అంగాంగములన్నీ స్ఫుటముగా కనిపించుచున్నవి . నఖ శిఖ పర్యంతమూ స్పష్టముగా కనబడుచున్నది . "
" ఆ మూర్తికి పూజ చేసి , ముందుకు దారి ఇవ్వమని ప్రార్థించు "
యాజ్ఞవల్క్యుడు ఆ మూర్తికి పూజను సలిపి దారి ఇవ్వమని ప్రార్థించినాడు . అప్పుడు ఆ మూర్తి జ్వాలామయమయినది . ఒక ఘడియ లాగే ఉండి మరలా శ్యామ సుందరమై మూలాధారము నుండీ కంఠము వరకూ ఒకే పంక్తిలో నున్న ఐదు జ్వాలలై దర్శనమిచ్చినది .
పక్కనున్న ఆచార్యులు , " అదే , చూడు ప్రాణమయ కోశము . దానికి పూజ చేసి , తన క్రియా కలాపములను చూపించమని వేడుకో . " అన్నారు . యాజ్ఞవల్క్యుడు అలాగే చేసినాడు .
జీర్ణమైన రావి ఆకు వలెనున్న ఒక చిత్రము కనిపించినది . దేహపు సీమారేఖల మధ్య పందిరి వలె కన్నులు కన్నులుగా పరచుకున్న నరమండలము . ఆ నరమండలపు మధ్య నీలము , తెలుపు , నలుపు , ఎరుపు , పసుపు రంగుల దీపములు . ఆ దీపముల ప్రభ విశ్వతోముఖముగా పరచుకుంది . ఒక్క క్షణము కూడా విచ్ఛితి లేక , ఆ దీపముల ప్రభ మంద్రముగా నున్ననూ ఖచ్చితముగా వెలుగుతున్నది .
" ఇక్కడి వరకూ మానవులకు యాతాయాతములుండును . అక్కడ నీలపు వర్ణముతో వెలుగు చల్లుతూ కూర్చున్నాడే , అతడే వ్యానదేవుడు . అతడే దేహమునందు జరుగు సర్వ కార్యములకూ కర్త. దేహి నిద్రకు వశుడైనపుడు కూడా దేహములో మెలకువగా ఉండి , శ్వాస నిఃశ్వాసలు మొదలు ఆహార పచనాంతము వరకూ అని కర్మలనూ చేయించువాడీతడు . ఇతనిని పట్టుకుంటే ప్రాణ పంచకమూ సునాయాసముగా చేతికి చిక్కును . కాబట్టి అతనికి మొదట పూజ చేసి , ముందుకు పోవుటకు అతని అనుమతిని వేడు."
వ్యాన దేవుడు పూజగొని ప్రసన్నుడై తన అనుజులైన ప్రాణ , అపాన , సమాన , ఉదానులను పరిచయము చేసినాడు . " చూడు , ఇతడు ప్రాణ దేవుడు . దేహాద్యంతమూ వేడిమి యుండుటకు కారణమితడు . ఈతడు బయటి నుండీ వచ్చిన సర్వమునూ గ్రహణము చేయును . ఇక, ఇతడు అపాన దేవుడు . దేహమునుండీ బయటికి వెళ్ళు ప్రతియొక్క దానికీ దేహపు గమనమునకూ కారణము . తరువాత ఈతడు సమాన దేవుడు . ఇతడు , జీర్ణమైన ఆహారమును మూడు భాగములు చేసి స్థూలముగా ఈ దేహమునకు అవసరము లేనిదానిని బయటికి పంపమని అపాన దేవుడి వశము చేయును . ఇంక రెండు భాగములలో ఒకభాగమును దేహమునకు , ఒక భాగమును మనసుకూ ఇచ్చును . ఇక ఈతడు ఉదాన దేవుడు . దేహములో కలుగు శబ్దములకన్నిటికీ కారణమైన ఇతడు సరస్వతీ వ్యూహము ద్వారా పలికిస్తూనే ఉండును . ఈతడు ప్రసన్నుడైతే , నువ్వు ఋషివై వేదమంత్రములను పలికెదవు . ఈతడు పరమాకాశములో నున్న సరస్వతిని పిలుచుకు వచ్చి వర్ణాత్మకురాలుగా చేయగలడు . అందరి పరిచయమునూ చేసినాను . ఇంకేమి కావాలో చెప్పు . "
" తామందరికీ పూజ చేయు విధానము ఎలాగన్నది చెప్పవలెను . "
" ఇప్పుడు నువ్వు ముందుకు బయలు వెడలినావు . దారిలో నిద్రించుట సరికాదు . కాబట్టి మా అందరినీ సమిష్టిగా పూజించి మా అనుమతి పొంది ముందుకు వెళ్ళు . మేము ఇంతవరకూ నీలో ఉండి , నీ అర్చనాదుల వలన తృప్తులమైనాము . "
యాజ్ఞవల్క్యుడు సమిష్టిగా ప్రాణదేవులకు పూజ సలిపినాడు . ఐదుగా ఉన్న రత్న దీపములు ఒకటై హృదయములో నిలచి పూజను ఒప్పుకొని ప్రసన్నమై అనుమతినిచ్చినవి .
దేహపు రూపు రేఖలు అలాగే ఉన్నవి . దానిలో కనిపించిన రావి ఆకు వంటి జాలము అక్కడే ఉంది . ఆచార్యుడు అన్నాడు , " కుమారా , అన్నమయములో ప్రాణమయము అంటే ఇంకేమో కాదు , అన్నమయము నంతా నిండిన పురుషుడు అని గుర్తెరిగితివా ? అలాగే , ఈ ప్రాణమయ కోశము నంతా నిండిన మనోమయ కోశమును చూడు . "
ప్రాణదేవుడు దారి ఇచ్చినాడు . చంద్ర మండలమువలె శాంతమై తెల్లగా ఉన్న జ్వాల యొకటి హృదయదేశములో కనిపించినది . అది రెండు భాగములైనది . ఒకటి ప్రాణమయ కోశము వైపుకు పోయి , ఇంద్రియ గోళములలో ప్రాణముతో పాటు కూర్చుంది . ఇంకొక భాగము దేహాద్యంతమునూ వ్యాపించినది . పంచ ప్రాణముల నుండీ వస్తున్న వెలుగు వలెనే ఉన్ననూ , ఈ వెలుగు అది కాదనునది తెలుస్తున్నది . అలాగని , ఇదివేరే యని దానిని వేరు పరచుటకూ లేదు .
ఆచార్యులు అన్నారు , " అదే , మనోమయ కోశము . దానికి పూజాదులు చేసి , పరిచయమును కోరు "
మనోమయము కుమారుడిచ్చిన పూజను గ్రహించి ప్రసన్నముగా పలికింది , " చూడు , నాలో రెండు జ్వాలలున్నదానిని , లేదా నేను రెండు భాగములైన దానిని చూచితివి కదా ? మనస్సర్వము , మనోతీతము యని నాకు రెండు రూపములు . మనస్సర్వము ఇంద్రియాదులను ఆశ్రయించుకొని యున్న బహిర్ముఖము . మనోతీతము ఇంద్రియములకు అతీతమై దేహములో ప్రాణుడితోపాటు వ్యాపారము చేయుచుండును . మనస్సర్వమును కట్టివేస్తే , మనోతీతపు పరిచయమగును . ప్రాణవాహినియై మనోతీతము లోకములన్నిటా సంచరించి రాగలదు . ఈ మనోతీతము యొక్క సన్నిధిని సాధించి యోగులు నానాత్వము యొక్క రహస్యమును ఛేదించి , కాల , దేశ వర్తమానములను గెలిచి , తాము ఎక్కడ కావాలంటే అక్కడ , ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసిన రూపములను తీసుకొని కావలసిన వ్యాపారమును చేయగలరు . అయితే అలాకావలెనన్న , నన్ను అతిక్రమించకుండా సాధ్యము కాదు . "
" దేవా , నువ్వు సర్వ శక్తుడవలె నున్నావు . ఇటువంటి నిన్ను అతిక్రమించి వెళ్ళుట సాధ్యమా ? "
" లోకములో అసాధ్యమనునదే లేదు యాజ్ఞవల్క్యా , కాలమూ , కర్మమూ అంతటినీ పాకము చేయుచుండును . సర్వమూ తలకిందులు అగుచుండును . ఇలా ఉన్నపుడు అసాధ్యమెక్కడిది ? రెండు గీతల కథ విన్నావా ? ఒకటి చిన్నది కావలెనంటే ఇంకొకటి పెద్దదయితే చాలు . అలాగే అసాధ్యమును చిన్నది చేయుటకు వీలయితే , అప్పుడది సాధ్యమగును . అలా అగుటకు నీ సంకల్ప పూర్వకమైన ప్రయత్నము సతతముగా జరుగవలెను . దానికి నా అనుగ్రహము కావలెను . అయితే , నాకునేనుగా నీకు ఏమీ ఇవ్వలేను . వెనుకటిది ప్రేరేపించినట్లు ముందుదానిని చేయుటయే నా పని . కాబట్టి నా వెనుక ఉన్నవాడిని చూడు . "
యాజ్ఞవల్క్యుడు చూచినాడు . ఆదిత్యుడు ప్రసన్నముగా విరాజమానుడై యున్నాడు . తాను అహర్నిశలూ ఉపాసన చేయుచున్న ఆదిత్యుడు, మనఃప్రేరకుడు , వెనుక తాను చూచినది జ్ఞాపకము వచ్చెను . ఆదిత్యుడు , " ఔనౌను . మనసును ప్రేరేపించువాడిని నేను . ఈ మనోదేవుడే అవస్థా త్రయమునకు కారణుడు . నీ ప్రయత్నము ఎక్కువయితే , ప్రాణమయ , అన్నమయములు రెండూ ఆ ప్రయత్న రాశిని వహించలేనంతగా అది పెద్దదయితే అప్పుడు మనోమయమును ప్రార్థించెదవు . మనోమయుడు వెనుకకు తిరుగును . అంటే , దాని అర్థము , నా కిరణములలో మునుగును . అప్పుడు సుషుప్తి యగును . అక్కడ జీవుడు ఏమీ చేయుటకు లేదు , కాబట్టి యాజ్ఞవల్క్యా , నీవు ఇతడిని బాగుగా ఆరాధించు . ఈతని ప్రసాదమును పొందు . అప్పుడు ఇతడు నిన్ను ముందుకు వదలును . "
ఆదిత్యుడు అంతర్థానమగుతుండగనే ప్రసన్నమైన , మందహాసపు మృదువైన గలగలారావము విని కుమారుడు అటు తిరిగినాడు . మనోదేవుడు ఇప్పుడు మూర్తియైనాడు . సింహాసనము పైన కూర్చున్న మకుట ధారి యైనాడు . మొదటి చాంచల్య భావము లేదు . ఒక్కచోట నిలవకుండా అలలవుతున్న వెలుగు ఇప్పుడు మూర్తియై కూర్చున్నది . యాజ్ఞవల్క్యుడు మరలా పూజను సమర్పించి , " దేవుడు ప్రసన్నుడు కావలెను . ముందరి ప్రయాణము అనుకూలము కావలెను " అని ప్రార్థించినాడు .
మనోదేవుడు అన్నాడు , " నీకు ముందరి ప్రయాణమునకు అనుకూలము కావలెననియే దేవతలు నిన్ను సర్వజ్ఞులైన ఉద్ధాలకుల వద్దకు పిలుచుకు వచ్చినది . చూడు యాజ్ఞవల్క్యా , అతడక్కడ సంకల్పిస్తున్నాడు , ఇక్కడ క్రియ నడచుచున్నది . నేను శుద్ధ చంచలుడను . నీటికన్నా , గాలికి చిక్కిన లేత చిగురు కన్నా చపలుడను నేను . నా చాపల్యమును పోగొట్టు ఉపాయమేదో తెలుసునా ? ఆదిత్య దర్శనము చేయుట . నువ్వింతవరకూ ఆదిత్యుడి దర్శనము చేసి అతడిలో ఉన్న సావిత్ర కిరణమును హృదయములో నింపుకొనుచుంటివి కదా ! దానివలన నేను ఇప్పుడు అచలుడనై దర్శనము ఇచ్చినాను . ఇదిగో , నువ్విక ముందుకు పోవచ్చు . ఇదివరకూ దేహములో ప్రాణమయ కోశమును చూచినావు . అన్నమయ , ప్రాణమయములలో నిండిన నన్ను కూడా చూచినావు . ఇక , నావలెనే అన్నమయ , ప్రాణమయములలో నిండిన బుద్ధి దేవుని చూడు . "
మనో దేవుడు తన సింహాసనముతో పాటూ అంతర్థానమయినాడు . అతని స్థానములో ఇంకొక సింహాసనములో ఒకతడు కూర్చున్నాడు . అతనికి శరీరము సగము తెలుపు , సగము నలుపు . యాజ్ఞవల్క్యుడు అతడికి పూజను సలిపినాడు . ఆతడు పూజను ఒప్పుకొని , " నేను కూడా నీ దేహములో ఉండవేవాడినే . అయితే నువ్వు నన్ను చూచి ఉండలేదు . నేనే నీ బుద్ధిని . మనోవ్యాపారములు ఒక్కొక్కదానిలోనూ నా పనితనము ఉంటుంది . మనసు వెనుక వెనుకే ఉన్న నన్ను బహు కష్టపడి అర్ధార్ధముగా చూచినవారు లేకపోలేదు . అయితే , నీవలె నన్ను ప్రత్యేకించి చూచువారు బహుకొద్ది మందే . నువ్వు యోగ్యుడవని , నీకు లభించిన జ్ఞానమును దురుపయోగ పరచేవాడివి కావని , నీకు ఒక రహస్యమును చెపుతాను విను . ఈ నా ధవళ కృష్ణ రూపమును చూచుచున్నావు కదా , ఇది శుద్ధ శ్వేత వర్ణమయినపుడు నా అనుగ్రహమయినది అని తెలుసుకో . ఇదిగో చూడు . ఈ కృష్ణ రూపములో ఉండి ఈ భాగము కృష్ణమగుటకు కారణమైన వాడు అహంకారుడు . ఆ అహంకారుడు శుద్ధుడైనపుడు ఈ భాగము కూడా తెలుపగును . ఈ అహంకారము అభివృద్ధి కాకుండా చూచుకొనేదే వైరాగ్యము . మానవుడు తాను చేయు ప్రతియొక్క కార్యము వలనా పెరుగు అహంకారమును పెరగనివ్వకుడా ఉండునదే వైరాగ్యము . ఇలాగ వైరాగ్య సంపన్నుడైన వాడే నన్ను దాటుటకు సమర్థుడు . నువ్వు నన్ను అడగనవసరము లేదు . నేనే దారి ఇస్తాను , ముందుకు వెళ్ళు . "
ఆచార్యులు ధ్యాన మగ్నులైయున్నారు . వారి నోటి నుండీ ఏమాటా రావడము లేదు . అయినా ఊపిన ఉయ్యాల ఎవరు ఊగకున్ననూ తానుగా ఊగుతున్నట్టే అయినది . యాజ్ఞవల్క్యుడు ముందుకు సాగాడు . దేహములో కనబడుతున్న రూపు రేఖలన్నియూ మసిబారినాయి . విశాలమైన బయలు ప్రదేశమొకటి . అక్కడ ఏమీ లేదు . ఒక ఓంకారపు ధ్వని మాత్రము వినిపిస్తున్నది . దాని మూలమెక్కడుందో అది మాత్రము తెలియుట లేదు . ఏదో విచిత్రము . అక్కడ అంతా విచిత్రమే అనిపిస్తున్నది . తనను పట్టిఉండిన నామరూపములు కరిగి సూక్ష్మాత్ సూక్ష్మమైనవి . అక్కడ ఏ దృష్టి ప్రసరిస్తున్నదో చెప్పుటకు అగుట లేదు . ఏ చెవులు వింటున్నవో అదికూడా తెలియుటకు లేదు . ఎలా తెలియునో అది కూడా తెలియదు . అక్కడ కుమారునికి అర్చనాదులు పొందినట్లయింది.. అంతే కాదు తాను ప్రత్యేకముగా ఒకడినున్నాను అన్న భావనయే కరగి పోతున్నది . అక్కడ చెవులు లేకున్నా వినిపిస్తుంది , కన్నులు లేకున్నా కనిపిస్తుంది .మనసు లేకున్నా తెలుస్తుంది . ఎక్కడ ఎవరో అంటున్నట్లుంది , :
" జగమునకు కారణుడను నేను . చూడు , ఇక్కడికి వచ్చినవాడు ఉదయించిన సూర్యుని వలె పైకి వచ్చినవాడు. ఇంక పతితుడు కాకుండా చూచుకో . మనోబుద్ధుల వ్యాపారము నిలచినపుడు నేను ప్రకటమగుదును . నన్ను ఆశ్రయించియే సర్వమూ బ్రతికియున్నది . ఈపూటకు ఇంత చాలు "
యాజ్ఞవల్క్యుడు తన ప్రయత్నము లేకనే వెనుతిరిగి వచ్చినాడు . అతడు కళ్ళు తెరచు వేళకు ఆచార్యులు కూడా గురు దేవా అంటూ చేతులు జోడిస్తూ కళ్ళు తెరచినారు . ఇద్దరూ ఒకరినొకరు చూచుకొని నవ్వినారు .
Janardhana Sharma
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి