హిందూమత సాంప్రదాయంలో జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు.
దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును?
మోక్షస్వరూపం ఎలాంటిది?
జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి?
ఇటువంటి ప్రశ్నలకు దర్శనాలలో సమాధానాలు చెప్పబడ్డాయి. వాటిలో ఆరు ముఖ్యమైనవి వాటినే షడ్దర్శనములు అంటారు.
సాంఖ్య దర్శనము:
కపిల మహర్షిచే ప్రవర్తింపజేయబడినది. ప్రకృతి లేక మూల ప్రకృతి విశ్వసృష్టికి కారణమని సాంఖ్య సిద్ధాంతము. ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుష సంయోగమువలన బుద్ధి జనించును. పురుషుడు బుద్ధిచేయు చేష్టలను తనవిగా భావించుకొని సంసారములో బంధింపబడును. ప్రకృతి, పురుషుల స్వభావమును గ్రహించి, ఈ బంధమునుండి విడివడుటయే మోక్షము.
యోగ దర్శనము: పతంజలి మహర్షి యోగదర్శనమును రచించెను. ఇందులో మనసును నిగ్రహించుటకు తగిన ఉపాయములు బోధింపబడినవి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యఅహారము, ధ్యానము, ధారణ, సమాధి అను పది రకములైన అభ్యాసములచే మానవుడు ప్రకృతి-పురుష వివేకము పొంది ముక్తుడగును.
న్యాయ దర్శనము:
న్యాయ దర్శనము శాస్త్రములకు శాస్త్రమని అర్ధము. దీనికి మరో పేరు తర్కశాస్త్రము. అంత మాత్రము చేత న్యాయ దర్శనమును తర్క శాస్త్రము అని అనరాదు.
తాత్విక సమస్యలపై వాదోపవాదాలకు అవసరమైన నియమ నిబంధనలే న్యాయ దర్శనముగా గౌతమ మహర్షి సూత్రబద్దం చేసాడు. దీనిలో మొత్తం 524 సూత్రాలు ఉన్నాయి.
న్యాయదర్శనం యొక్క పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం) ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది. అవి: ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి, నిగ్రహ స్థానం.
వైశేషిక దర్శనము:
వైశేషిక దర్శనమును కణాద మహర్షి ప్రవర్తింపజేశారు. ఈ రెండు దర్శనాలలో చాలావిధాలుగా పోలికలున్నాయి. ప్రపంచము పరమాణువులచే నిర్మించబడినది. కుండను చేయడానికి కుమ్మరి ఉండాలి గదా! అలాగే సృష్టిని చేసేవాడొకడుండాలి. అతడే భగవంతుడు. అని న్యాయదర్శనములో చెప్పారు.
జీవులు కర్మ బద్ధులై సుఖదుఃఖములను అనుభవిస్తున్నారు. సత్కర్మలను భగవత్ప్రీతి కోసం చేసేవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వారికి యోగమార్గంలో మోక్షం లభిస్తుంది.
పూర్వమీమాంస: వేదముల మొదటి భాగం ఆధారంగా ఏర్పడింది పూర్వ మీమాంస దర్శనము. ఈ దర్శన కర్త జైమిని మహర్షి. ఇది వేదములలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలకు ప్రాముఖ్యము ఇస్తుంది. వేద నిషిద్ధములైన కర్మలు చేసేవారు నరకానికి వెళతారు. లేదా క్రిమికీటకాది నీచ జన్మలు పొందుతారు. వేదాలలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలు చేసేవారు స్వర్గానికి వెళతారు. కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే వాదాన్ని పూర్వమీమాంస అంగీకరింపదు.
ఉత్తరమీమాంస: వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనము అనీ, బ్రహ్మసూత్రములు అనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. ఇది ఆరు దర్శనములలోను ప్రముఖ స్థానము ఆక్రమించుచున్నది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. వాటిలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు సిద్ధాంతములు ప్రసిద్ధములు.
ఇవన్నీ వేదములు ప్రమాణంగా చెప్పబడిన దర్శనాలు. ఇవే కాక వేదములను అంగీకరింపని వారు (చార్వాకులు, బౌద్ధులు, జైనులు ఇలాంటి వారు) చెప్పిన దర్శనాలు కూడా ఉన్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి