ఒకనాడు కృష్ణుణ్ణి వాళ్ళమ్మ యశోద ఉయ్యాలలో పడుక్కోబెట్టి నిద్రపుచ్చుతోoది. ఎంతసేపటికి నిద్ర రావడం లేదు. సాధారణంగా పిల్లలకు నిద్రపట్టనప్పుడు తల్లులు పాటలు పాడడం గాని కథలు చెప్పడం గాని చేస్తూ ఉంటారు. అందువల్ల ఆమె ఒక కథ చెప్పడం ప్రారంభించింది. ఆ బిడ్డ పదునాలుగు భువనాలు తన బొజ్జలో దాచుకున్న వాడు . అందుకనే ఆ తల్లిది అదృష్టం అన్నారు అంతా .
" ఈ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా యేమి నోము నోచె ఈ యశోద " అంటూ !
అవును ఆ అమ్మ యశోదమ్మే ! ఆ అల్లరి వాడు , గొల్ల వాడు , రేపల్లె బాలుడు మన క్రిష్ణయ్యే !రోజు రోజుకీ అల్లరి పెరిగిపోతుందనేమో అల్లరి క్రిష్ణయ్యకి రాముడి కధ చెప్తోంది . గోపాల బాలుడికి కోదండ పాణి కధ. గీతాకారుడికి సీతాపతి కధ .
ఆ కధ మనం చెప్పుకుందాము.
రామో నామ బభూవ ‘హూం ‘ తదబలా సీతేతి ‘హూం ’ తాం పితు
ర్వాచా పంచవటీ వనే విహరతస్తామాహరద్రావణ:
నిద్రార్ధం జననీ కధామితి హరే: హూంకార శృణ్వతః
సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధనురితి ప్రోక్తా: గిర: పాంతు వ: -శ్రీ కృష్ణ కర్ణామృతం
అనగనగా పూర్వం రాముడనే రాజుండేవాడు అంది . కృష్ణుడు ఊ ! అని ఊ కొట్టేడు . ఆయనకొక భార్య ఉంది ఆమె పేరు సీత అంది . మళ్ళా ఊ ! అని ఊకొట్టేడు. వాళ్ళిద్దరూ తండ్రి దశరథుని ఆజ్ఞననుసరించి అయోధ్యను విడిచి అడవుల్లో సoచరిస్తూ ఉండగా అక్కడ పంచవటీవనప్రదేశంలో సీతను రావణుడు అపహరించాడు అంది.
ఈ విధంగా వాళ్ళమ్మ చెబుతున్న తన పుర్వకథనే తన్మయత్వంతో వింటూ ఉండడం వల్ల గతం అంతా జ్ఞాపకం వచ్చేసింది. ప్రస్తుతం తానెవరో మరిచిపోయాడు. తక్షణం రాముడైపోయాడు . అంతే వెంటనే ఒక్క ఉదుటున ఉయ్యాలలోంచి బయటకు దూకి ఆవేశపరవశుడై “ ఓలక్ష్మణా | నా ధనుస్సు (కోదండం) ఎక్కడ ? నా ధనుస్సు ఎక్కడ ? నా ధనుస్సు ఎక్కడ ? అని గట్టిగా అరుస్తున్నాడు. ఈ విధంగా పరవశత్వంతో రామునివలే పలికిన ఆ బాలకృష్ణుని పలుకులు మనలను రక్షించు గాక అని కృష్ణకర్ణామృతకర్త లీలాశుకుడు ఆ అందమైన శ్లోకం రచించాడు .
సీతమ్మ పేరు చెప్పగానే కృష్ణయ్య రాముడయ్యాడు . అనుజుడు లక్ష్మణుడినీ తలుచుకున్నాడు .
ఈ పద్యానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చక్కని వ్యాఖ్యానం చేశారు.
ఇంత చక్కటి పద్యం తెలుగు లో చదువుకుంటే బాగుంటుంది కదా ! ద్రాక్షారామం లో జరిగిన శతావధానం లో గరికపాటి వారికి చక్కటి సమస్య ఇచ్చారు .
ఈ పద్యం స్ఫూర్తి తోనే వారూ పూరించారు
సమస్య : ధనువుందీయుము లక్ష్మణా యని యశోదాసూనుడాత్రంబుగన్
పూరణ :
తనువన్ వాల్చిన బాల కృష్ణుని యశోదా దేవి గీతంబులం
దున జోల్వాడుచూ రామ గాధల మహత్తు( దెల్ప ఊ కొట్టుచున్
దనుజేంద్రుడా జనకాత్మజన్ గొనెనాన్ ఆత్రంబునన్ లేచి నా
ధనువుందీయుము లక్ష్మణా యని యశోదాసూనుడాత్రంబుగన్ !
ఇంతటి మహత్తర శ్లోకాలు, పద్యాలు చదువుకొనడానికి, మళ్ళీ మళ్ళీ ఆ వ్యాఖ్యానాలు మననం చేసుకోవడానికి సమయం లభించిన మనం కూడా అదృష్టవంతులమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి