30, జూన్ 2020, మంగళవారం

ప్రభావిద్య

గతంలో తరుణీవిద్యను ఉపదేశించారు. ఇప్పుడు తరుణీ విద్యకు ఆంగభూతమైన ప్రభావిద్యను ఉపదేశిస్తున్నారు. ఆ పరమేశ్వరి కోటి సూర్యప్రభలతో వెలుగొందుతూ ఉంటుంది. ఇక్కడ కోటి అనే
నామం సంఖ్యావాచకం కాదు. అనేకానేకమైనటువంటి, లెక్కలేనటువంటి కాంతి కిరణము లతో ఆ పరమేశ్వరి విరాజిల్లుతుంటుంది. భైరవయామళంలో పరమేశ్వరుడు పార్వతీ
దేవికి శ్రీవిద్యను వివరిస్తూ పంచభూతాలు, తన్మాత్రలు, ఇంద్రియాలు, మనస్సు, మాయ, శుద్ధవిద్య, మహేశ్వరుడు, సదాశివుడు ఈ ఇరవైఐదు తత్వాలకు అతీతంగా ఆ పరమేశ్వరి
బిందువునందు ఉంటుంది. ఆమె శరీరం నుంచి ప్రకాశవంతమైన కాంతికిరణాలు వస్తున్నాయి. ఆ కిరణాలు వేయి, రెండువేలు, లక్ష, కోటి, అర్బుదము ఇంకా లెక్కపెట్టటానికి వీలుకాదు అంటున్నాడు. అంటే లెక్కపెట్టలేనన్ని, లెక్కపెట్టటానికి వీలుకానన్ని కిరణాలు
ఆ పరమేశ్వరి శరీరం నుంచి వస్తున్నాయి. ఆ కిరణాలవల్లనే ఈ చరాచరజగత్తంతా ప్రవర్తిల్లుతున్నది.

బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుణ్ణి జనకమహారాజు అడుగుతాడు.

జనకుడు : స్వామీ ! ఈ జగత్తులోని కార్యక్రమాలన్నీ దేనివల్ల జరుగుతున్నాయి?
యాజ్ఞవల్క్యుడు : సూర్యుని యొక్క వెలుగువల్ల. సూర్యుని వెలుగులోనే జీవులన్నీ కూడా తమకు కావలసినచోటికి పోయి, మళ్ళీ ఆ వెలుగులోనే తిరిగివస్తాయి. తమ కిష్టమైన కార్యాలు చేస్తాయి.
జ: మరి సూర్యకాంతులు ఎప్పుడూ ఉండవుకదా ? సూర్యుడు లేనప్పుడు ఏరకంగా కార్యక్రమాలు జరుగుతాయి ? అంటే రాత్రులందు ఏరకంగా జరుగుతుంది.
యా: చంద్రుని కాంతులతో చంద్రుని కాంతిలో జనులు తమ పనులు నిర్వర్తించుకుంటారు.
జ: సూర్యుడు చంద్రుడు ఇద్దరూ లేనప్పుడు అంటే సంధ్యవేళలయందు కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతాయి ?
యా : అగ్నికాంతులతో అంటే దీపపు వెలుగులతో జరుగుతాయి.
జ: అయితే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఎవరూ లేనప్పుడు కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? వాక్కువల్ల, వాక్కు అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చేరుతుంది. దానివల్ల పనులు జరుగుతాయి.
యా: జ: మరి వాక్కు కూడా లేప్పుడు ఎలా జరుగుతుంది ? అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని వాక్కు లేవు. అంతా చీకట్లు, అప్పుడు ఏం జరుగుతుంది ?
యా : ఆత్మవల్ల జరుగుతుంది. పెనుచీకట్లు దాటిన తరువాత ఆత్మ యొక్క కాంతులవల్ల జగత్తంతా ప్రవర్తిల్లుతుంది. అసలు ఆత్మ యొక్క కాంతులతోనే చరాచరజగత్తు అంతా నడుస్తున్నది. అని చెబుతాడు. కాబట్టి పరమేశ్వరి నుంచి వచ్చే కిరణాలవల్లనే
ఈ జగత్తు అంతా నడుస్తున్నది. ఆ కిరణాలలో అగ్ని 108, సూర్యుడు 116, చంద్రుడు 136 కిరణాలను గ్రహించగలిగారు. ఇప్పుడు సూర్యుని కాంతివల్ల పగలు, చంద్రకాంతుల
వల్ల రాత్రి, సంధ్యవేళలయందు అగ్నికాంతులవల్ల జీవకోటి సంచరిస్తున్నది. ఈ రకంగా అనేక కోట్ల కిరణసముదాయము ఆమె శరీరం నుంచి వస్తుంది. అసలు పరమేశ్వరి అంటే దివ్యమైన తేజోమయమైన కాంతి పుంజము. అందుకే ఆమె ప్రభావతి,
ప్రభారూపా అనబడింది. ఆమె మూలప్రకృతి. వ్యక్తావ్యక్తస్వరూపిణి. వివిధాకారాలతో జగత్తంతా వ్యాపించి ఉన్నది. భక్తుల అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానజ్యోతులు
ప్రసాదిస్తుంది. ఆ దేవి విషయం 388 నుంచి 404 వరకు నామాలలో చెప్పబడింది.

శ్రీమాత్రే నమః

వైదిక ధర్మ ప్రచారం

వెంకటేశ్వర ప్రసాదు

కామెంట్‌లు లేవు: