30, జూన్ 2020, మంగళవారం

విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత.



           విజయనగర పాలకుల కాలంలో తిరుమల శ్రీవారికి లెక్కకు మించిన ధన కనక వస్తు వాహనాలను విజయనగర ప్రభువులు అందించారు. అలాంటి సమయంలో కొంత మంది అర్చకులు స్వామి వారి నగలను ధరించి తిరుగాడటం మహారాజు దృష్టిలో పడింది. ఆగ్రహంతో ఆ మహారాజు తొమ్మండుగురు వైష్ణవ అర్చకులను తన కరవాలంతో కడతేర్చాడు.  నరహత్య మహాపాప మనుకుంటే ఏకంగా  తొమ్మండుగురిని ఆలయంలోనే మట్టుపెట్టాడు మహారాజు. 
            అత్యంత పవిత్రమైన దేవాలయంలో జరిగిన యీ ఘోరమైన పాప పరిహారానికి నడుము బిగించారు విజయనగర సామ్రాజ్య రాజ గురువులైన శ్రీ వ్యాసరాయలవారు.  12 సంవత్సరములపాటు రాజగురువులు శ్రీవారి గర్భాలయంలో అత్యంత కఠోర దీక్షతో పాప పరిహార పూజాదికములను నిర్వహించారు. ఆ 12 సంవత్సరముల కాలంలో భక్తులకు గర్భగుడి లోని మూలవిరాట్ దర్శనభాగ్యాన్ని నిషేధించారు. 
           అందుకు ప్రతిగా ఆనందనిలయ విమానం మొదటి అంతస్తులో శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యార్చన దర్శనాదులకు ఆటంకం లేకుండా చేయబడింది. ఈ విగ్రహం ఆనందనిలయానికి ఉత్తర వాయువ్యం మూలకు వుంటుంది. శ్రీవారి మూలమూర్తి రూపానికి యిదొక్కటే ప్రతిరూపంగా సంభావింపబడుతూ ఆనందనిలయ విమాన వేంకటేశ్వరునిగా ప్రసిధ్ధిగాంచారు. 
          గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చే వాడైతే ఈ విమాన వేంకటేశ్వరుడు కేవలం మోక్ష ప్రదాత. అందుకనే ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. 
          గర్భాలయం లో స్వామిని దర్శించుకోవడానికే సమయం సరిపోదు.  కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంత సేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు.  
          ఇదీ సంక్షిప్తంగా శ్రీ విమాన వేంకటేశ్వర స్వామి వారి విషయం.

కామెంట్‌లు లేవు: