21, డిసెంబర్ 2025, ఆదివారం

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము*

*సరళ వ్యావహారిక భాషలో...!*


* 597వ రోజు*


అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము


ధర్మరాజు

అగ్నిదేవుడు సుదర్శన

అగ్నిదేవుడికి సుదర్శనకు ఒక కుమారుడు కలిగాడు. అతడికి సుదర్శనుడు అను నామకరణం చేసాడు. అతడు సుగుణసంపన్నుడు ధర్మపరుడు. సుదర్శనుడు పెద్దవాడై తాతగారి రాజ్యభారమును వహించి రాజ్యపాలన చేయసాగాడు. సుదర్శునుడికి వివాహమై ఒక కుమారుడిని పొందాడు. అతడి పేరు ఓఘవంతుడు. ఓఘవంతుడికి ఒక కుమార్తె ఓఘవతి ఒక కుమారుడు ఓఘరధుడుకలిగారు. ఓఘవతికి వివాహ వయసురాగానే ఆమెకు తగిన వరుడి కొరకు వెతికి చివరకు తాతగారైన సుదర్శనుడితో వివాహము జరిపించారు. ఓఘవతిని చేపట్టిన సుదర్శనుడు " నేను గృహస్థధర్మమును పాటిస్తూ మృత్యువును జయిస్తాను " అని ప్రతిజ్ఞ చేసాడు. తరువాత అతడు కురుక్షేత్రముకు వెళ్ళి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని భార్య ఓఘవతితో గృహస్థ జీవితం కొనసాగించాడు. ఒక రోజు సుదర్శనుడు భార్యతో " ఓఘవతీ ! నాకు అతిథి పూజలంటే మక్కువ ఎక్కువ. అందు వలన నేను గృహంలో ఉన్నా లేకున్నా ! నీవు మాత్రము అతిథి మర్యాదలు చేయాలి. ఎందుకంటే ఎవరి ఇంట్లో అతిథి తన కోర్కెలు తీర్చుకుంటారో ఆ గృహస్థు కృతార్ధుడు ఔతాడు. మన ఇంటికి వచ్చిన అతిథి ఏకోరిక కోరినా నీవు ఆ కోరిక సంకోచించచక తీర్చాలి. పతి ఆజ్ఞ నెరవేర్చడమే సతికి ధర్మము కదా ! " అని అన్నాడు. భర్త మాటలకు ఓఘవతి అంగీకరించింది. సుదర్శనుడు సమిధల కొరకు అడవికి పోయిన సమయంలో వారి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఓఘవతి అతడికి అతిథి మర్యాదలు చేసింది. అతడు ఓఘవతి వంక మోహంతో చూసి " లలనా ! నా మనసు నీ అందు లగ్నమైనది కనుక నీవు నా కోరిక తీర్చు. అతిథి మర్యాద చేయడమూ అతడి కోరిక తీర్చడము ధర్మము కదా ! నీకు తెలియనిది ఏమున్నది. అది నీధర్మమని నీభర్త నీకు చెప్ప లేదా ! " అన్నాడు. ఓఘవతి " మహానుభావా ! మీరు మరే కోరిక అడిగినా తీరుస్తాను " అన్నది. కాని అతడు " లలనా ! నాకు మరే కోరికా అవసరం లేదు " అన్నాడు. ఓఘవతి " తన భర్తమాట గుర్తుకు వచ్చి భర్తమాట నెరవేర్చిన తన శీలం పోతుంది. తీర్చక పోతే తన భర్తమాటలను ఉల్లంఘించినట్లౌతుంది అనుకుని చివరకు అతడి కోరికకు అంగీకరించింది " ఇంతలో సుదర్శనుడు తిరిగి వచ్చి ఓఘవతిని పిలిచాడు. అతిథి ఓఘవతిని మాట్లాడకుండా కట్టడి చేసాడు. ఆ బ్రాహ్మణ అతిథి శాపానికి భయపడి ఓఘవతి మాటాడక ఊరకున్నది. భార్య ఎంతకీ పలకనందున సుదర్శనుడు పర్ణశాలలోకి తొంగిచూసి ప్రేమగా ఓఘవతిని పిలిచాడు. బ్రాహ్మణుడు లోపల నుండి " ఓ యజమానీ ! నీ భార్య నాకు అతిథి సత్కారము ఇస్తుంది. నీకు గృహస్థధర్మాలు అతిథి సత్కారాలు తెలుసు కనుక కోపించకుము " అన్నాడు. అప్పుడు సుదర్శనుడు లోపల ఉన్న " అతిథితో మహాభాగా ! నీకు ఆతిథ్యము ఇచ్చినందు వలన నా జన్మధన్యము అయింది. అతిథి పూజలు నిర్వహించే గృహము ధన్యము పవిత్రము అంటారు కదా ! అతిథిపూజ అయ్యేంత వరకు నేను వెలుపల ఉంటాను " అని " అతిథీ ! నా మనసు నా వాక్కు ఒక్కటే దీనికి ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు సాక్షి " అన్నాడు. అప్పుడు ఆకాశవాణి " ఇతడు ధన్యుడు అందరూ గౌరవించ తగిన వాడు " అని పలికింది. అప్పుడు లోపల ఉన్న వ్యక్తి తేజోమంతుడై సాక్షాత్కరించి " సుదర్శనా ! నేను ధర్మదేవతను. నీ చిత్తము ఎటువంటిదో తెలుసుకోవడానికి వచ్చాను. నీవు నిశ్చలవ్రతుడవు. నీవు ధర్మము ఎప్పుడు తప్పుతావో అప్పుడు నిన్ను చంపాలని మృత్యుదేవత నీ వెంటనే పొంచి ఉన్నది. కాని నీవు మృత్యువును జయించావు. నీ భార్య కూడా మహాపతివ్రత. మీరు సశరీరంగా ఊర్ధ్వలోక ప్రవేశానికి అర్హులు. కనుక మీకు ఎప్పుడు ఊర్ధ్వలోకాలకు రావాలని అనిపిస్తుందో అప్పుడే ఊర్ధ్వలోకాలకు భార్యాసమేతంగా రావచ్చు. నీవు చేసిన సగభాగం తపః ఫలము చేత నీ భార్య ఓఘవతి పుణ్యనది అయి ఈ లోకములో ప్రవహిస్తూ జనులను పావనం చేస్తుంది. మిగిలిన సగం తపః ఫలము వలన నీకు సేవచేస్తుంది. నేను నీ ఇంటికి రావడము నీ భార్యను కోరడమూ అన్నీ నీ కీర్తి లోకాలకు తెలియజేయడానికే నేను కల్పించాను. అంతే కాని నీ భార్యశీలానికి ఎంటువంటి హానీ జరగలేదు . ఇది నిజము " అని పలికి అంతర్ధానం అయింది. ధర్మనందనా ! ఇదీ ఓఘవతీనది చరిత్ర. ఈ కథసారాంశం ఏమంటే గృహస్థుకు అతిథి పూజకు మించిన పరమధర్మము వేరొకటి లేదు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.



*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: